Skip to main content

స్టార్‌ప్లస్ మహాభారతం సీరియల్‌లో మూలకథకు దారుణ వక్రీకరణ



దూరదర్శన్‌లో 80వ దశకం చివరలో ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమైన రామాయణం, మహాభారతం హిందీ సీరియల్స్‌ను భాషతో సంబంధంలేకుండా దేశవ్యాప్తంగా అత్యధికశాతం ప్రజలు ఆదరించారు. రామానంద్ సాగర్(రామాయణం), బీఆర్ చోప్రా(మహాభారతం) ఆ సీరియళ్ళలో వివిధ పాత్రల స్వభావచిత్రణలో, నిర్మాణ ప్రమాణాలలో, సాంకేతిక విలువలలో ప్రశంశనీయమైన పనితీరు కనబరిచారు. పిల్లా, పెద్దా అందరినీ ఆ సీరియల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సీరియళ్ళ ప్రసార సమయంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయేదంటే వాటికున్న ప్రజాదరణను అంచనావేయొచ్చు. సాగర్, చోప్రా ఇరువురూ తమ సీరియల్స్ నిర్మాణంకోసం పాత తెలుగు పౌరాణిక చిత్రాలను అనుసరించటం మరో విశేషం.

ఇక ప్రస్తుతానికి వస్తే, హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ స్టార్‌ప్లస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌నుంచి రాత్రి 8.30గంటలకు మహాభారతం సీరియల్ ప్రసారమవుతున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రు.120 కోట్ల ఖర్చుతో ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది. మెలోడ్రామాకోసం ఈ సీరియల్ దర్శక, రచయితలు మూలకథను ఇష్టమొచ్చినట్లు మార్చేస్తూ పాత్రల స్వభావాలను తమకనుగుణంగా రూపుదిద్దుతున్నారు. వీరి వక్రీకరణ గురించి మచ్చుకు చెప్పాలంటే, యజ్ఞంద్వారా లభించిన ద్రౌపదిఅంటే ద్రుపదుడికి తీవ్ర ద్వేషం ఉందని వీరి భాష్యం. వాస్తవానికి, అర్జునుడికి భార్య కాగలిగే కుమార్తెను, ద్రోణాచార్యుడిని అంతమొందించే కుమారుడిని కోరుకుంటూ ద్రుపదుడు యజ్ఞం చేస్తాడు. ఇక్కడమాత్రం దానికి పూర్తి విరుద్ధంగా తీశారు. ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని సాగదీసి ఐదారు ఎపిసోడ్‌లపాటు లాగారు. ఆ ద్రౌపది పాత్రధారిని చూస్తే ఏ మూలా అందంగానీ, మంచి రూపురేఖలుగానీ ఉన్నట్లు కనబడవు. దాసికి ఎక్కువ, చెలికత్తెకు తక్కువ.

ఇక ద్రౌపదీ వస్త్రాపహరణం సందర్భంగా ధృతరాష్ట్రుడు, కర్ణుడు చెప్పిన డైలాగులు పరమ దారుణంగా, వారి పాత్ర స్వభావాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. నిండుసభకు తనను లాక్కుని రావటంపై ద్రౌపది ధృతరాష్ట్రుడిని ప్రశ్నిస్తే, దాసివి కాబట్టి దుర్యోధనుడి ఆదేశాలు పాటించి తీరాలంటాడు. కర్ణుడేమో ఆమెను వేశ్య అని నిర్వచిస్తాడు. వాస్తవకథలో వీరిద్దరికీ ధర్మం తెలిసినా, దుర్యోధనుడితో ఉన్న అనుబంధం కారణంగా అతనిని అడ్డుకోరు. ఇక్కడమాత్రం వీరిద్దరి పాత్రలను భ్రష్టు పట్టించారు. తెరపైన నిండుగా, భారీగా కనిపించటం తప్పించి, పాత్రల భావోద్వేగాలను కెమేరా ఎక్కడా చూపించలేకపోవటం మరో పెద్దలోపం. ముఖ్యంగా ద్రౌపదికి నిండుసభలో అవమానం జరుగుతుంటే పంచపాండవులు ప్రదర్శించిన భావోద్వేగాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఆ ఐదుగురూ ఈ ఎపిసోడ్ మొత్తం కన్నీరు కార్చటమొక్కటే చేశారు.

అయితే ఈ సీరియల్‌లో ఏకైక మంచి అంశమైన కృష్ణుడి పాత్రధారి గురించి తప్పక ప్రస్తావించి తీరాలి. అత్యంత ప్రజాదరణ పొందిన మహాదేవ సీరియల్‌లో విష్ణుమూర్తి పాత్రధారి సౌరభ్ రాజ్‌ జైన్ ఈ మహాభారతంలోనూ కృష్ణుడి పాత్రను పోషించారు. అతను మాత్రం ఆ పాత్రకు అతికినట్లు సరిపోయాడని చెప్పాలి. ముఖ్యంగా చక్కటి ముఖం, ఆ ముఖంలో ప్రశాంతత, చిద్విలాసం -  జగన్నాటక సూత్రధారికి ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉండటం విశేషం.

మహాభారతం ఆధారంగా తెలుగులో తీసిన మాయాబజార్‌వంటి చిత్రాలలో మూలకథకు కొద్దిగా మార్పులు, చేర్పులు చేశారుగానీ, పాత్రల స్వభావాలను, అందునా ప్రధాన పాత్రల స్వభావాలను ఎక్కడా ఇష్టమొచ్చినట్లు మార్చలేదు. మహాభారతం, రామాయణంవంటి పురాణాలగురించి తెలియని ఇప్పటితరం పిల్లలు ఈ సీరియల్ చూస్తేమాత్రం మహాభారతాన్ని, అందులోని పాత్రలను తప్పుగా అర్ధం చేసుకునే అవకాశముంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు మన రుషులు ఈ ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన వరాలు. మానవ ధర్మం, మనుషుల స్వభావాలు, మనుషులు అనుసరించవలసిన ఉత్తమ ప్రమాణాలగురించి మతంతో సంబంధంలేకుండా మానవాళి సమస్తం ఈ ఇతిహాసాలద్వారా  ఎంతో నేర్చుకోవచ్చు. అటువంటి కథలను మెలోడ్రామాకోసం చౌకబారుగా చిత్రీకరించటం విచారకరం. మాటీవీవారు ఈ మహత్తర ధారావాహికరాజాన్ని త్వరలో డబ్ చేసి తెలుగువారికి అందించి తరింపజేయబోతున్నారని సమాచారం.


image courtesy:starplus.in

Comments

  1. మీరు చెప్పింది సత్యం. పాత్రల స్వబావాలను పూర్తిగా మార్చేసారు. ఇది ఇప్పటి తరం పిల్లలికి తప్పుడు సంకేతాలను పంపుతుంది.

    ReplyDelete
  2. ఈ కొత్త భారతంలో మీసాల్లేని పాండవుల్ని మొట్టమొదటిసారిగా చూడాల్సొస్తోందేంట్రా బాబూ అని జనం తలలు పట్టుకుంటున్నారు. ప్రతాపశాలులైన రాజవంశీక పురుషులు మీసాల్లేకుండా పేడిమొహాలతో తిరుగుతారా ఎక్కడైనా ? ఈ సీరియల్ లో పాండవులకే కాదు, దాదాపుగా యంగ్ పాత్రలు వేటికీ మీసాల్లేవు. ఆ మధ్య 1950 - 60 లలో దిలీప్ కుమార్ ప్రవేశపెట్టిన ఈ స్టైల్ కి హిందూ పౌరాణిక పాత్రల్ని బలిచేయడం సమంజసమా ? అనే ఇంగితం ఆ నిర్మాతా-దర్శకులకు లేదు. తనను సభకు లాక్కుపోబోయిన దుశ్శాసనుడి ఒరలోని కత్తిని ద్రౌపది లాగినట్లు చూపించారు. అసలా ఘట్టం ఎక్కడుంది ? అంతా మన ఖర్మ.

    ReplyDelete
  3. కాలం గడిచే కొలదీ, మనుష్యుల స్వభావాల్లో వస్తున్న వికృతమైన పోకడలకు అనుకూలంగానే కళారూపాల్లోనూ పెడధోరణులు చోటుచేసుకుంటాయి. కళారూపాలన్నప్పుడు వాటిలో సాహిత్యనాటకాది సమస్తమైన కళారూపాలూ ఉన్నాయి వింతమార్పులకు లోబడేవి.

    నేడు సాహిత్యకారులు తమతమ ప్రియతమసిధ్ధాంతాలను వ్యాప్తిచేసుకుందుకు భారతీయపురాణేతిహాసకథలను వేదికలుగా వాడుకుంటున్నారు. వాటిలోని ఘట్టాలకూ పాత్రలకూ తతమసిధ్ధాంతాలకు అనుగుణమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సమాజం పట్ల నిబధ్ధతా, ప్రాచీనసాహిత్యగౌరవం కాపాడవలసిన బాధ్యతా ఉన్న సాహిత్యకారుల ధోరణియే యిలా ఉంటే దబ్బుకోసం సినిమాలూ సీరియళ్ళూ తీసేవారూ, కేవలం పొట్టకూటికోసం వాటిలో నటించే వారూ ప్రాచీనసాహిత్యగౌరవాభిమానాలను ఏమాత్రం పరిరక్షిస్తారు? రాబోయే తరాలవాళ్ళకు మన పెద్దమనుషులు కేవలం డబ్బుయాయా, వెకిలితనమూ తప్ప యేమీ నేర్పుతున్నట్లు లేదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర