Sunday, April 10, 2011

పదిరోజుల వ్యవధిలో(జాతి మొత్తం ఏకమై నిలిచిన) రెండు చరిత్రాత్మక సందర్భాలుగత పదిరోజులుగా దేశానికి ఏదో మంచి దశ నడుస్తున్నట్లుంది. లేకపోతే కుల, మత, వర్గ, ప్రాంత, సంస్కృతుల విబేధాలు, వైషమ్యాలతో రగిలే భరతజాతి మొత్తం ఒక్కసారికాదు, రెండుసార్లు ఏకతాటిపైకి రావడమంటే మాటలా. ఈ అరుదైన శుభపరిణామాలకు నాంది పలికింది ఒకసారి క్రికెట్టయితే, రెండోసారి అవినీతిపై పోరు.

ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా జాతిమొత్తం, ఆసేతుహిమాచలమూ భారతజట్టు గెలుపుకోసం తపన చెందింది. పిల్లలు, యువతీయువకులు సరే...క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోనివారు, పెద్దవారు, ఆడవాళ్ళు సైతం ఈ రెండు మ్యాచ్ ల సందర్భంగా మనదేశ జట్టుగెలవాలని బలంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. ఈ రెండు మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో దేశమంతటా - కర్ఫ్యూ కాదుగానీ - 144వ సెక్షన్ విధించినట్లయిందని చెప్పుకోవచ్చు. అందరూ టీవీసెట్లకు అతుక్కుపోయారు. రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తానికి 120కోట్లమంది ప్రార్ధనలు ఫలించాయో ఏమోగానీ భారతజట్టు ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్రపంచ కప్ సాధించి జాతిని ఆనందసాగరంలో ఓలలాడించింది. జనం తమ సమస్యలను, కష్టాలను, విబేధాలను పక్కనబెట్టి మరీ ఒకరినొకరు అభినందించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇదే అరుదయిన సందర్భమనుకుంటే మళ్ళీ వారంరోజులలోనే అలాంటి పరిణామమే చోటుచేసుకోవడం అపూర్వమే.

అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోక్ పాల్ వ్యవస్థకోసం అన్నాహజారే జరిపిన ఆమరణ నిరాహారదీక్ష కూడా జాతిలో ఓ అపూర్వ కదలిక తీసుకువచ్చింది. మొదట ఓ మోస్తరుగా ఉన్న మద్దతు గంటగంటకూ పెరిగిపోతూ నిరాహారదీక్ష చేసిన 96గంటలలో పతాకస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో అన్నాహజారేకు మద్దతుగా జనం ప్రదర్శనలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ మద్దతు పెరుగుతుండటం గమనించిన వివిధపార్టీల రాజకీయనాయకులు...తాముకూడా అవినీతికి వ్యతిరేకమేనంటూ అన్నాహజారేకు మద్దతుపలకడం ప్రారంభించారు. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం దిగివచ్చి లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించింది. బంద్ లు, ఆందోళనలు, హర్తాళ్ లు ఏమీ జరపకుండా పూర్తిగా గాంధేయమార్గంలో సాగిన అన్నాహజారే ఉద్యమం విజయవంతమవడం ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికి, రాజకీయపార్టీలకు గుణపాఠంగా నిలిచింది. ఈ ఉద్యమంవలన తక్షణమే ఏదో జరుగుతుందని ఆశించలేకపోయినా దేశప్రజలలో అనూహ్య చైతన్యం తీసుకురావడం గొప్ప శుభపరిణామమని చెప్పుకోవచ్చు.

భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఈ రెండు అరుదైన సందర్భాలకు మనం ప్రత్యక్షసాక్షులు కావడం మన అదృష్టమని భావించొచ్చేమో. ఇదే స్ఫూర్తి, స్పందన, చైతన్యం, ఐకమత్యం, సంఘీభావం కొనసాగితే భారతదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతూ అగ్రరాజ్యంగా నిలబడటానికి ఎంతో కాలం పట్టదు.

Thursday, April 7, 2011

మూర్తీభవించిన స్త్రీత్వం సుజాత


ఒద్దిక, అణకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం, అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాతగారిని చెప్పొచ్చు. అసలు ఆమెలో ప్రత్యేకత ఏమిటంటే...సున్నితభావాలతోబాటు ఆత్మాభిమానం, గాంభీర్యం, హుందాతనం పరిణతి, స్పష్టత, మానసికధృడత్వం, ఖచ్చితత్వం(ఎసర్టివ్ నెస్) వంటి భావాలను కూడా ఆమె బ్రహ్మాండంగా పలికించేవారు. మిరుమిట్లుగొలిపే అందం కాకపోయినా స్ఫురద్రూపం. మంచి ఎత్తు, చక్కటి కనుముక్కుతీరు. మాతృభాష మళయాళం కాగా, తెలుగులోనే డైలాగులు చెప్పడంకోసం మన భాషను కూడా నేర్చుకున్నారు. మొదట్లో చౌకబారు(మళయాళీ) సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత, తర్వాత తనకు తాను ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దానికే కట్టుబడిఉండటం గొప్పవిషయం(ఫీల్డులో నిలబడటంకోసం దాదాపుగా ప్రతి టాప్ హీరోయిన్ కూడా మొదట్లో చౌకబారు వేషాలు వేసినవారే).

తెరమీదలాగానే, తెరవెనక కూడా ఒద్దికగా, అణకువగా ఉండే ఆమె సహజ స్వభావంవలనో, అదృష్టంవలనోగానీ, సుజాతగారికి మంచి మంచి పాత్రలు లభించాయి. ముఖ్యంగా అవళ్ ఒరు తొడర్ కథై(అంతులేనికథ), అన్నక్కిళి(రామచిలుక), అవర్ గళ్(ఇది కథకాదు), గుప్పెడుమనసు, గోరింటాకు, సుజాత(ఈ సినిమాలో ద్విపాత్రాభినయం) వంటి చిత్రాలలో ఉన్నత వ్యక్తిత్వంగల స్త్రీ పాత్రలను ఆమె తన ప్రతిభతో పండించారు(పైవాటిలోని మొదటి మూడు సినిమాలలోని పాత్రలను తెలుగులో జయప్రద, వాణిశ్రీ, జయసుధ పోషించారు). ఆమె హావభావాలు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్...వగైరా అన్నీ ఫక్తు సంప్రదాయ మహిళను తలపించేవి.

తమిళంలో బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చిత్రాలలో సుజాతగారికి మంచి పాత్రలు(author backed roles) లభించాయి. ముఖ్యంగా గోరింటాకులో ఆమె విశిష్ట ప్రతిభ కనబరచింది. శోభన్ బాబుతో ప్రణయ సన్నివేశాలలో ఎంత సున్నితంగా, లలితంగా కనిపిస్తుందో...కట్టుకున్న భర్త(దేవదాస్ కనకాల) మోసగాడని తెలిసి అతనిని నిలదీసేటప్పుడు అంతే కఠినంగా కనబడుతుంది. వయసుపైబడేకొద్దీ హుందాగా తల్లిపాత్రలు తీసుకుని అక్కడా తన ముద్ర వేసుకుంది. రజనీకాంత్ సినిమాలు చాలావాటిలో అతనికి తల్లిపాత్ర వేసింది. ఇక తెలుగులో పెళ్ళి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమసహాయనటిగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. కొన్నాళ్ళుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస తీసుకోవడంతో దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయినట్లయింది.

Friday, April 1, 2011

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయిన 'శక్తి'


నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'శక్తి' విడుదలవడం...మొదటి షో నుంచే నిర్ద్వంద్వంగా ఫ్లాప్ టాక్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. నిజంగా నందమూరి అభిమానులకు ఇది ఆశనిపాతమే. ఒక టాప్ హీరో సినిమాకోసం అతని అభిమానులు రోజుల తరబడి కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుంటారు. అది ఫ్లాపయితే వాళ్ళు... తమ హీరో కంటే ఎక్కువ బాధపడతారు. మళ్ళా తర్వాత సినిమాకోసం ఎదురు చూపులు మొదలుపెడతారు. అందుకనే అగ్రహీరోలు సినిమాలను ఒప్పుకునేటప్పుడు తమ విచక్షణతోబాటు అభిమానుల ఆశలను, అంచనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

తెలుగు సినిమా పరిశ్రమలో ముందున్న రికార్డులకంటే 50-60% అధికంగా కలెక్షన్లు వసూలు చేసి(సాధారణంగా ఇది 10-15% ఉంటుంది), కనీవినీ ఎరగని రికార్డులను స్థాపించిన 'మగధీర'ను తలదన్నే సినిమా చేయాలని ఎన్టీఆర్ కన్న కలలను దర్శకుడు మెహర్ రమేష్ కాలరాశాడు. నిర్మాత అశ్వనీదత్ ఇచ్చిన వనరులను, అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోయాడు(బడ్జెట్ ఎంతో చెబితే ఆ మొత్తాన్ని రమేష్ ఖాతాలో డిపాజిట్ చేస్తానని సినిమా ప్రారంభానికి ముందే దత్ చెప్పాడట). మగధీరను చూసి శక్తి స్టోరీ తయారు చేసుకున్నాడు(ఈయనగారు చేసిన మొదటి సినిమా-కంత్రీ మరో బంపర్ హిట్ సినిమా పోకిరికి కాపీ). ఏమాత్రం కొత్తదనం లేకుండా ప్రతిచోటా మగధీరను తలపిస్తూ తీయడంతో దానితో పోల్చుకోవడం సహజం. మగధీర ప్రమాణాలతో ఎక్కడా తూగకపోవడంతో సినిమా హాస్యాస్పదంగా మారిపోయింది.

అయితే దీనిలో ఎన్టీఆర్ తప్పు కూడా లేదనలేము. కౌలాలంపూర్ లో వేరే సినిమా షూటింగులో ఉన్న తనకు...(వేరే హీరోకోసం సిద్ధంచేసుకున్న)ఈ స్టోరీని రమేష్ వినిపిస్తే...ఇది తానుకాక ఎవరు చేస్తారంటూ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఎన్టీఆరే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సినిమాల ఎంపికలో అతను మరింత జాగ్రత్తపడాలి.

ఇప్పటికే 'లోకల్ టీవీ'తో నష్టాలపాలయిన అశ్వనీదత్తుకు(ఛానల్ ను ప్రైమ్ స్లాట్ లో పెట్టేందుకు కేబుల్ ఆపరేటర్లకు విపరీతమైన ఛార్జీలు ఇచ్చి లాభాలు గూబల్లోకి వచ్చేటట్లు చేసిందట దత్తుగారి కుమార్తె స్వప్న) ఇది మరో దెబ్బే. దానికితోడు, రేపు(02.04.11) వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగా దెబ్బతింటాయని ఇండస్ట్రీవర్గాలు ముందే చెప్పాయి. అసలు, ఫలితం ముందే తెలిసిపోయిందో, ఏమో శక్తికి పబ్లిసిటీ కూడా లో ప్రొఫైల్ లో చేశారు.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts