Friday, August 19, 2011

ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?
అన్నాహజారే ఉదంతం – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, 'అన్నా' వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. 'అన్నా'విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం.

రెండు తప్పుడు నిర్ణయాలు(డిసెంబర్ 9నాటి తెలంగాణా ప్రకటన, జగన్‌ను సరిగా టేకిల్ చేయలేకపోవడం) తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే రావణకాష్ఠంలాగా మార్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని మించిన ఒక చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడి నడిబజారులో పరువు పోగొట్టుకుంది. నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోబోతున్న 'అన్నా'ను, నియంతృత్వ ధోరణిలో కొద్దిగంటలముందు అరెస్టు చేయించింది. ఒక్కసారి దేశమంతా భగ్గుమంది. ప్రజలు వెల్లవలా బయటకొచ్చి 'అన్నా'కు మద్దతుగా నిలబడి ప్రభుత్వంపై నిప్పులుగక్కారు. అప్పటికిగానీ పరిస్థితి అర్ధంగాని ప్రభుత్వం కాళ్ళబేరానికొచ్చింది. 'అన్నా' బృందంతో బేరసారాలు మొదలుపెట్టి చివరికి వారు కోరినట్లు రామ్ లీలా మైదానంలో దీక్షకు అనుమతి ఇచ్చింది.

సరే, డిసెంబర్9నాటి చిదంబరం ప్రకటనను – కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో హడావుడిగా తీసుకున్న నిర్ణయమని, జగన్ విషయంలో - తెలంగాణా సీనియర్లు హైక‌మాండ్‌ను తప్పుదోవ పట్టించడం కారణమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, 'అన్నా' - లోక్‌పాల్ సంక్షోభం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమి కాదు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును తూతూమంత్రంగా రూపొందిస్తోందని ఆరోపిస్తూ, ఆగస్టు 16నుంచి మళ్ళీ నిరాహారదీక్ష చేపడతానని 'అన్నా' దాదాపు 15రోజులక్రితమే ప్రకటించారు. మరి ఇంత సమయమున్నా ప్రభుత్వం ఈ విషయంలో ఇటువంటి అవివేకమైన నిర్ణయం ఎలా తీసుకుందో తెలియడంలేదు. ఏప్రిల్‌నెల‌లో 'అన్నా' చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ప్రజలనుంచి, మీడియానుంచి... ఇంకా చెప్పాలంటే సమాజంలోని అన్నివర్గాలనుంచి లభించిన అనూహ్య మద్దతు, ఆ దెబ్బకు దడిసి తామే దిగివచ్చి అన్నా పెట్టిన షరతులన్నింటికీ అంగీకరించడం – కేంద్రప్రభుత్వం మరిచిపోయిఉంటుందని అనుకోలేము. మరి, ఇంత జరిగినా చివరి నిమిషంలో ప్రభుత్వం నిన్న ఇటువంటి అవివేకమైన నిర్ణయం తీసుకుందంటే 1. ప్రజల మనోభావాలను పసిగట్టలేకపోవడమైనా జరిగిఉండాలి లేదా 2. సరైనరీతిలో మేధోమథనం జరగకపోయిఉండాలి. మొదటి కారణాన్ని కొట్టిపారేయవచ్చు...ఎందుకంటే ప్రజల మనోభావాలను పసిగట్టి ఎప్పటికప్పుడు చేరవేసే పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇక రెండో కారణమే అయి ఉండాలి. మరి ఇంతమంది కురువృద్ధులు, దిగ్గజాలు ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే వారిమధ్యలో పొంతన లేకపోవడమే కారణమని స్పష్టమవుతోంది. కేంద్రమంత్రులు తలోదారిగా ఉండి కీచులాడుకోవడం, ప్రధానమంత్రి వారిని అదుపు చేయలేకపోవడం గురించి మీడియాలో కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామం ఆ వార్తలను ధృవీకరించినట్లయింది. మరి ఈ ప్రభుత్వం ముందుముందు ఇంకా ఇలాంటి చెత్త నిర్ణయాలు ఎన్ని తీసుకుంటుందో చూడాలి.

Sunday, May 22, 2011

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల
ఆర్టిస్టుగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్పనటుడని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ - గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశంగర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని(పాండవ వనవాసంలో "బానిసలు" డైలాగ్ తరహాలోనా...?) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్నిసార్లు నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారని, శ్రీకృష్ణసత్య సినిమా సందర్భంగా ఎన్టీఆర్ ను కూడా బాగా ఇబ్బంది పెట్టారని తెలిపారు.

అసలే ముద్దగా ఉండే సత్యనారాయణ గొంతు, ఇప్పుడు బాగా ముద్దగా అయిపోయింది(మందు ఎక్కువ అవటంవలన కావచ్చు). దానితో ఈ ఇంటర్వ్యూలో ఆయన మాటలు ఒకపట్టాన అర్ధం కావడంలేదు. అయితే ఒక సందర్భంలో హేట్సాఫ్ అనిపించారు. మీ చలనచిత్రజీవితంలో ఇష్టమైన డైలగ్ చెప్పండంటూ రాధాకృష్ణ కోరినపుడు, ఏదో పౌరాణికసినిమాలో - తాను పోషించిన దుర్యోధనపాత్ర తాలూకు డైలాగ్ చెప్పారు. సంస్కృత సమాసాలతోకూడిన సంక్లిష్టమైన, సుమారు రెండుపేజీల సుదీర్ఘ డైలాగ్ అది. అంతపొడుగు దానిని, ఇన్నేళ్ళ తర్వాత కూడా, ఈ వయసులో ఆయన గుర్తుపెట్టుకుని, చక్కగా, ముఖకవళికలతోసహా చెప్పిన తీరు అద్భుతం, అపూర్వం. అంత ప్రతిభ ఉండబట్టే అన్నాళ్ళు ఆ ఫీల్డ్ లో నిలబడగలిగారనిపించింది. మొత్తం 780 సినిమాలలో నటించానని చెప్పారు. మొత్తం కెరీర్ లో, ‘శారద’ సినిమాలోని తన పాత్ర ఎంతో ఇష్టమని తెలిపారు. రామారావుగారితో పోరాటదృశ్యాలలో నటించేటపుడు చచ్చే చావయ్యేదని చెప్పారు. ఆయన పాత్రలో లీనమైపోయి విలన్ లను బాదేవారని తెలిపారు. రేప్ దృశ్యాలలో నటించేటపుడు హీరోయిన్లతో పెద్ద ఇబ్బందులేమీ ఎదురవలేదని చెప్పారు. కేఆర్ విజయ మాత్రం బాగా కోఆపరేట్ చేసేదని, ఎలాగయినా చేసుకోండి - ఫరవాలేదని చెప్పేదని తెలిపారు.

అవార్డులు రాకపోవడానికి కారణమేమిటో స్పష్టంగా తెలియదని, తెలుగుదేశం ఎంపీగా కొంతకాలం పనిచేయడం ఒక కారణమై ఉండొచ్చని కైకాల అన్నారు. అయినా, సావిత్రికి, ఎస్వీరంగారావుకు కూడా అవార్డులు రాలేదుకాబట్టి తాను వాళ్ళ సరసన చేరినట్లేనని చమత్కరించారు. బ్రహ్మానందం, మోహన్ బాబు(వీరిద్దరూ పద్మశ్రీ అవార్డులు పొందారు)కంటే తీసిపోయానా అని ప్రశ్నించారు. తన కొడుకులెవరూ నటులుగా రాలేదని, మనవళ్ళయినా వారసులుగా రావాలని తన అభిలాష అని మనసులోమాటను బయటపెట్టారు.

80వ దశకంముందుదాకా ఎన్నో మంచిపాత్రలు వేసిన కైకాలను ఒకరకంగా పరుచూరి బ్రదర్స్ పాడుచేశారేమోననిపిస్తుంది...అగ్నిపర్వతం, ముందడుగు వంటి సినిమాలలో చవకబారు హాస్యపాత్రలు ఇచ్చి. ముఖ్యంగా అగ్నిపర్వతంలో సత్యనారాయణ క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంటుంది. ఆయన స్థాయి నటుడు చేయదగ్గపాత్ర కానేకాదు. ఏది ఏమైనా ఆయనది ఒక పరిపూర్ణ(accomplished) జీవితమని చెప్పుకోవాలి. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూకూడా జీవితంలో మంచి ఎత్తులకు ఎదిగి తెలుగువారిగుండెలలో ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించుకోవడం ఆషామాషీయేంకాదు. ప్రస్తుతం మనవళ్ళతో కాలక్షేపం చేస్తున్న కైకాల, అరుంధతి వంటి ఒకటో, రెండో సినిమాలలో అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తున్నారు.

Sunday, April 10, 2011

పదిరోజుల వ్యవధిలో(జాతి మొత్తం ఏకమై నిలిచిన) రెండు చరిత్రాత్మక సందర్భాలుగత పదిరోజులుగా దేశానికి ఏదో మంచి దశ నడుస్తున్నట్లుంది. లేకపోతే కుల, మత, వర్గ, ప్రాంత, సంస్కృతుల విబేధాలు, వైషమ్యాలతో రగిలే భరతజాతి మొత్తం ఒక్కసారికాదు, రెండుసార్లు ఏకతాటిపైకి రావడమంటే మాటలా. ఈ అరుదైన శుభపరిణామాలకు నాంది పలికింది ఒకసారి క్రికెట్టయితే, రెండోసారి అవినీతిపై పోరు.

ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా జాతిమొత్తం, ఆసేతుహిమాచలమూ భారతజట్టు గెలుపుకోసం తపన చెందింది. పిల్లలు, యువతీయువకులు సరే...క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోనివారు, పెద్దవారు, ఆడవాళ్ళు సైతం ఈ రెండు మ్యాచ్ ల సందర్భంగా మనదేశ జట్టుగెలవాలని బలంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. ఈ రెండు మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో దేశమంతటా - కర్ఫ్యూ కాదుగానీ - 144వ సెక్షన్ విధించినట్లయిందని చెప్పుకోవచ్చు. అందరూ టీవీసెట్లకు అతుక్కుపోయారు. రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తానికి 120కోట్లమంది ప్రార్ధనలు ఫలించాయో ఏమోగానీ భారతజట్టు ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్రపంచ కప్ సాధించి జాతిని ఆనందసాగరంలో ఓలలాడించింది. జనం తమ సమస్యలను, కష్టాలను, విబేధాలను పక్కనబెట్టి మరీ ఒకరినొకరు అభినందించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇదే అరుదయిన సందర్భమనుకుంటే మళ్ళీ వారంరోజులలోనే అలాంటి పరిణామమే చోటుచేసుకోవడం అపూర్వమే.

అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోక్ పాల్ వ్యవస్థకోసం అన్నాహజారే జరిపిన ఆమరణ నిరాహారదీక్ష కూడా జాతిలో ఓ అపూర్వ కదలిక తీసుకువచ్చింది. మొదట ఓ మోస్తరుగా ఉన్న మద్దతు గంటగంటకూ పెరిగిపోతూ నిరాహారదీక్ష చేసిన 96గంటలలో పతాకస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో అన్నాహజారేకు మద్దతుగా జనం ప్రదర్శనలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ మద్దతు పెరుగుతుండటం గమనించిన వివిధపార్టీల రాజకీయనాయకులు...తాముకూడా అవినీతికి వ్యతిరేకమేనంటూ అన్నాహజారేకు మద్దతుపలకడం ప్రారంభించారు. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం దిగివచ్చి లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించింది. బంద్ లు, ఆందోళనలు, హర్తాళ్ లు ఏమీ జరపకుండా పూర్తిగా గాంధేయమార్గంలో సాగిన అన్నాహజారే ఉద్యమం విజయవంతమవడం ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికి, రాజకీయపార్టీలకు గుణపాఠంగా నిలిచింది. ఈ ఉద్యమంవలన తక్షణమే ఏదో జరుగుతుందని ఆశించలేకపోయినా దేశప్రజలలో అనూహ్య చైతన్యం తీసుకురావడం గొప్ప శుభపరిణామమని చెప్పుకోవచ్చు.

భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఈ రెండు అరుదైన సందర్భాలకు మనం ప్రత్యక్షసాక్షులు కావడం మన అదృష్టమని భావించొచ్చేమో. ఇదే స్ఫూర్తి, స్పందన, చైతన్యం, ఐకమత్యం, సంఘీభావం కొనసాగితే భారతదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతూ అగ్రరాజ్యంగా నిలబడటానికి ఎంతో కాలం పట్టదు.

Thursday, April 7, 2011

మూర్తీభవించిన స్త్రీత్వం సుజాత


ఒద్దిక, అణకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం, అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాతగారిని చెప్పొచ్చు. అసలు ఆమెలో ప్రత్యేకత ఏమిటంటే...సున్నితభావాలతోబాటు ఆత్మాభిమానం, గాంభీర్యం, హుందాతనం పరిణతి, స్పష్టత, మానసికధృడత్వం, ఖచ్చితత్వం(ఎసర్టివ్ నెస్) వంటి భావాలను కూడా ఆమె బ్రహ్మాండంగా పలికించేవారు. మిరుమిట్లుగొలిపే అందం కాకపోయినా స్ఫురద్రూపం. మంచి ఎత్తు, చక్కటి కనుముక్కుతీరు. మాతృభాష మళయాళం కాగా, తెలుగులోనే డైలాగులు చెప్పడంకోసం మన భాషను కూడా నేర్చుకున్నారు. మొదట్లో చౌకబారు(మళయాళీ) సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత, తర్వాత తనకు తాను ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దానికే కట్టుబడిఉండటం గొప్పవిషయం(ఫీల్డులో నిలబడటంకోసం దాదాపుగా ప్రతి టాప్ హీరోయిన్ కూడా మొదట్లో చౌకబారు వేషాలు వేసినవారే).

తెరమీదలాగానే, తెరవెనక కూడా ఒద్దికగా, అణకువగా ఉండే ఆమె సహజ స్వభావంవలనో, అదృష్టంవలనోగానీ, సుజాతగారికి మంచి మంచి పాత్రలు లభించాయి. ముఖ్యంగా అవళ్ ఒరు తొడర్ కథై(అంతులేనికథ), అన్నక్కిళి(రామచిలుక), అవర్ గళ్(ఇది కథకాదు), గుప్పెడుమనసు, గోరింటాకు, సుజాత(ఈ సినిమాలో ద్విపాత్రాభినయం) వంటి చిత్రాలలో ఉన్నత వ్యక్తిత్వంగల స్త్రీ పాత్రలను ఆమె తన ప్రతిభతో పండించారు(పైవాటిలోని మొదటి మూడు సినిమాలలోని పాత్రలను తెలుగులో జయప్రద, వాణిశ్రీ, జయసుధ పోషించారు). ఆమె హావభావాలు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్...వగైరా అన్నీ ఫక్తు సంప్రదాయ మహిళను తలపించేవి.

తమిళంలో బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చిత్రాలలో సుజాతగారికి మంచి పాత్రలు(author backed roles) లభించాయి. ముఖ్యంగా గోరింటాకులో ఆమె విశిష్ట ప్రతిభ కనబరచింది. శోభన్ బాబుతో ప్రణయ సన్నివేశాలలో ఎంత సున్నితంగా, లలితంగా కనిపిస్తుందో...కట్టుకున్న భర్త(దేవదాస్ కనకాల) మోసగాడని తెలిసి అతనిని నిలదీసేటప్పుడు అంతే కఠినంగా కనబడుతుంది. వయసుపైబడేకొద్దీ హుందాగా తల్లిపాత్రలు తీసుకుని అక్కడా తన ముద్ర వేసుకుంది. రజనీకాంత్ సినిమాలు చాలావాటిలో అతనికి తల్లిపాత్ర వేసింది. ఇక తెలుగులో పెళ్ళి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమసహాయనటిగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. కొన్నాళ్ళుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస తీసుకోవడంతో దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయినట్లయింది.

Friday, April 1, 2011

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయిన 'శక్తి'


నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'శక్తి' విడుదలవడం...మొదటి షో నుంచే నిర్ద్వంద్వంగా ఫ్లాప్ టాక్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. నిజంగా నందమూరి అభిమానులకు ఇది ఆశనిపాతమే. ఒక టాప్ హీరో సినిమాకోసం అతని అభిమానులు రోజుల తరబడి కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుంటారు. అది ఫ్లాపయితే వాళ్ళు... తమ హీరో కంటే ఎక్కువ బాధపడతారు. మళ్ళా తర్వాత సినిమాకోసం ఎదురు చూపులు మొదలుపెడతారు. అందుకనే అగ్రహీరోలు సినిమాలను ఒప్పుకునేటప్పుడు తమ విచక్షణతోబాటు అభిమానుల ఆశలను, అంచనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

తెలుగు సినిమా పరిశ్రమలో ముందున్న రికార్డులకంటే 50-60% అధికంగా కలెక్షన్లు వసూలు చేసి(సాధారణంగా ఇది 10-15% ఉంటుంది), కనీవినీ ఎరగని రికార్డులను స్థాపించిన 'మగధీర'ను తలదన్నే సినిమా చేయాలని ఎన్టీఆర్ కన్న కలలను దర్శకుడు మెహర్ రమేష్ కాలరాశాడు. నిర్మాత అశ్వనీదత్ ఇచ్చిన వనరులను, అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోయాడు(బడ్జెట్ ఎంతో చెబితే ఆ మొత్తాన్ని రమేష్ ఖాతాలో డిపాజిట్ చేస్తానని సినిమా ప్రారంభానికి ముందే దత్ చెప్పాడట). మగధీరను చూసి శక్తి స్టోరీ తయారు చేసుకున్నాడు(ఈయనగారు చేసిన మొదటి సినిమా-కంత్రీ మరో బంపర్ హిట్ సినిమా పోకిరికి కాపీ). ఏమాత్రం కొత్తదనం లేకుండా ప్రతిచోటా మగధీరను తలపిస్తూ తీయడంతో దానితో పోల్చుకోవడం సహజం. మగధీర ప్రమాణాలతో ఎక్కడా తూగకపోవడంతో సినిమా హాస్యాస్పదంగా మారిపోయింది.

అయితే దీనిలో ఎన్టీఆర్ తప్పు కూడా లేదనలేము. కౌలాలంపూర్ లో వేరే సినిమా షూటింగులో ఉన్న తనకు...(వేరే హీరోకోసం సిద్ధంచేసుకున్న)ఈ స్టోరీని రమేష్ వినిపిస్తే...ఇది తానుకాక ఎవరు చేస్తారంటూ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఎన్టీఆరే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సినిమాల ఎంపికలో అతను మరింత జాగ్రత్తపడాలి.

ఇప్పటికే 'లోకల్ టీవీ'తో నష్టాలపాలయిన అశ్వనీదత్తుకు(ఛానల్ ను ప్రైమ్ స్లాట్ లో పెట్టేందుకు కేబుల్ ఆపరేటర్లకు విపరీతమైన ఛార్జీలు ఇచ్చి లాభాలు గూబల్లోకి వచ్చేటట్లు చేసిందట దత్తుగారి కుమార్తె స్వప్న) ఇది మరో దెబ్బే. దానికితోడు, రేపు(02.04.11) వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగా దెబ్బతింటాయని ఇండస్ట్రీవర్గాలు ముందే చెప్పాయి. అసలు, ఫలితం ముందే తెలిసిపోయిందో, ఏమో శక్తికి పబ్లిసిటీ కూడా లో ప్రొఫైల్ లో చేశారు.

Wednesday, February 2, 2011

అమెరికా విద్యార్ధికి ఒక్కరికైనా భారత్‌లో ఇలా జరిగితే ఊరుకునేవారా?


చింత చచ్చినా పులుపు చావనట్లు...ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయి అగ్రరాజ్య హోదా పోగొట్టుకునే దశలో ఉన్నా, అమెరికా ఇంకా దురహంకార వైఖరిని విడనాడడంలేదు. ఇంకా తమకొకన్యాయమూ, ఎదుటివారికొక న్యాయమన్నట్లుగానే వ్యవహరిస్తోంది. మెక్సికో గల్ఫ్ లో చమురు లీకేజికిగానూ BP ఆయిల్ కంపెనీనుంచి చెవులు మెలిపెట్టి మరీ నష్టపరిహారం కట్టించిన అంకుల్ శామ్...భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారం విషయంలో మాత్రం సెలెక్టివ్ అమ్నీషియా(మతిమరుపు)ను తెచ్చిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత పర్యటనలో మనదేశాన్ని, సమకాలీన పరిస్థితులలో ప్రపంచంలో మనదేశ ప్రాధాన్యతను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడి, అమెరికాఉత్పత్తుల అమ్మకాలకోసం వేలకోట్లరూపాయల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిన ఒబామాకు, ట్రైవ్యాలీ యూనివర్సిటీ చేతిలో మోసపోయిన భారతీయ విద్యార్ధుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం లేదా?

ఆ భారతీయ విద్యార్ధులంతా అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత వంటి విధ్వంసరచనకు వెళ్ళిన ఉగ్రవాదులో, లేకపోతే మెక్సికోతీరంనుంచి పోలీసుల కళ్ళుగప్పి అక్రమంగా చొరబడే వలసదారులో కాదుకదా. అలా వెళ్ళిన సంఘ వ్యతిరేకశక్తులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ పెట్టీ కేసుల విషయంలో తమ ప్రతాపాన్ని చూపుతూ తమ పోలీసుల mediocrityని బయటపెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ నేరంలో ఆ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది. వీరందరికీ వీసాలు మంజూరు చేసేటపుడే ఆ యూనివర్సిటీ గురించి, దాని గత చరిత్ర గురించి విచారించడం ఇమ్మిగ్రేషన్ అధికారుల బాధ్యత కాదా? ఒక్క క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీ గురించిన ఫీడ్ బ్యాక్, దానికి గుర్తింపు ఉందా, లేదా అనే సమాచారం మొత్తం కళ్ళెదుట ఉంటుంది కదా(అంత అభివృద్ధి చెందిన దేశంలో ఏ మనిషిదిగానీ, సంస్థదిగానీ సమగ్రసమాచారం కంప్యూటర్ లో అందుబాటులో ఉండకుండా ఉండే అవకాశంలేదు).

తమ దళాలు మోహరించిఉన్న ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో ఒక్క సైనికుడు కనబడకుండా పోయినా, అతనికోసం ఆయా దేశాలలో అమెరికా పెద్దఎత్తున అల్లకల్లోలం సృష్టించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి దేశానికి చెందిన విద్యార్ధో, పర్యాటకుడో భారత్ లో ఇలా పట్టుబడితే ఆ ప్రభుత్వం ఇలా ఊరుకుని ఉండేదా. ఆ వ్యక్తిని వదిలేదాకా భారత ప్రధాని దగ్గరనుంచి కానిస్టేబుల్ వరకూ ఎవరినీ ఊపిరి తీసుకోనిచ్చేదికాదు. మరి ఇంతమంది(వేయికి పైగా అనుకుంటా) భారతీయ విద్యార్ధుల విషయంలో ఎందుకీ న్యాయం? వేలమంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీకి నాడు సీఈవోగా ఉన్న ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి ఎందుకు అప్పజెప్పలేదు?

బాధితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుకుగానే వ్యవహరిస్తోందని చెప్పాలి. విదేశాంగ వ్యవహరాల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిరుపమారావును ప్రత్యేకంగా ఈ విషయంపైనే నేడో, రేపో వాషింగ్టన్ పంపిస్తున్నారు. అయితే కేవలం ఇమ్మిగ్రేషన్ అధికారులతో చర్చిస్తే ఉపయోగం ఉండదు. ఆమె అక్కడ ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్ తోనూ, అధ్యక్షుడు ఒబామాతోనూ ఈ విషయం చర్చిస్తేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. అమెరికాలో ముందునించి స్థిరపడిఉన్న ఎన్నారైలు బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారికి అండగా నిలవడం ఒక మంచి పరిణామం. మరోవైపు భారత్ తిరిగివెళ్ళి మళ్ళీ అప్లయ్ చేసుకుంటే తాజా వీసాలు ఇస్తామని అమెరికా ప్రభుత్వం చెబుతున్నా బాధితులు నమ్మడంలేదు. ఎంతో కష్టపడి, డబ్బు ఖర్చుపెట్టి ఇక్కడకు వచ్చాం కాబట్టి ఎలాగైనా అక్కడే వేరే యూనివర్సిటీలో సీటు సంపాదించుకునితీరాలని బాధితులు కొంతమంది పట్టుదలగా ఉన్నారు.

Tuesday, February 1, 2011

వెన్నుచూపి పారిపోనందుకు మొత్తానికి చిరుకు మంచి ప్రతిఫలమే దక్కేటట్లుంది


వ్రతం చెడ్డా ఫలం దక్కడమంటే ఇదేనేమో. మొత్తానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా చిరంజీవికి ఏదో గౌరవప్రదమైన స్థానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకానొక సమయంలో చిరంజీవి తన పార్టీని రద్దు చేసేస్తారని, మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతారని పుకార్లు జోరుగా వినిపించాయి. ప్రజారాజ్యం దుకాణం బంద్ అని, పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మీడియాలో...ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలలో కొంతకాలంగా ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా తెలంగాణాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(అనిల్, మహేశ్వరరెడ్డి) ఉన్నా లేనట్లే. రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(శోభానాగిరెడ్డి, కాటసాని) జగన్ వర్గంలో చేరిపోయారు. ఇక ఉన్న 14మందిలో కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా జగన్ వర్గంమనిషే. ఇక నికరంగా చూస్తే 13మంది ఉన్నట్లు.

ఒక విషయంలో చిరుని మెచ్చుకోవాలి. రాష్ట్రంలో అంత భారీస్థాయిలో ఆసక్తిరేపుతూ సంచలనాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చి, తీరా ఎన్నికల్లో తుస్సుమన్న తర్వాత – ఎవరయినా ఛీ మనకెందుకు ఈ రొచ్చు అని వెనక్కి పారిపోయి ఉండేవారేమో(వెనకకు వెళితే సినిమాఫీల్డులో మరో ఐదారేళ్ళు కెరీర్ కొనసాగించే అవకాశాలున్నాయి కాబట్టి). అయితే ఆ పనిచేయకుండా అంటిపెట్టుకుని ఉన్నందుకు చిరంజీవికి మంచి ఫలితమే దక్కుతున్నట్లుగా అనిపిస్తోంది...తాజా పరిణామాలు చూస్తుంటే. రాజకీయాలలో అపజయం ఎదురయినా వదలబోనని, విజయం సాధించేవరకు పోరాడతానని మొదటినుంచీ(రాజకీయరంగ ప్రవేశం వార్తల వస్తున్న దగ్గరనుంచి) చెబుతూ వస్తున్న చిరంజీవి, దానికి కట్టుబడిఉండటమే ఈ సత్ఫలితానికి కారణం అయిఉండొచ్చు.

గత ఎన్నికల్లో చిరంజీవి పరాజయానికి కారణాలపై ఇప్పటికే ఎంతో చర్చ జరిగినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చూద్దాం.
1. రాజకీయాల్లోకి తనంతతానుగా కాక బంధుమిత్రుల ప్రోద్బలంతో అన్యమనస్కంగా ప్రవేశించడం, సంకల్పం బలంగా లేకపోవడం
2. పార్టీ నిర్మాణాన్ని అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మాణంలాగా జరపడం.
3. ఉవ్వెత్తున వచ్చిన ఆదరణను, అభిమానాన్ని క్రమపద్ధతిలో నిలుపుకోకుండా నిర్లక్ష్యం చేయడం.
4. పార్టీకి థింక్ ట్యాంక్, ఐడియాలజీ లేకపోవడం.
5. పార్టీలోకి వచ్చిన మేధావులను సక్రమంగా వినియోగించుకోకుండా, పార్టీ వ్యవహరాలను సొంత కుటుంబ వ్యవహారంలాగా నడపడం.
6. పర్యటించిన ప్రతిచోటికీ వేల, లక్షలమంది ప్రజలు వస్తే...అలాంటి అపూర్వ అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ప్రసంగాలతో ఆకట్టుకోవలసిందిపోయి, జనం వచ్చారని సంబరపడి తృప్తిపడిపోయారు
7. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మంచి లక్ష్యాలతో నడుపుతున్నప్పటికీ ప్రత్యర్ధులు వాటిమీద లేనిపోని ఆరోపణలు చేస్తే, వాటిని తిప్పికొట్టకపోగా, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రజలు తమ వెనకే ఉన్నారని విర్రవీగారు.
8. అరవింద్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ప్రజలందరూ నమ్ముతున్నా, చిరంజీవి మాత్రం నమ్మకపోవడం...కనీసం డేమేజ్ కంట్రోల్ చేయకపోవడం.
9. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అవగాహనాలోపం.
10. ప్రత్యర్ధుల ప్రాపగాండాని ఎదుర్కోవడానికి, తమ వాదనను వినిపించుకోడానికి సొంత మీడియా ఉండాలన్న ప్రాధమిక సూత్రాన్ని కూడా పట్టించుకోకపోవడం.

ఏది ఏమైనా...ప్రజారాజ్యం అస్తిత్వంమీద ప్రజలందరికీ అనుమానాలు రేకెత్తుతున్న ఈ సమయంలో, ఆ పార్టీని ఇంకా అంటిపెట్టుకునిఉన్న వీరాభిమానులు కూడా పునరాలోచన పడుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ నుంచి ఈ అవకాశం రావడం చిరుకు ఎంతోకొంత శుభ పరిణామమేనని చెప్పొచ్చు. పీఆర్పీకి కొంత పునరుజ్జీవం లభించినట్లయింది. నానాటికీ ఇమేజ్ దిగజారిపోతున్న ఆ పార్టీ కోలుకోడానికి అవకాశం దొరికింది. ఊళ్ళలో ఉన్న పీఆర్పీ, చిరంజీవి అభిమానులు కాస్త తలెత్తుకుని తిరగగలిగేటట్లయింది. దీనిని నిలబెట్టుకోడానికి చిరంజీవి ప్రయత్నించాలి ఇప్పటికైనా మేలుకుని వ్యూహాలను మార్చుకుని... రాజకీయరంగప్రవేశం చేసి తాను సాధించిందేమిటి,ఇకముందు ఏమిచేయాలి అనేదానిపై చక్కటి అవగాహనకొస్తే మంచిది. వీటన్నటికంటే అరవింద్ మీద ఆధారపడకుండా, అతనిని పక్కనబెట్టి సొంత వ్యక్తిత్వంతో, సొంత ఆలోచనలతో ముందుకు సాగాలి.

Wednesday, January 26, 2011

యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా


యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం.

1) అనూ ఫాంట్స్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం.(ఇది యూనికోడ్ కాదు)

2) వీవెన్ గారు రూపొందించిన కీబోర్డ్ లేఔట్‌ను నెట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయడం.

అనూ ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానిని కొననైనా కొనాలి...లేదా పైరసీ వెర్షన్ అయినా తీసుకోవాలి. అందుకనే యాపిల్ కీబోర్డ్ వాడేవారం ఎక్కువగా వీవెన్ గారి సాఫ్ట్ వేర్ వాడుతున్నాం. అయితే దీనిలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ‘ఇన్‌స్టాల్‘ అనే పదం కంపోజ్ చేయాలంటే ఇన్ స్టాల్ అని మధ్యలో గ్యాప్ ఇచ్చి కంపోజ్ చేయవలసి వస్తోంది. అలాగే ‘జ్ఞాన‌ము’ అనే పదములో ఉన్న మొదటి అక్షరం కంపోజ్ చేయడానికి వీలుకావడంలేదు.

ఇదేకాక మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా(నెట్ సెంటర్‌లోగానీ, వేరే సిస్టమ్‌లోగానీ) తెలుగులో కంపోజ్ చేయాలంటే తెలుగు సాఫ్ట్ వేర్ అక్కడ అందుబాటులో ఉండటం అరుదు. పై సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంది. దీనిగురించి మీకు తెలిస్తే సరే. తెలియకపోతే కింద చూడండి.

తెలుగు కీబోర్డుల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా నాకు ఈ లింక్‌లో మంచి పరిష్కారం దొరికింది. దీనిలో సౌలభ్యం ఏమిటంటే వీవెన్ గారి కీబోర్డుతో కంపోజ్ చేయలేని పదాలను కూడా ఇక్కడ కంపోజ్ చేయవచ్చు. దీనిలో మరో సౌలభ్యం ఏమిటంటే దీనిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో కూడాను వాడుకోగలం. అంటే మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్‌లో తెలుగు కీబోర్డు ఇన్‌స్టాల్ చేసి లేకపోయినా నెట్ ద్వారా ఈ సైట్‌కు వెళ్ళి ఆ ఇంట‌ర్‌ఫేస్‌లోనే కంపోజ్ చేసుకోవచ్చు...లేదా దీనిని డౌన్‌లోడ్ చేసుకుని మన పెన్‌డ్రైవ్‌లో పెట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీనికి ఆన్‌లైన్‌ కీబోర్డ్(లేఔట్) కూడా ఉంది. కొత్తవాళ్ళు నేర్చుకోవాలన్నా చాలా సులభంగా నేర్చుకోవచ్చు.

అయితే దీనిలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్ ఫేస్‌లో సేవ్ చేసుకునే అవకాశంలేదు. ఎప్పటికప్పుడు మనం కాపీ చేసుకుని వేరేచోట పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వీవెన్ గారి కీబోర్డుకీ దీనికీ కొద్దిగా తేడాలున్నాయి. ‘ఆ, ఈ, ఊ, ఓ’ వంటి దీర్ఘాక్షరాలు కంపోజ్ చేయాలంటే గోపీగారి కీబోర్డులో షిఫ్ట్ పట్టుకోనవసరంలేదు. ఆ ఇంటర్ ఫేస్‌లో ఇచ్చిన కీబోర్డు చూసుకుంటే అర్ధమవుతుంది.

ఈ ఇంటర్ ఫేస్‌ను తమిళుడైన గోపాలకృష్ణన్ అనే ఐటీ నిపుణుడు రూపొందించారు. దీనిపై ఏమైనా సందేహాలుంటే ఆయననే నేరుగా సంప్రదించవచ్చు. నేను కాంటాక్ట్ చేస్తే ఆయన వెంటనే చక్కగా స్పందించారు. కంప్యూటర్ రంగానికి సంబంధించినవాడిని కానప్పటికీ యాపిల్ కీబోర్డుతో తెలుగు టైపింగు చేసేవారు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలకు ఇది పరిష్కారం కాగలదని, చాలామందికి ఉపయోగపడుతుందని చిట్కాలాంటి ఈ పోస్టు రాశాను. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.


Image courtesy: www.pixabay.com

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts