Monday, June 9, 2014

చంద్రబాబును అభినందించకుండా ఉండలేం!


ఏ వ్యక్తయినా విజయం సాధించగానే ఆ సమయంలో ఆ వ్యక్తిలోని సానుకూల అంశాలు ప్రముఖంగా కనబడతాయి. అయితే 2014 ఎన్నికలలో చంద్రబాబు సాధించిన విజయం ఆషామాషీది కాదు. పదేళ్ళపాటు అత్యంత కఠినాత్మక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనికూడా పార్టీని కాపాడుకుంటూ తిరిగి అధికారపగ్గాలు చేపట్టటం ఒక విజయగాధ అనే చెప్పాలి. ఆయన విజయంనుంచి స్ఫూర్తి పొందవలసింది ఎంత అనేది తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం. 


  • పదేళ్ళపాటు అత్యంత ప్రతికూల, కఠినాతి కఠిన పరిస్థితులను, అవమానాలను, హేళనలను ఎదుర్కొన్నారు. 
  • ప్రత్యర్ధి పార్టీలలోని గల్లీనాయకులనుంచి ఢిల్లీ నేతలదాకా ప్రతిఒక్కరూ చంద్రబాబును తిట్టేవారే. 
  • ఇక సొంతపార్టీనుంచి పలువురు అగ్రనాయకులు ఇతరపార్టీలకు క్యూకట్టటం. 
  • కుటుంబంలో అసంతృప్తితో రగులుతున్న ఒకవర్గం

ఒకానొక సమయంలో పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతటి పరిస్థితులలో మరొకరైతే కాడిపారేసి పారిపోయేవారని చెప్పకతప్పదు. చంద్రబాబు వీటన్నంటినీ తట్టుకున్నారు. మళ్ళీ పార్టీని మళ్ళీ విజయందిశగా నడిపించి అధికారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనుసరించిన సహనం, ఓర్పు, సానుకూలవైఖరి, పట్టుదల, కృషి, ఆశావహదృక్పథం, తప్పులను తెలుసుకోవటం, వాటిని సరిదిద్దుకోవటంవంటి అంశాలు ఆయనకు మళ్ళీ విజయాన్ని ఎలా సాధించిపెట్టాయో పరికించండి. 

ఎన్‌టీఆర్ అహంకార వైఖరిపై, రాజ్యాంగేతరశక్తిగా లక్ష్మీపార్వతి జోక్యంపై నాటి టీడీపీ ఎమ్మెల్యేలలో పెల్లుబికిన వ్యతిరేకతను తనకనుకూలంగా మలుచుకుని చంద్రబాబునాయుడు 1995 ఆగస్ట్‌లో అధికారంలోకొచ్చిన సంగతి తెలిసిందే. తన తొమ్మిదేళ్ళపాలనలో కేవలం ఐటీ, పారిశ్రామికరంగాలపైనే దృష్టిపెట్టటం, వ్యవసాయం దండగ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వోద్యోగులపట్ల కఠినవైఖరి అవలంబించి వారిని శత్రువులను చేసుకోవటం, పార్టీ శ్రేణులను అంతగా పట్టించుకోకపోవటంతో ప్రజలలో బాగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల అభిమానాన్ని చూరగొని 2004 ఎన్నికలలో అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. వచ్చీరావటంతోనే ఎన్నికలలో ఇచ్చిన ఉచితకరెంట్ హామీకి సంబంధించిన జీవోపై సంతకం చేశారు. సంతకం చేయటమేకాక చంద్రబాబు ఆ హామీని ఎద్దేవా చేయటాన్ని, వ్యవసాయం దండగ అనటాన్ని బాగా ప్రచారం చేశారు. ఎన్నికలలో పరాజయంతోబాటు ఈ ప్రచారం బాగా జరగటంతో చంద్రబాబు మొదట్లో కొంతకాలంపాటు స్థాణువైపోయి స్తబ్దుగా ఉండిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బయటపడిన వోక్స్‌వాగన్, ఎలుగుబంటి సూర్యనారాయణవంటి కుంభకోణాలపై ప్రతిపక్షంగా చేయవలసిన కనీస ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలుకూడా చేయలేదు. మరోవైపు 'ఆకర్ష్' పేరుతో వైఎస్ తెలుగుదేశంనుంచి అనేకమంది నాయకులను విజయవంతంగా కాంగ్రెస్ గొడుగుకిందికి లాగారు. ఇటు అసెంబ్లీలో చంద్రబాబుపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభృతులతో కలిసి ముప్పేటదాడి చేసేవారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, 'తల్లి కడుపులోనుంచి ఎందుకు బయటికొచ్చానా అని కుమిలిపోయేలా చేస్తాను' అంటూ వైఎస్ ఒక సందర్భంలో చంద్రబాబుపై సాక్షాత్తూ శాసనసభలోనే తీవ్రపదజాలంతోకూడిన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ భరిస్తూనే చంద్రబాబు మెల్లగా పుంజుకుని ప్రతిపక్షనేతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించటం ప్రారంభించారు. 2009 ఎన్నికలు లక్ష్యంగా - కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న భారీస్థాయి అవినీతిపై, ముఖ్యంగా జలయజ్ఞంపై ఉద్యమాలు చేపట్టారు. తాను మారిన మనిషినని, రియలైజ్ అయ్యానని వివిధ సందర్భాలలో చెప్పడంద్వారా తన తప్పులు తెలుసుకున్నట్లు అన్యాపదేశంగా ప్రకటించారు. ముఖ్యంగా వైఎస్ తనను నమ్ముకున్నవారికి అండగా నిలిచేతీరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు ఆ కోణంలో తన లోపం బాగా అర్ధమయింది. కార్యకర్తలను బాగా పలకరించటం, వారి బాగోగులు తెలుసుకోవటం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో 2008ఆగస్ట్‌లో 'ప్రజారాజ్యం' రూపంలో తెలుగుదేశానికి మరో సవాల్ ఎదురయింది. ఆరంభంలో పీఆర్‌పీ బ్రహ్మాండంగా దూసుకుపోయింది. చిరంజీవి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై జేజేలు పలికారు. తెలుగుదేశంనుంచి అనేకమంది పాతకాపులు ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ పార్టీని, నాయకత్వంపై పట్టును చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారు(అయితే అంత భారీస్థాయిలో దూసుకువచ్చిన ప్రజారాజ్యం రానురానూ పలచబడిపోయి 2009ఎన్నికలసమయానికి దిగజారిపోవటం వేరేవిషయం).

2009ఎన్నికలలో వామపక్షాలతో, తెలంగాణరాష్ట్రసమితితో మహాకూటమి పేరుతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. ఈ నిర్ణయం చంద్రబాబు చేసిన మరో అతిపెద్ద తప్పుఅని ఇప్పటికీ చాలామంది అంటుంటారు. ఈ పొత్తువలన టీడీపీ-టీఆర్ఎస్‌లలో టీఆర్ఎస్సే ఎక్కువ లాభపడింది. మరోవైపు సీమాంధ్రలో ప్రజారాజ్యం తెలుగుదేశం విజయావకాశాలకు తీవ్రంగా గండికొట్టింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ఓట్లనే చీలుస్తుందని, దానివలన తమకే లాభమని ఊహించుకుని సంబరపడిన టీడీపీ నేతలకు ఎన్నికల ఫలితాలలో ఝలక్ తగిలింది. ప్రజారాజ్యం కొన్నిచోట్ల కాంగ్రెస్ ఓట్లను, మరికొన్నిచోట్ల టీడీపీ ఓట్లను చీల్చుకోవటంతో టీడీపీకే ఎక్కువ నష్టం కలిగింది. మళ్ళీ చంద్రబాబుకు భంగపాటు తప్పలేదు. వైఎస్ అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే సీట్లు దాదాపు వందదాకా రావటం కొంతలో కొంత టీడీపీకి ఊరటనిచ్చింది. 

2004ఎన్నికల తర్వాత మొదట్లో కొంతకాలం స్తబ్దుగా ఉన్న చంద్రబాబు, 2009ఎన్నికల తర్వాతమాత్రం అలా కాకుండా మొదటినుంచే మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర పోషించారు. ప్రతిపక్షనేతగా ప్రజల తరపున, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈక్రమంలో బాబ్లీపై మహారాష్ట్ర ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010 జులైలో తమపార్టీ నేతలను తీసుకుని ఆనకట్ట నిర్మాణస్థలానికి వెళ్ళిన చంద్రబాబు బృందాన్ని మరాఠా ప్రభుత్వం దాదాపుగా తన్ని పంపించింది. అక్కడ పోలీసుల వైఖరికి చంద్రబాబు కళ్ళనీళ్ళపర్యంతమయ్యారు. తెలుగువారికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇంత అవమానం చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై సరైన రీతిలో స్పందించకపోవటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

2009 సెప్టంబర్‌లో వైఎస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత రాష్ట్ర రాజకీయ యవనికపైకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తనకు ప్రధాన శత్రువుగా చంద్రబాబునాయుడునే ఎంచుకున్నారు. ప్రతిదానికీ చంద్రబాబునాయుడుకు ముడిపెట్టి తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. మరోవైపు 2009 చివరలో ఆర్టికల్ 14ఎఫ్ రద్దుకోసం కేసీఆర్ చేసిన ఉద్యమం పలుమలుపులు తిరిగి కేంద్రప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటనచేయటానికి దారితీసింది. అయితే దీనిపై సీమాంధ్రలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు రగలడంతో నెలరోజులకే కేంద్ర తనప్రకటనను ఉపసంహరించుకుంది. ఈ పరిణామాలతో తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరింది. అప్పటినుంచి ప్రారంభమైన ఉద్యమం 2013 జులైలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించేవరకు అప్రతిహతంగా సాగింది. ఈ సమయంలో తెలుగుదేశం అత్యంత పరీక్షా పరిస్థితులను ఎదుర్కొంది. విడవమంటే పాముకుకోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుండేది చంద్రబాబు పరిస్థితి. 

సీమాంధ్రలో వైసీపీ, తెలంగాణలో తెరాస తెలుగుదేశాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో పని చేశాయి. రెండుపార్టీలకూ కాంగ్రెస్‌తో లోపాయకారీ ఒప్పందం ఉండటంతో తెలుగుదేశాన్నే ప్రధానశత్రువుగా ఎంచుకున్నాయి. తమ అస్తిత్వంకోసం ప్రతి సమస్యకూ చంద్రబాబునే కారణంగా చూపటానికి ప్రయత్నించాయి. 'లక్షకోట్ల అవినీతి' ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కూడా తన ఓదార్పుయాత్రలలో ఉపన్యాసం మొదలుపెట్టినదగ్గరనుంచీ ప్రతిదానికీ చంద్రబాబునే ముడిపెట్టి తిడుతుండేవారు. మరోవైపు టీఆర్‌ఎస్ నాయకులు - చంద్రబాబువలనే తెలంగాణ ఆగిపోతోందని ఆరోపించేవారు. తెలంగాణలో టీడీపీ ఒక్కసీటుకూడా గెలుచుకోలేదని, ఎన్నికలతర్వాత ఆ పార్టీ కార్యాలయాలకు టులెట్ బోర్డ్‌లు పెట్టుకోవాల్సిందేనని ఎద్దేవా చేసేవారు. బాబు రెండుకళ్ళ సిద్ధాంతంపై జోకులు పేల్చేవారు. ఇక కాంగ్రెస్ నాయకులకుకూడా చంద్రబాబునే 'పంచ్‌బ్యాగ్‌'లాగా ఉపయోగించుకున్నారు. అయినదానికీ, కానిదానికీ బాబుకు మతిస్థిమితం తప్పిందనేవారు. ఇలా మూడుపార్టీలూ చంద్రబాబుపై ముప్పేటదాడి చేసేవి. టీఆర్ఎస్ అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనీయమనేస్థాయికి వెళ్ళింది. 2012 జులైలో బాబు వరంగల్ జిల్లా పాలపర్తిలో రైతుయాత్రను తలపెడితే, తెలంగాణ గడ్డపై అడుగుపెడితే ఖబడ్దార్! అని టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరించారు. అయినప్పటికీ లెక్కచేయకుండా ఆ యాత్రను జరిపి పాలపర్తిలో బహిరంగసభలో చంద్రబాబు ఉపన్యసించారు. పాలపర్తి సభ చంద్రబాబులోని నాయకత్వ లక్షణాలను మరోసారి నిరూపించిందని చెప్పాలి. తెలంగాణ విషయంలో ఎవరెంతగా ఎద్దేవా చేసినా, తన రెండుకళ్ళ సిద్ధాంతాన్నిమాత్రం వీడలేదు. వాస్తవానికికూడా చంద్రబాబు తెలంగాణ ఉద్యమానికి మద్దతివ్వకపోయినా నష్టం చేసిందేమీలేదు. పైగా తెలంగాణకు అనుకూలంగా లేఖనుకూడా ఇచ్చిన విషయం మరిచిపోకూడదు. 

ఇక 2014ఎన్నికలు లక్ష్యంగా చంద్రబాబు 2012 అక్టోబర్ రెండవతేదీన 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను అనంతపూర్ జిల్లా హిందూపూర్‌లో ప్రారంభించారు. 64 సంవత్సరాల వయస్సులో ఆయన పాదయాత్ర చేపట్టడం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. కానీ అనేక క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న పార్టీలో ఉత్తేజం నింపి విజయందిశగా నడపటానికి, ప్రజలలో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవటానికి పాదయాత్ర ఒక్కటే ఉభయతారకమంత్రంగా బాబు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ఈ యాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండజిల్లాలలో సాగింది. టీఆర్ఎస్ నాయకులు పలు ఆటంకాలు, అవాంతరాలు కల్పించినప్పటికీ, తెలంగాణలో విజయవంతంగానే చంద్రబాబు ఈ పాదయాత్రను ముగించారు. అక్కడనుంచి సీమాంధ్రలోకి ప్రవేశించి విజయవంతంగా మొత్తం 207 రోజులపాటు పాదయాత్రను జరిపి 16 జిల్లాలలోని 84 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1246 గ్రామాలను చుట్టారు. 2013 ఏప్రిల్ 28న ముగిసిన ఈ పాదయాత్రలో బాబు మొత్తం 2,800 కిలోమీటర్లు పర్యటించారు. ఈ క్రమంలో అనేక అవాంతరాలు, అంతరాయాలు ఏర్పడినా వాటిని అధిగమించి విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించారు. సహజంగా ఏ నేతకైనా పాదయాత్రద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, కష్టాలు నేతలకు అర్ధమవుతాయి. చంద్రబాబు స్వతహాగా తెలివైనవాడు, నిశిత పరిశీలన కలిగినవాడు కావటంతో పరిస్థితులను మరింత బాగా ఆకళింపు చేసుకున్నారు. అందుకే పాదయాత్ర తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని పేర్కొన్నారు. 

ఇక ఎన్నికలు వచ్చేశాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మార్పు, వారిద్దరికీ(రోశయ్య, కిరణ్) పరిపాలనపై నియంత్రణలేకపోవటం, రాష్ట్రం అల్లకల్లోలంగా ఉండటంతో సీమాంధ్ర ప్రజలలో చంద్రబాబే మెరుగు అనే భావం విభజన ముందునాటికే ఏర్పడింది. దానికితోడు విభజన జరిగిన తర్వాత సీమాంధ్రను పాలించటానికి ఉన్న రెండు అవకాశాలలో(చంద్రబాబు-జగన్) చంద్రబాబే మెరుగనికూడా వారు భావించారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవటం, తద్వారా పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించటం టీడీపీకి కలిసొచ్చింది. జగన్ అవినీతిగురించి, కాంగ్రెస్-తెరాసతో అతని లోపాయకారీ ఒప్పందంగురించి తెలుగుదేశం ఎన్ని చెప్పినా అట్టడుగు స్థాయికి చేరని సందేశం, పవన్ కళ్యాణ్ చెప్పటంవలన చేరాల్సిన చోటికి చేరింది. వీటన్నంటితో ఒకప్పడు జగన్‌కు ఉవ్వెత్తున ఉన్న ప్రజాదరణ క్షీణించుకుంటూ పోయింది. తెలుగుదేశానికి స్పష్టమైన మెజారిటీ లభించింది. 

ఈ పదేళ్ళ బాబు ప్రస్థానంచూస్తే, ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా ఆయన మానసిక సంతులనాన్ని కోల్పోకుండా లక్ష్యంవైపే చేసిన ప్రయాణాన్ని ఎవరైనా ప్రశంశించకుండా ఉండలేరు. వీటన్నింటినీమించినది మరొకటి ఉంది. ఒక సానుకూల దృక్పథంతో, ఒక దీక్షతో ఆయన చేపట్టిన పాదయాత్ర అనే బృహత్తర కార్యక్రమం ఆయనను లక్ష్యానికి చేర్చింది. విచిత్రమేమిటంటే వైఎస్ 2004లో అధికారాన్ని చేపట్టటానికికూడా సానుకూలదృక్పథంతో చేపట్టిన పాదయాత్రే కారణం. అప్పటివరకు వైఎస్ ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ప్రతికూల వైఖరే ఉండేది. ఏ ముఖ్యమంత్రి గద్దెనెక్కినా వెనక అసమ్మతి శిబిరాలు నడపటం, ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచటంవంటి కార్యక్రమాలనే వైఎస్ చేస్తుండేవారు. అయితే మొదటిసారిగా 2003 వేసవిలో ఆయన ఒక సానుకూలవైఖరితో, 'ప్రజాప్రస్థానం' అనే పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. విజయాన్ని అందుకున్నారు. అయితే అధికారాన్ని చేపట్టాక ఆయన బడుగువర్గాలకు సంక్షేమ పథకాలనే ఎంగిలి మెతుకులు విసిరి ఆబగా అవినీతి, ఆశ్రిత పక్షపాతాలతో రాష్ట్రాన్ని గుల్లచేసి 'కాలధర్మం' చెందారు. 

ఏది ఏమైనా అధికారాన్ని తిరిగి చేపట్టటంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి, విధానాలనుంచి ప్రతిఒక్కరూ స్ఫూర్తిపొందాల్సింది ఎంతోకొంత ఉందనటంలే ఏమాత్రం సందేహంలేదు. అయితే అధికారం చేపట్టిన తర్వాత పాతరోజులను మరిచిపోతే ప్రజలు, ప్రకృతి ఆయనకు గుణపాఠం చెప్పటంమాత్రం ఖాయం.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts