Friday, August 19, 2011

ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?
అన్నాహజారే ఉదంతం – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, 'అన్నా' వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. 'అన్నా'విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం.

రెండు తప్పుడు నిర్ణయాలు(డిసెంబర్ 9నాటి తెలంగాణా ప్రకటన, జగన్‌ను సరిగా టేకిల్ చేయలేకపోవడం) తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే రావణకాష్ఠంలాగా మార్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని మించిన ఒక చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడి నడిబజారులో పరువు పోగొట్టుకుంది. నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోబోతున్న 'అన్నా'ను, నియంతృత్వ ధోరణిలో కొద్దిగంటలముందు అరెస్టు చేయించింది. ఒక్కసారి దేశమంతా భగ్గుమంది. ప్రజలు వెల్లవలా బయటకొచ్చి 'అన్నా'కు మద్దతుగా నిలబడి ప్రభుత్వంపై నిప్పులుగక్కారు. అప్పటికిగానీ పరిస్థితి అర్ధంగాని ప్రభుత్వం కాళ్ళబేరానికొచ్చింది. 'అన్నా' బృందంతో బేరసారాలు మొదలుపెట్టి చివరికి వారు కోరినట్లు రామ్ లీలా మైదానంలో దీక్షకు అనుమతి ఇచ్చింది.

సరే, డిసెంబర్9నాటి చిదంబరం ప్రకటనను – కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో హడావుడిగా తీసుకున్న నిర్ణయమని, జగన్ విషయంలో - తెలంగాణా సీనియర్లు హైక‌మాండ్‌ను తప్పుదోవ పట్టించడం కారణమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, 'అన్నా' - లోక్‌పాల్ సంక్షోభం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమి కాదు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును తూతూమంత్రంగా రూపొందిస్తోందని ఆరోపిస్తూ, ఆగస్టు 16నుంచి మళ్ళీ నిరాహారదీక్ష చేపడతానని 'అన్నా' దాదాపు 15రోజులక్రితమే ప్రకటించారు. మరి ఇంత సమయమున్నా ప్రభుత్వం ఈ విషయంలో ఇటువంటి అవివేకమైన నిర్ణయం ఎలా తీసుకుందో తెలియడంలేదు. ఏప్రిల్‌నెల‌లో 'అన్నా' చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ప్రజలనుంచి, మీడియానుంచి... ఇంకా చెప్పాలంటే సమాజంలోని అన్నివర్గాలనుంచి లభించిన అనూహ్య మద్దతు, ఆ దెబ్బకు దడిసి తామే దిగివచ్చి అన్నా పెట్టిన షరతులన్నింటికీ అంగీకరించడం – కేంద్రప్రభుత్వం మరిచిపోయిఉంటుందని అనుకోలేము. మరి, ఇంత జరిగినా చివరి నిమిషంలో ప్రభుత్వం నిన్న ఇటువంటి అవివేకమైన నిర్ణయం తీసుకుందంటే 1. ప్రజల మనోభావాలను పసిగట్టలేకపోవడమైనా జరిగిఉండాలి లేదా 2. సరైనరీతిలో మేధోమథనం జరగకపోయిఉండాలి. మొదటి కారణాన్ని కొట్టిపారేయవచ్చు...ఎందుకంటే ప్రజల మనోభావాలను పసిగట్టి ఎప్పటికప్పుడు చేరవేసే పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇక రెండో కారణమే అయి ఉండాలి. మరి ఇంతమంది కురువృద్ధులు, దిగ్గజాలు ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే వారిమధ్యలో పొంతన లేకపోవడమే కారణమని స్పష్టమవుతోంది. కేంద్రమంత్రులు తలోదారిగా ఉండి కీచులాడుకోవడం, ప్రధానమంత్రి వారిని అదుపు చేయలేకపోవడం గురించి మీడియాలో కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామం ఆ వార్తలను ధృవీకరించినట్లయింది. మరి ఈ ప్రభుత్వం ముందుముందు ఇంకా ఇలాంటి చెత్త నిర్ణయాలు ఎన్ని తీసుకుంటుందో చూడాలి.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts