Wednesday, February 2, 2011

అమెరికా విద్యార్ధికి ఒక్కరికైనా భారత్‌లో ఇలా జరిగితే ఊరుకునేవారా?


చింత చచ్చినా పులుపు చావనట్లు...ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయి అగ్రరాజ్య హోదా పోగొట్టుకునే దశలో ఉన్నా, అమెరికా ఇంకా దురహంకార వైఖరిని విడనాడడంలేదు. ఇంకా తమకొకన్యాయమూ, ఎదుటివారికొక న్యాయమన్నట్లుగానే వ్యవహరిస్తోంది. మెక్సికో గల్ఫ్ లో చమురు లీకేజికిగానూ BP ఆయిల్ కంపెనీనుంచి చెవులు మెలిపెట్టి మరీ నష్టపరిహారం కట్టించిన అంకుల్ శామ్...భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారం విషయంలో మాత్రం సెలెక్టివ్ అమ్నీషియా(మతిమరుపు)ను తెచ్చిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత పర్యటనలో మనదేశాన్ని, సమకాలీన పరిస్థితులలో ప్రపంచంలో మనదేశ ప్రాధాన్యతను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడి, అమెరికాఉత్పత్తుల అమ్మకాలకోసం వేలకోట్లరూపాయల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిన ఒబామాకు, ట్రైవ్యాలీ యూనివర్సిటీ చేతిలో మోసపోయిన భారతీయ విద్యార్ధుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం లేదా?

ఆ భారతీయ విద్యార్ధులంతా అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత వంటి విధ్వంసరచనకు వెళ్ళిన ఉగ్రవాదులో, లేకపోతే మెక్సికోతీరంనుంచి పోలీసుల కళ్ళుగప్పి అక్రమంగా చొరబడే వలసదారులో కాదుకదా. అలా వెళ్ళిన సంఘ వ్యతిరేకశక్తులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ పెట్టీ కేసుల విషయంలో తమ ప్రతాపాన్ని చూపుతూ తమ పోలీసుల mediocrityని బయటపెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ నేరంలో ఆ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది. వీరందరికీ వీసాలు మంజూరు చేసేటపుడే ఆ యూనివర్సిటీ గురించి, దాని గత చరిత్ర గురించి విచారించడం ఇమ్మిగ్రేషన్ అధికారుల బాధ్యత కాదా? ఒక్క క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీ గురించిన ఫీడ్ బ్యాక్, దానికి గుర్తింపు ఉందా, లేదా అనే సమాచారం మొత్తం కళ్ళెదుట ఉంటుంది కదా(అంత అభివృద్ధి చెందిన దేశంలో ఏ మనిషిదిగానీ, సంస్థదిగానీ సమగ్రసమాచారం కంప్యూటర్ లో అందుబాటులో ఉండకుండా ఉండే అవకాశంలేదు).

తమ దళాలు మోహరించిఉన్న ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో ఒక్క సైనికుడు కనబడకుండా పోయినా, అతనికోసం ఆయా దేశాలలో అమెరికా పెద్దఎత్తున అల్లకల్లోలం సృష్టించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి దేశానికి చెందిన విద్యార్ధో, పర్యాటకుడో భారత్ లో ఇలా పట్టుబడితే ఆ ప్రభుత్వం ఇలా ఊరుకుని ఉండేదా. ఆ వ్యక్తిని వదిలేదాకా భారత ప్రధాని దగ్గరనుంచి కానిస్టేబుల్ వరకూ ఎవరినీ ఊపిరి తీసుకోనిచ్చేదికాదు. మరి ఇంతమంది(వేయికి పైగా అనుకుంటా) భారతీయ విద్యార్ధుల విషయంలో ఎందుకీ న్యాయం? వేలమంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీకి నాడు సీఈవోగా ఉన్న ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి ఎందుకు అప్పజెప్పలేదు?

బాధితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుకుగానే వ్యవహరిస్తోందని చెప్పాలి. విదేశాంగ వ్యవహరాల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిరుపమారావును ప్రత్యేకంగా ఈ విషయంపైనే నేడో, రేపో వాషింగ్టన్ పంపిస్తున్నారు. అయితే కేవలం ఇమ్మిగ్రేషన్ అధికారులతో చర్చిస్తే ఉపయోగం ఉండదు. ఆమె అక్కడ ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్ తోనూ, అధ్యక్షుడు ఒబామాతోనూ ఈ విషయం చర్చిస్తేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. అమెరికాలో ముందునించి స్థిరపడిఉన్న ఎన్నారైలు బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారికి అండగా నిలవడం ఒక మంచి పరిణామం. మరోవైపు భారత్ తిరిగివెళ్ళి మళ్ళీ అప్లయ్ చేసుకుంటే తాజా వీసాలు ఇస్తామని అమెరికా ప్రభుత్వం చెబుతున్నా బాధితులు నమ్మడంలేదు. ఎంతో కష్టపడి, డబ్బు ఖర్చుపెట్టి ఇక్కడకు వచ్చాం కాబట్టి ఎలాగైనా అక్కడే వేరే యూనివర్సిటీలో సీటు సంపాదించుకునితీరాలని బాధితులు కొంతమంది పట్టుదలగా ఉన్నారు.

Tuesday, February 1, 2011

వెన్నుచూపి పారిపోనందుకు మొత్తానికి చిరుకు మంచి ప్రతిఫలమే దక్కేటట్లుంది


వ్రతం చెడ్డా ఫలం దక్కడమంటే ఇదేనేమో. మొత్తానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా చిరంజీవికి ఏదో గౌరవప్రదమైన స్థానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకానొక సమయంలో చిరంజీవి తన పార్టీని రద్దు చేసేస్తారని, మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతారని పుకార్లు జోరుగా వినిపించాయి. ప్రజారాజ్యం దుకాణం బంద్ అని, పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మీడియాలో...ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలలో కొంతకాలంగా ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా తెలంగాణాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(అనిల్, మహేశ్వరరెడ్డి) ఉన్నా లేనట్లే. రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(శోభానాగిరెడ్డి, కాటసాని) జగన్ వర్గంలో చేరిపోయారు. ఇక ఉన్న 14మందిలో కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా జగన్ వర్గంమనిషే. ఇక నికరంగా చూస్తే 13మంది ఉన్నట్లు.

ఒక విషయంలో చిరుని మెచ్చుకోవాలి. రాష్ట్రంలో అంత భారీస్థాయిలో ఆసక్తిరేపుతూ సంచలనాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చి, తీరా ఎన్నికల్లో తుస్సుమన్న తర్వాత – ఎవరయినా ఛీ మనకెందుకు ఈ రొచ్చు అని వెనక్కి పారిపోయి ఉండేవారేమో(వెనకకు వెళితే సినిమాఫీల్డులో మరో ఐదారేళ్ళు కెరీర్ కొనసాగించే అవకాశాలున్నాయి కాబట్టి). అయితే ఆ పనిచేయకుండా అంటిపెట్టుకుని ఉన్నందుకు చిరంజీవికి మంచి ఫలితమే దక్కుతున్నట్లుగా అనిపిస్తోంది...తాజా పరిణామాలు చూస్తుంటే. రాజకీయాలలో అపజయం ఎదురయినా వదలబోనని, విజయం సాధించేవరకు పోరాడతానని మొదటినుంచీ(రాజకీయరంగ ప్రవేశం వార్తల వస్తున్న దగ్గరనుంచి) చెబుతూ వస్తున్న చిరంజీవి, దానికి కట్టుబడిఉండటమే ఈ సత్ఫలితానికి కారణం అయిఉండొచ్చు.

గత ఎన్నికల్లో చిరంజీవి పరాజయానికి కారణాలపై ఇప్పటికే ఎంతో చర్చ జరిగినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చూద్దాం.
1. రాజకీయాల్లోకి తనంతతానుగా కాక బంధుమిత్రుల ప్రోద్బలంతో అన్యమనస్కంగా ప్రవేశించడం, సంకల్పం బలంగా లేకపోవడం
2. పార్టీ నిర్మాణాన్ని అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మాణంలాగా జరపడం.
3. ఉవ్వెత్తున వచ్చిన ఆదరణను, అభిమానాన్ని క్రమపద్ధతిలో నిలుపుకోకుండా నిర్లక్ష్యం చేయడం.
4. పార్టీకి థింక్ ట్యాంక్, ఐడియాలజీ లేకపోవడం.
5. పార్టీలోకి వచ్చిన మేధావులను సక్రమంగా వినియోగించుకోకుండా, పార్టీ వ్యవహరాలను సొంత కుటుంబ వ్యవహారంలాగా నడపడం.
6. పర్యటించిన ప్రతిచోటికీ వేల, లక్షలమంది ప్రజలు వస్తే...అలాంటి అపూర్వ అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ప్రసంగాలతో ఆకట్టుకోవలసిందిపోయి, జనం వచ్చారని సంబరపడి తృప్తిపడిపోయారు
7. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మంచి లక్ష్యాలతో నడుపుతున్నప్పటికీ ప్రత్యర్ధులు వాటిమీద లేనిపోని ఆరోపణలు చేస్తే, వాటిని తిప్పికొట్టకపోగా, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రజలు తమ వెనకే ఉన్నారని విర్రవీగారు.
8. అరవింద్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ప్రజలందరూ నమ్ముతున్నా, చిరంజీవి మాత్రం నమ్మకపోవడం...కనీసం డేమేజ్ కంట్రోల్ చేయకపోవడం.
9. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అవగాహనాలోపం.
10. ప్రత్యర్ధుల ప్రాపగాండాని ఎదుర్కోవడానికి, తమ వాదనను వినిపించుకోడానికి సొంత మీడియా ఉండాలన్న ప్రాధమిక సూత్రాన్ని కూడా పట్టించుకోకపోవడం.

ఏది ఏమైనా...ప్రజారాజ్యం అస్తిత్వంమీద ప్రజలందరికీ అనుమానాలు రేకెత్తుతున్న ఈ సమయంలో, ఆ పార్టీని ఇంకా అంటిపెట్టుకునిఉన్న వీరాభిమానులు కూడా పునరాలోచన పడుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ నుంచి ఈ అవకాశం రావడం చిరుకు ఎంతోకొంత శుభ పరిణామమేనని చెప్పొచ్చు. పీఆర్పీకి కొంత పునరుజ్జీవం లభించినట్లయింది. నానాటికీ ఇమేజ్ దిగజారిపోతున్న ఆ పార్టీ కోలుకోడానికి అవకాశం దొరికింది. ఊళ్ళలో ఉన్న పీఆర్పీ, చిరంజీవి అభిమానులు కాస్త తలెత్తుకుని తిరగగలిగేటట్లయింది. దీనిని నిలబెట్టుకోడానికి చిరంజీవి ప్రయత్నించాలి ఇప్పటికైనా మేలుకుని వ్యూహాలను మార్చుకుని... రాజకీయరంగప్రవేశం చేసి తాను సాధించిందేమిటి,ఇకముందు ఏమిచేయాలి అనేదానిపై చక్కటి అవగాహనకొస్తే మంచిది. వీటన్నటికంటే అరవింద్ మీద ఆధారపడకుండా, అతనిని పక్కనబెట్టి సొంత వ్యక్తిత్వంతో, సొంత ఆలోచనలతో ముందుకు సాగాలి.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts