Saturday, April 19, 2014

ఉదయభాను ఓవరాక్షన్

టీవీ9 ఛానల్‌వారు ఉదయభాను ప్రయోక్తగా ప్రైమ్‌టైమ్‌(రాత్రి 9.30)లో నిగ్గదీసి అడుగు అనే కార్యక్రమాన్ని  ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికలవేళ ఎంపికచేసిన కొన్నిప్రాంతాలకు వెళ్ళి అక్కడ నెలకొనిఉన్న సమస్యలను ప్రజలద్వారా తెలుసుకుని, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయటం అనే కాన్సెప్ట్‌తో టీవీ9 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాస్తవానికి టీవీ9లోనే ఝాన్సీ చాలారోజులనుంచి ఇలాంటి కాన్సెప్ట్‌తోనే, స్థానిక సమస్యలపై చేతన అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అయితే, 'గంగ గరుడాలెత్తుకెళ్ళేరా...ఇంక ఆంబోతులాట సాగేరా' అంటూ సాగే అనే ఒక పాటను స్వయంగా రచించి, పాడి తనలోని సామాజికస్పృహ కోణాన్ని చాటిచెప్పిన ఉదయభాను అయితే ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సముచితంగా ఉంటుందని భావించారో, ఏమో టీవీ9వారు ఆమెను రంగంలోకి దించారు.

కార్యక్రమం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఉదయభాను తెచ్చిపెట్టుకుని ప్రదర్శిస్తున్న నాటకీయత, ఓవరాక్షన్‌ చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. సినిమాలలో రాజకీయనాయకులకు వ్యతిరేకంగా ఉపయోగించే అన్యాయం, నిర్లక్ష్యం, నిరాదరణ వంటి కొన్ని పడికట్టుపదాలు పట్టుకుని ఉదయభాను ఊదరగొడుతున్నారు. ఆమెకు క్షేత్రస్థాయిలో సమస్యలపట్ల మౌలికమైన అవగాహన లేకపోగా, విషయపరిజ్ఞానంకూడా అంతంతమాత్రమే అవటంతో కార్యక్రమం అక్కడక్కడా నవ్వు తెప్పిస్తోంది. మొన్నొకచోట ఒక వృద్ధుడు ఏదో సమస్యను ఆవేశంగా ప్రస్తావిస్తుండగా, అతనిని ఆపి నీ వయసు ఎంత అని అడిగారు ఉదయభాను. తన వయసు 75 ఏళ్ళు అని అతను చెప్పాడు. వెంటనే ఈమె, 'కొంతమంది ముసలివాళ్ళు పుట్టుకతో యువకులు' అని శ్రీశ్రీ అన్నారని(#*@&#*), దానికి ఈయనే ఉదాహరణ అంటూ ఏదోదో చెప్పుకెళ్ళారు. ఇక ప్రజా ప్రతినిధులను పట్టుకుని వేలుచూపిస్తూ సినీ ఫక్కీలో ప్రశ్నలు అడగటంకూడా ఓవర్‌గా అనిపిస్తోంది.

అయితే కార్యక్రమాన్ని రూపొందించినవారిని, వారి కాన్సెప్ట్‌ను ప్రశంసించి తీరాలి. కార్యక్రమం చేయబోయే ప్రాంతానికి సంబంధించి ముందే సమాచారం సేకరించటం, ముందుగా యాంకర్‌తో ఆ వివరాలను చెప్పించటం, సమస్యలను ప్రస్తావించటం బాగుంది. ఎంపికచేసిన ప్రాంతాలుకూడా సముచితంగా ఉన్నాయి. ఇప్పటివరకు అనంతపూర్, ఖమ్మం, అదిలాబాద్, కర్నూలు, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయభాను ఓవరాక్షన్ తగ్గించుకుంటే కార్యక్రమం ప్రయోజనం మరింతబాగా నెరవేరుతుంది. 

1 comment:

  1. Nijame!Overaction chesi programme ni chetta ga maarchindi.

    ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts