Monday, April 7, 2014

వీరనారి విజయశాంతి, ఫైర్‌బ్రాండ్ రేణుకలకు భంగపాటు


మెదక్‌సీటు నాదే ఎన్నోరోజులనుంచీ ధీమాగా చెప్పుకుంటూ వచ్చిన రాములమ్మకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఆమెను మెదక్ అసెంబ్లీసీటుకు పరిమితం చేసింది. మెదక్ పార్లమెంట్ సీటును నిన్నటిదాకా జగన్ పార్టీలో చురుకుగా పనిచేసిన డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి అనే అపరిచితుడికి ఇచ్చింది. మెదక్‌నుంచి తానుగానీ, కుమార్తె కవితగానీ, రమణాచారిగానీ నిలబడాలని యోచిస్తున్న కేసీఆర్, ఢిల్లీ లెవెల్‌లో పావులు కదిపి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి ఈ టికెట్ కేటాయించేలా చేసినట్లు సమాచారం.

అసలు విజయశాంతి టీఆర్ఎస్‌నుంచి బయటకు రావటానికి కారణమే మెదక్ పార్లమెంట్ సీటు. 2009లో తమ పార్టీలోకొచ్చిన విజయశాంతికోసం - కేసీఆర్ సురక్షితమైన మెదక్ సీటును త్యాగం చేసి మహబూబ్‌నగర్‌కు వెళ్ళారు. అక్కడ చాలా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఈ సారిమాత్రం విజయశాంతికి మెదక్‌ను ఇవ్వగూడదని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఇది మెల్లమెల్లగా రాములమ్మకుకూడా అర్ధమైంది. దాంతో వారిద్దరిమధ్యా సంబంధాలు చెడి పార్టీనుంచి ఆమె నిష్క్రమణకు కారణమయింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాతకూడా తనకు మెదక్ సీటు కేటాయిస్తానని సోనియా హామీ ఇచ్చినట్లు రాములమ్మ అందరికీ చెప్పుకున్నారు. చివరికి చూస్తే మెదక్ సీటే ఇచ్చారుగానీ, అసెంబ్లీతో సరిపుచ్చారు. ఖంగుతిన్న రాములమ్మ, బయటకుమాత్రం అధిష్టానం తనను మెదక్ పార్లమెంట్‌గానీ, అసెంబ్లీగానీ కోరుకోమందని, తానే అసెంబ్లీ కోరుకున్నానంటూ కవరింగ్ చేసుకుంటున్నారు.

ఇక ఖమ్మం ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పరిస్థితి మరీ దారుణం. విజయశాంతికి అసెంబ్లీ టికెట్ అయినా ఇచ్చారు. రేణుకను అధిష్టానం పట్టించుకున్న పాపాన పోలేదు. గత మూడు పర్యాయాలుగా ఇక్కడ పోటీచేసి రెండుసార్లు(1999,2004) విజయం సాధించిన రేణుకకు కనీసం మాటమాత్రమైనా చెప్పకుండానే సీపీఐ నారాయణకు ఈ స్థానాన్ని కేటాయించారు. వాస్తవానికి అధిష్టానందగ్గర రేణుక పరపతి పడిపోయి చాలా రోజులే అయింది. గత నవంబర్‌లోనే ఆమెను అధికార ప్రతినిధి పదవినుంచి ఆమెను తప్పించారు. రాహుల్ గాంధి స్వయంగా చెప్పిమరీ ఆమెను తప్పించారని సమాచారం. ఖమ్మంజిల్లానేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి రేణుకపై ఇచ్చిన నివేదికలుకూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఆమె మాత్రం తన తల్లి ఆరోగ్యం బాగుండకపోవటంతో తానే తప్పుకున్నానని మీడియాకు బిల్డప్ ఇచ్చారు.

విజయశాంతిలాగే తెలంగాణ ఆడబిడ్డనని చెబుతూ వచ్చే రేణుక అసలు పుట్టింది విశాఖపట్నంలో. ఖమ్మంనుంచి గెలిచినా ఎక్కువగా ఢిల్లీలో పేజ్ 3 జీవితాన్ని గడిపుతూ ఉంటారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేణుక ఈ మధ్యమాత్రం భద్రాచలాన్ని సీమాంధ్రకు ఇవ్వాలంటే తన శవంమీదుగానే ‌వెళ్ళాలంటూ హడావుడి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలపాలంటూ అర్ధం పర్ధంలేని స్టేట్‌మెంట్లుకూడా ఇచ్చారు. చివరికి నిన్న అధిష్టానం మొండి చెయ్యిచ్చేటప్పటికి, మహిళలు, సమానత్వం అంటూ వాదన మొదలు పెట్టారు. అధిష్టానం విడుదల చేసిన జాబితాలో ఒక్క మహిళకూడా లేదని, దీనిపై హైకమాండ్‌ను నిలదీస్తానని చెబుతున్నారు.

కొసమెరుపు: విజయశాంతిని గత ఆగస్టునెలలో సోనియాగాంధివద్దకు తీసుకెళ్ళి పరిచయం చేసింది రేణుకా చౌదరే కాగా వీరిద్దరికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి  నుంచి ఒకేరకమైన అనుభవం ఎదురవటం విశేషం.


images courtesy:facebook/pages/vijayashanti & sarkariinfo.com

2 comments:

 1. >>>మహిళలు, సమానత్వం అంటూ వాదన మొదలు పెట్టారు.

  >>>కొసమెరుపు: విజయశాంతిని గత ఆగస్టునెలలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధివద్దకు తీసుకెళ్ళి పరిచయం చేసింది రేణుకా చౌదరే కాగా వీరిద్దరికీ ఈ ఎన్నికల్లో ఆమె నుంచి ఒకేరకమైన అనుభవం ఎదురవటం విశేషం.

  ?అసలు ఈ ముగ్గురు ఆడవాళ్లలోనే సమానత్వం లేదు,మగవాళ్ళతో సమానత్వం సాధిస్తుందా ఈవిడ:-)

  ReplyDelete
  Replies
  1. తెదేపా తరఫున రేణుక & జయప్రద పార్లమెంటులో ఉన్నప్పుడు భలే కామెడీగా ఉండేది. రోజూ ఒకరినొకరు విచిత్రమయిన వ్యాఖ్యలతో (రేణుక ఇంగ్లీషులో & జయ తెలుగులో) ఆడిపోసుకునే వారు. కుళాయి సిగపట్టుల తరహా ప్రహసనం జనాలకు బ్రహ్మాండంగా వినోదం ఇచ్చింది.

   Delete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts