Saturday, March 28, 2015

ఆంధ్రా కేజ్రీవాల్ అవ్వాలనుకుంటున్న శివాజికి విశాఖలో చేదు అనుభవం


ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలుగు సినీనటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ తాజాగా ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. శివాజిని ఎదిరించిన వక్తలు ఆయనకు ఓర్పులేదంటూ విమర్శించారు.

'మాస్టర్' చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన శివాజి, గుంటూరుజిల్లా నర్సరావుపేటప్రాంతానికి చెందిన సామాన్యకుటుంబంనుంచి వచ్చారు. హైదరాబాద్‌లో జెమిని టీవీ ఛానల్‌లో మొదట చిన్నఉద్యోగం చేసేవారు. ఒకరోజు పాటల ప్రోగ్రామ్‌కు యాంకర్ రాకపోవటంతో మంచి మాటకారి అయిన శివాజినే ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు యాంకర్‌ను చేసేశారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు 2000 సంవత్సరంలో కొత్త నటీనటులకోసం నిర్వహించిన పోటీలో సెలక్ట్ అయ్యారు. 'పరదేశి' అనే సినిమాలో అవకాశం సంపాదించుకుని 'మాస్టర్' చిత్రంద్వారా వెలుగులోకి వచ్చారు. హీరో స్నేహితుడి వేషాలు వేస్తూ ఉండే శివాజి మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలద్వారా హీరోగా ఓ వెలుగు వెలిగారు. మాస్ హీరోగా ఎదగాలని స్టేట్ రౌడీ, సీతారాముడు అనే కొన్ని చిత్రాలు తీయగా అవి వారంకూడా ఆడలేదు. ఆ దెబ్బతో చిన్న సినిమాల ఆఫర్‌లు కూడా పోయాయి. ఇటీవల అవకాశాలు లేకపోవటంతో తనే స్వంతంగా 'బూచమ్మ బూచాడు' అనే కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. అది ఓ మాదిరిగా నడిచింది.

టీవీ9 ఎడిటర్ రవిప్రకాష్‌తో సాన్నిహిత్యం కలిగిఉన్న శివాజీ, ఆ ఛానల్ మద్దతుతో ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదో ఒక సమస్య తీసుకుని రోడ్డెక్కుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ టీవీ9 అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెంవద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం బాధితుల సమస్యతో ఉద్యమాల బాటలో బయలుదేరారు. ఆ తర్వాత, తిరుమలలో దేవస్థానం బోర్డ్ ధనికులకు ఊడిగం చేస్తోందంటూ హైదరాబాద్‌లో ఒకరోజు ధర్నా చేశారు(టీటీడీ బోర్డ్ ఛైర్మన్ కావాలన్నది తన కోరికలలో ఒకటని ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో వాక్రుచ్చారు). రోడ్డుప్రమాదాలు ఎక్కువైపోతున్నాయంటూ కొన్నిరోజులు ఆక్రోశం వెలిబుచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం గళమెత్తారు. అన్నిపార్టీలూ కలిసి ఏపీని తొక్కేస్తున్నాయని, దీనికోసం ఉద్యమించాలని నినదించారు. అంతర్యుద్ధం తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు.

లక్ష్యం స్వార్థపూరితమైనప్పటికీ ఆ ప్రయత్నంలో శివాజి మరింత శ్రద్ధ, కృషి పెడితే బాగుండేది. ఏదో ఒక సమస్యతో టీవీ ఛానల్‌లో కనిపించాలనికాకుండా, చిత్తశుద్ధితో ఏదో ఒకటి నిర్మాణాత్మకంగా చేయాలి. ఆ సమస్యను సమూలంగా అధ్యయనం చేయాలి. శివాజి సభలలో మాట్లాడే మాటలు చూస్తే పరిణతితోకూడినవిగాలేకపోగా చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉన్నాయి. షార్ట్‌కట్‌లద్వారా తొందరగా పైకి ఎగబాకాలనికాక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా శివాజి కృషిచేస్తే బాగుంటుంది.


విశాఖపట్నంలో శివాజి సభ వీడియోను ఈ లింక్‌లో చూడొచ్చు - https://www.youtube.com/watch?v=IhjrWK5KnbE

Image courtesy:fb.com/ActorSivaji

Saturday, March 21, 2015

పేపర్లకెక్కిన అక్కినేని ఫ్యామిలీ: జప్తు నోటీసులు జారీచేసిన బ్యాంక్‌లు



హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన అత్యంత విలువైన 7 ఎకరాలు 25 గుంటల స్థలాన్ని ఇండియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. స్టూడియోస్‌తరపున తమవద్ద తీసుకున్న రుణాలకు సంబంధించి రు. 62కోట్లు బకాయి ఉందని, దీనిపై గత ఏడాది జనవరి రెండున డిమాండ్ నోటీస్ జారీ చేసినప్పటికీ రుణగ్రహీతలు స్పందించనందున 20మార్చి 2015న స్టూడియోస్‌ తరపున తనఖా పెట్టిన స్థలాన్ని స్వాధీన పరుచుకున్నట్లు బ్యాంక్ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్థలానికి సంబంధించి ఎట్టి లావాదేవీలూ జరుపరాదని హెచ్చరించారు. రుణాన్ని తీసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కుమారులు నాగార్జునరావు(నాగార్జున) ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే నాగేశ్వరరావు చనిపోయినందున  నాగార్జునతోబాటు నాగేశ్వరరావు వారసులు వెంకట నారాయణరావు(వెంకట్), కుమార్తె నాగసుశీల('కరెంట్' సుశాంత్ తల్లి), మరో కుమార్తె సరోజ మనవరాలు సుప్రియ(అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హీరోయిన్), ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్(వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మాటీవీ), వెంకటేశ్ రొడ్డంకూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని బ్యాంక్ అధికారులు  తెలిపారు. ఈ బకాయిలకు గ్యారెంటర్లుగా నాగార్జున, సుప్రియ ఉన్నట్లు వెల్లడించారు. 



ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటారని ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటినుంచి అక్కినేనికి మంచి పేరుంది. మద్రాస్‌లో, హైదరాబాద్‌లో, ప.గో.జిల్లాలో అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనేక స్థిరాస్తులు ఉన్నాయి. దానికితోడు ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిచిన 'మనం' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది అక్కినేని చనిపోయిన కొద్దికాలానికే ఇలా ఆయన కుటుంబం పేరు పేపర్లకెక్కటం ఆశ్చర్యకరంగా ఉంది. 


బ్యాంక్ అధికారుల పత్రికా ప్రకటనను ఈ లింక్‌లో చూడొచ్చు -  http://epaper.eenadu.net. ఈ లింక్ లోకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఎంచుకుని అక్కడి dropdownనుంచి హైదరాబాద్ ఎడిషన్‌ సెలక్ట్ చేసుకుని రెండవ పేజిలో చూడండి.

Tuesday, March 10, 2015

యాపిల్‌వారి మరో ప్రతిష్ఠాత్మక ఉత్పాదన 'యాపిల్ వాచ్' ఆవిష్కారం!


మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపేడ్‌వంటి అత్యుత్తమమైన ఉత్పత్తులతో చరిత్ర సృష్టించిన యాపిల్ సంస్థ, తమ మరో ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి 'యాపిల్ వాచ్‌'ను నిన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది.  దీనిని రెండు సైజులలో వివిధ మోడల్స్, డిజైన్లలో తయారు చేశారు. ప్రారంభ దర - 349 అమెరికన్ డాలర్లు. ఇది సుమారు రు.21 వేలకు సమానం. గరిష్ఠధర - 17,000 అమెరికన్ డాలర్లు(రు. 10,20,000). గరిష్ఠ మోడల్‌ వాచ్‌ను 18 క్యారట్ల బంగారంతో రూపొందించారు. డిస్‌ప్లే గ్లాస్‌ను సఫైర్(నీలం)తో తయారు చేశారు.

వచ్చేనెల పదినుంచి ఆర్డర్‌లు బుక్ చేసుకోవచ్చని, 24నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ చేసే కాల్స్, మెసేజెస్, పేమెంట్స్‌వంటి పలు పనులతోబాటుగా ధరించినవారి హృదయ స్పందనలను(హార్ట్ బీట్), వారు చేసే వ్యాయామం వివరాలను కూడా నమోదు చేస్తుందని కుక్ చెప్పారు. చేయవలసినపనులను(రిమైండర్స్) మణికట్టుమీద తట్టిమరీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో చెక్‌ఇన్ చేయటానికి, కొన్ని హోటల్స్‌లో గదులకు తాళంగాకూడా ఈ వాచ్‌ను ఉపయోగించొచ్చని టిమ్ కుక్ నిన్న ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పారు. బ్యాటరీలో ఛార్జి 18 గంటలు వస్తుందని వెల్లడించారు. 

మరోవైపు యాపిల్ వాచ్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేవలం హార్ట్ బీట్ వంటి కొన్ని పనులు మాత్రమే ఫోన్ కంటే అదనంగా వాచ్ చేస్తోందని, వాటికోసం అంత ఖర్చుపెట్టి దానిని కొనాల్సిన అవసరం లేదని, పలు రిస్ట్ బ్యాండ్ ట్రాకర్‌లు లభిస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. అటు వాచ్ ఆవిష్కరణ కార్యక్రమంలోనే సరికొత్త 12 అంగుళాల మ్యాక్ బుక్‌ ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేశారు. దీనిలో ఒకే ఒక యూఎస్‌బీ పోర్ట్ ఉండటం విశేషం.

Image courtesy: www.apple.com


రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...