Sunday, March 30, 2014

"సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తెరాస విజయఢంకా"

త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తెరాస మెజారిటీ సాధిస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు  నీల్సన్-ఎన్‌టీవీ సంస్థలు వెల్లడించాయి. ఇవాళ వెలువడిన ఈ సర్వేఫలితాల ప్రకారం, సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 129-133, తెలుగుదేశానికి 42-46, కాంగ్రెస్‌కు 0 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ పార్టీకి 19-21స్థానాలు, తెలుగుదేశానికి 4-6, కాంగ్రెస్‌కు 0 స్థానాలు లభిస్తాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 51-57, కాంగ్రెస్‌కు 46-52, బీజేపీకి 5-8, తెలుగుదేశానికి 4-6,ఎమ్ఐఎమ్‌కు 7-8, పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు 6-8, కాంగ్రెస్‌కు 7-9 సీట్లు దక్కనున్నాయని సర్వే చెబుతోంది.

అయితే, అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల ఖరారు తర్వాత ఈసర్వే ఫలితాలలో స్వల్ప తేడాలుంటాయని, మళ్ళీ తాము కొద్దిరోజులలో మరో సర్వే జరపబోతున్నామని, అప్పుడు మరింత ఖచ్చితత్వం వస్తుందని నీల్సన్ సంస్థ ప్రతినిధి శేషగిరిరావు చెప్పారు. సీమాంధ్రలో జగన్ పార్టీ ప్రభావం నిలకడగా ఉంటుండగా, తెలుగుదేశం పుంజుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండుపార్టీలమధ్య ఓట్లశాతం తేడా ఎనిమిదేనని, పట్టణ ప్రాంత ఓటర్లు టీడీపీవైపు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు. 

జగన్ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్ధుల ఎంపిక విషయాలలో బాగా బలహీనంగా ఉందికాబట్టి అది తెలుగుదేశానికి కలిసిరావచ్చని సర్వేఫలితాలపై ఎన్‌టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీమాంధ్రశాఖ ముఖ్యనాయకుడు రఘునాధబాబు అన్నారు. మరోవైపు సీమాంధ్రలో అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ ప్రకటించారు. ఎన్‌టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో రమేష్ ఈ ప్రకటన చేశారు. ఈ సర్వేను నమ్ముతున్నామని జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి, తెరాస నేత కేటీఆర్ చెప్పారు. 

image courtesy:ntvtelugu.com

Saturday, March 29, 2014

'యోగాతో ఆక్రోబాటిక్ విన్యాసం' - అద్భుతమైన వీడియో

పవన్ విశాఖ ప్రసంగంలో ఒక చెప్పుకోదగ్గ పాయింట్


జనసేన పార్టీ, దాని సిద్ధాంతాలు, పవన్ 'ఇజం'పైన ఎన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, విశాఖపట్నం ప్రసంగంలో కళ్యాణ్ లేవనెత్తిన ఒక పాయింట్‌‌ మాత్రం అధికశాతంమందినుంచి ప్రశంసలు అందుకుంటోంది.. అదేమిటంటే, రానున్న లోక్‌సభ ఎన్నికలకుగానూ అభ్యర్ధులను ఎంపికచేయటానికి కాంగ్రెస్ పెద్దలు వార్ రూమ్‌లో ఏకబిగిన 12గంటలపాటు చర్చలు జరిపినట్లు నిన్న దినపత్రికలలో వచ్చిన వార్తగురించి. సొంతపార్టీ అభ్యర్ధుల ఎంపికపై ఇంత సుదీర్ఘ కసరత్తు చేసే కాంగ్రెస్ పార్టీ - దేశంలోని అతిపెద్దరాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించటంపై అదే వార్ రూమ్‌లో 40నిమిషాలలో నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రప్రజల మనోభావాలంటే కాంగ్రెస్ పార్టీకి అంత చులకనగా ఉందా అంటూ నిప్పులు చెరిగారు.

ఈ పాయింట్‌ను మాత్రం అందరూ ఒప్పుకుని తీరాలి. పదేళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్నికలు రాబోతున్నాయనగా, ఆఖరినిమిషంలో విభజనకు అంగీకరించటం తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించికాదని, ఓట్లకోసమేనని అందరికీ తెలిసిన విషయమే. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ప్రవేశపెట్టిన ఈ విభజనబిల్లువలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నమాటేగానీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పూర్తిగా నెరవేరటంలేదని, పలు నష్టాలున్నాయని కేసీఆర్‌తోసహా పలువురు తెలంగాణవాదులు చెబుతున్నసంగతి తెలిసిందే(తెలంగాణ ఉద్యమానికి ఇది ఇంటర్వెల్ - కేసీఆర్).

అటు సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించికూడా, ఆ ప్రాంత కేంద్రమంత్రులు ప్రతిపాదించిన పలు సవరణలు పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ఉభయసభలలో దానిని ఆమోదింపజేసింది. పైగా ఇంత ముఖ్యమైన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టేసమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌గానీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీగానీ సభలో లేకపోవటం గమనార్హం.

అందుకే, పవన్ ప్రసంగంలో కాంగ్రెస్‌పై చేసిన విమర్శలలో ఇదిమాత్రం అతని సినిమాలలో సూపర్‌హిట్ డైలాగులాగా బాగా పేలిందని చెప్పాలి.

Thursday, March 27, 2014

మరో వివాదంలో మోహన్‌బాబు:గౌరవ డాక్టరేట్ నకిలీదేనని నిర్ధారణ
డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును మరో వివాదం చుట్టుముట్టింది. అయినా వివాదాలు ఆయనకు కొత్తకాదనుకోండి. ఈ సారి వివాదం ఆయనకు కొన్నేళ్ళక్రితం లభించిన గౌరవ డాక్టరేట్ పట్టాపై. అమెరికాలోని ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్ పట్టాఇచ్చి గౌరవించింది. అప్పటివరకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి గొప్పనటులకు ఆంధ్రా యూనివర్సిటీయో, నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్‌లు ఇవ్వటంమాత్రమే చూసిన తెలుగువారికి మోహన్‌బాబు నేరుగా అమెరికానుంచే డాక్టరేట్ పట్టా పొందటం ఆశ్చర్యకరంగానూ, అపూర్వంగానూ అనిపించింది. ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆయనకు చెన్నైలో నాడు భారీఎత్తున సన్మానంకూడా జరిగింది.

సదరు అమెరికా యూనివర్సిటీ ఒక పెద్ద ఫ్రాడ్ అని ఇప్పుడు తేలింది. ఈ సంస్థ మోహన్‌బాబుకేకాక మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు(మాజీ మంత్రి గల్లా అరుణతండ్రి), మిసిమి పత్రిక ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ వంటి మరికొందరు తెలుగువారికికూడా ఈ గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చిందట. ఈ యూనివర్సిటీ వ్యవహారం తేడాగా ఉన్నట్లు గమనించిన నరిశెట్టి ఇన్నయ్యగారనే సీనియర్ తెలుగు జర్నలిస్ట్ అమెరికా వెళ్ళినపుడు దీనిపై పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇన్నయ్యగారిని గురించి చెప్పుకోవాలి. ఈయన డెబ్భై, ఎనభై దశకాలలో తెలుగు మీడియాలో పేరుగాంచిన పాత్రికేయులు, హేతువాది, మానవతావాది. కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, వైఎస్ వంటి ముఖ్యమంత్రిస్థాయి నాయకులతో నేరుగా మాట్లాడేటంత చనువు, సాన్నిహిత్యం వీరికి ఉండేది. అమెరికానుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ఎడిటర్‌ రాజు నరిశెట్టి వీరి కుమారుడే.

ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్‌లపై సంతకాలు చేసే రాయ్ బి అలివర్ అనే వ్యక్తికోసం ఇన్నయ్య ఆరా తీయగా అతను క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో లాస్ ఆల్టోస్ అనే చోట ఉన్నట్లు తెలిసింది. ఇన్నయ్య నేరుగా ఆయన ఉన్నచోటికి వెళ్ళి కలిసి యూనివర్సిటీ ఎక్కడ అని అడగగా, వాషింగ్టన్ నగరంలో ఒక చిరునామాను ఇచ్చరట. తమ యూనివర్సిటీపై ఇండియాలోని హిందూ దినపత్రిక నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆ పత్రికపై దావా వేయబోతున్నానని కూడా చెప్పాడట. ఇక ఇన్నయ్య అలివర్ ఇచ్చిన వాషింగ్టన్ చిరునామాకు వెళ్ళగా అది తాళంవేసిఉన్న ఒక అపార్ట్‌మెంట్ అడ్రస్‌గా తేలింది.

చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న త్యాగరాజన్ అనే ఏజెంట్ ద్వారా అలివర్ డాక్టరేట్ డిగ్రీల బేరాలు మాట్లాడుకుంటాడని ఇన్నయ్యగారి పరిశోధనలలో బయటపడింది. ఇదీ మన లెజెండ్ మోహన్‌బాబుగారి డాక్టరేట్ ప్రహసనం. పద్మశ్రీ పురస్కారం దుర్వినియోగంపై ఇప్పటికే హైకోర్టులో ఆయనపై కేసునడుస్తున్న సంగతి తెలిసిందే. దానికితోడు ఈ నకిలీ డాక్టరేట్ విషయం కూడా హైకోర్టువారికి తెలిస్తే పెదరాయుడు పరిస్థితి ఏమిటో?


గమనిక: 'ది హన్స్ ఇండియా' ఆంగ్లదినపత్రికలో ఇన్నయ్యగారు ఈ విషయంపై రాసిన వ్యాసాన్ని పై భాగాన చూడొచ్చు. దాని లింక్ - http://goo.gl/PdgcS7

Wednesday, March 26, 2014

సీమాంధ్రప్రాంతంలో 'హాట్ ఫేవరెట్' తెలుగుదేశమా!


సీమాంధ్రలో తెలుగుదేశంలోకి జంపింగ్‌లు, మీడియాలో వస్తున్న వార్తలనుబట్టిచూస్తే అక్కడ జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీయే 'హాట్ ఫేవరెట్'అన్న అభిప్రాయం కలగకమానదు. మరోవైపు తమ పార్టీలోకి వస్తున్న జంప్ జిలానీలను చూసి ఆత్మవిశ్వాసం పొంగి పొర్లుతున్న చంద్రబాబునాయుడు ఇప్పటికే సీమాంధ్ర సీఎమ్ అయిపోయినట్లు మాట్లాడుతున్నారు(ఇటీవల హైదరాబాద్‌లో 'మీట్ ది పీపుల్' అనే కార్యక్రమంలో  పాల్గొంటూ, ఆ కార్యక్రమానికి హాజరైన వివిధవర్గాలవారికి భారీ లెవల్‌లో హామీలు గుప్పించి సీమాంధ్ర ముఖ్యమంత్రిననే భావం అక్కడున్నవారికి కల్పించారట చంద్రబాబు). భారీస్థాయిలో   కాంగ్రెస్ నుంచి దూకుతున్న జంప్ జిలాని నాయకులతో తెలుగుదేశంపార్టీ కిటకిటలాడుతున్నమాట వాస్తవమే. ఓవర్‌ఫ్లోను తట్టుకోలేక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడిన మాటా నిజమే. అయితే దీనిని ఫలితాలకు సూచికగా తీసుకోవటం అమాయకత్వమే అవుతుంది. టీడీపీలోకి దూకుతోంది నాయకులేగానీ, ఓటర్లుకాదన్న విషయాన్ని మరిచిపోగూడదు. అసలు ఈ జంపింగ్ జపాంగ్‌లవలన విశాఖపట్నం, అనంతపురం, కర్నూలువంటి పలు జిల్లాలలో  ఆ పార్టీ వ్యతిరేక ఫలితాలను చవిచూడబోతోందని అంటున్నారు. విశాఖపట్నంజిల్లాలో తాజా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావువర్గం చేరికపై అయ్యన్నపాత్రుడువర్గం, అనంతపురంలో జేసీ బ్రదర్స్ చేరికపై పరిటాలవర్గం, కర్నూలుజిల్లాలో తాజా మాజీ మంత్రిలు టీజీ, ఏరాసు చేరికపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్న విషయం తెలిసిందే. ఎన్నోసంవత్సరాలనుంచి పార్టీని అంటిపెట్టుకునిఉన్నవారు ఉండగా, ఎన్నికలముందు వచ్చినవారికి పెద్దపీటవేస్తే ఆగ్రహజ్వాలలు పెల్లుబకడం సహజం.

ఈ జంప్ జిలానీలను, చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్నిమాత్రమే చూసేవారు జగన్ వేవ్‌ను మరిచిపోగూడదు. జగన్‌కు మొదట్లో ఉన్న ఊపు తర్వాతికాలంలో 
కొంత తగ్గినప్పటికీ అది ఇప్పటికీ గణనీయంగానే ఉందనేది కాదనలేని వాస్తవం. అతని లక్షకోట్ల అవినీతి గురించి ఎంత ప్రచారం జరిగినా, వైఎస్ సంక్షేమపథకాలవలన లబ్ది పొందినవారిలో చాలామంది ఒక్కసారికి మాత్రం జగన్‌కు ఓటువేయాలని ఏనాడో డిసైడైపోయారు. ఇక క్రైస్తవ సెంటిమెంట్ ఉండనే ఉంది. రెడ్డి సామాజికవర్గ యువకులైతే పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఈ మూడువర్గాల ఓట్లు జగన్ పార్టీకి హోల్‌సేల్‌గా పడనున్నాయనటంలో ఎటువంటి సందేహంలేదు. కాకపోతే ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు అంత సజావుగా లేనందున వారి పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్ధుల ఎంపిక ఎలా ఉంటుందనేదానిపై కొంత సందేహాలు ఉన్నాయి.

అయితే, తెలుగుదేశానికి ఈ ఎన్నికల్లో అనుకూలించే మంచి అంశాలు లేకపోలేదు. మొదటిది ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌పై సీమాంధ్రలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత. ఇక రెండవది, పదిసంవత్సరాలనుంచి కాంగ్రెస్‌పాలనను, ముఖ్యంగా రాజశేఖరరెడ్డి మరణంతర్వాత రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసిన సీమాంధ్రమధ్యతరగతిప్రజలలో, ముఖ్యంగా ఉద్యోగవర్గాలలో 'చంద్రబాబే మెరుగు' అన్నవాదన బాగానే వినబడుతోంది. అయితే ఈ వర్గాలు ఓటింగుకు రావటం  తక్కువ అన్నది తెలిసిందే. ఓటుహక్కు వినియోగంపై ఈ సారి ప్రచారం జరుగుతున్నందున విద్యావంతులు, పట్టణఓటర్లు, మధ్యతరగతివారు ఓటింగ్‌లో చురుకుగా పాల్గొంటేమాత్రం తెలుగుదేశానికి కలిసిరావొచ్చు. ఇక రాష్ట్రంలోని రెండు ప్రధాన దినపత్రికలు, అదే యాజమాన్యం క్రింద ఉన్న న్యూస్ ఛానళ్ళు టీడీపీకి అనుకూలించే మరో అంశం. ఈ రెండు మీడియా సంస్థలూ కొంతకాలంగా చంద్రబాబును మళ్ళీ గద్దెనెక్కించాలని కంకణం కట్టుకుని తీవ్రంగా కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ముస్లిమ్ ఓట్లను తెలుగుదేశం కోల్పోవలసి వస్తుంది. బీజేపీ మిత్రపక్షాలకు వేస్తే అది తమ చిరకాల శత్రువు మోడిని ప్రధానిని చేసే అవకాశమున్నందున టీడీపీకి ముస్లిమ్‌ల ఓట్లు పడకపోవచ్చు.

ఇక సీమాంధ్రలో జైసమైక్యాంధ్ర, జనసేన, బీజేపీలుకూడా ఉన్నా పోటీ తెలుగుదేశం, జగన్ పార్టీలమధ్యే ప్రధానంగా ఉంటుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకోసం చేసినకృషి, ఆయననిబద్ధత పలువురి ప్రశంశలు అందుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినతర్వాత పార్టీ ఏర్పాటును వెంటనే ప్రకటించకుండా మీనమేషాలు లెక్కపెట్టడం, ఆయనకు 'వర్గాన్ని కాపాడుకోవటం'వంటి నాయకత్వలక్షణాలు లేకపోవటం జై సమైక్యాంధ్రకు మైనస్ పాయింట్లు. అయితే స్వయంగా మంచి వ్యూహకర్త అయిన కిరణ్, మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. ఇక జనసేన విషయానికొస్తే, పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడు ప్రజలముందుకు రావటం తప్పితే, యువతలో తనకున్న అపూర్వ ప్రజాదరణను ఓట్లగా మలుచుకునే నిర్మాణాత్మక వ్యవస్థ, విధానాలు ఆ పార్టీలో కనబడటంలేదు. బీజేపీకి సీమాంధ్రలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పిస్తే, ఎక్కడా డిపాజిట్లు దక్కించుకునేంత దృశ్యం ఉండదు.

Friday, March 7, 2014

వర్మ మాటల్ని నిజం చేసిన పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఆమధ్య ట్వీట్ల వర్షం కురిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వర్మ మాటల్ని పవన్ మొత్తానికి నిజం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళో, రేపో పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

"పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ ఉంది, చూట్టానికి బాగుంటాడు, సినిమాల్లో అయితే ధియేటర్లలోనే చూడాలి, రాజకీయాల్లోకి వస్తే న్యూస్ ఛానల్స్‌లో రోజూ చూడొచ్చు" అంటూ తన ట్వీట్లకు కారణాన్ని వర్మ నాడు వివరించాడు. అది వర్మశైలి వ్యంగ్యమో, మనసులోనుంచి వచ్చిన మాటో చెప్పలేముగానీ పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ, కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు, సమాజానికి ఏదో చేయాలని(concern) ఉందని మాత్రం దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. అధికారమో, డబ్బో మాత్రమే లక్ష్యమే అయితే తన వృత్తిలో అత్యద్భుతమైన దశకు చేరుకున్న ప్రస్తుతతరుణంలో దానిని పణంగా పెట్టి రాజకీయాలలో దిగడని టాలీవుడ్ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ రాజకీయాలకు కేవలం నిజాయితీ, ఆదర్శాలు, పుస్తక పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ సొంత అన్నగారైన చిరంజీవి 'ప్రజారాజ్యం' అంటూ చేసిన ప్రయోగం విఫలమయిన తర్వాతకూడా పవన్ ఈ సాహసానికి దిగటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది('అన్న అయిపోయాడు, ఇక తమ్ముడు దిగాడు' అన్నది మొదట వినబడే విమర్శ).

ఇదంతా క్షుణ్ణంగా ఆలోచించి చేస్తున్న పనేనా? లేక తనదైన శైలిలో అప్పటికప్పుడు తోచిన నిర్ణయాన్ని అమలు చేసే(impulsive) పాత పద్ధతేనా అనేది ఇంకా తెలియరావటంలేదు. అతని వెంట ఉండి తోడ్పాటు, సలహాలు, సూచనలు ఇస్తున్న బృందం(think tank)  విషయపరిజ్ఞానం, దూరదృష్టి, రాజనీతిజ్ఞత ఉన్నదేనా, వంది మాగధులేనా అనేది కూడా తెలియాల్సిఉంది. గద్దర్ ఇటీవల పవన్‌ను కలుస్తున్నట్లు మాత్రం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రకటించబోయే విధివిధానాలు, లక్ష్యాలు ఆచరణాత్మకమేనా, ఆచరణసాధ్యంకాని ఊహాస్వర్గమా(utopian)అనేది 14వతేదీకి తెలిసిపోనుంది.

'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటి భారీవిజయాల తర్వాత అనూహ్యంగా కొండంతలు పెరిగిపోయిన ప్రజాదరణ పవన్‌నురాజకీయరంగప్రవేశమనే సాహసానికి పురిగొల్పిందని కొందరంటున్నారు. దక్షిణాదిలో రజనీకాంత్ తర్వాత పవన్ మాత్రమే అనే మాటలు కూడా ఇటీవల అక్కడక్కడా వినబడటంతో, పక్కనుండే భజనబృందం పవన్‌ను రెచ్చగొట్టి ఈ అడుగు వేయిస్తోందని మరికొందరి వాదన. 

తెలుగు సినీరంగంలో ప్రస్తుతం దాదాపుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న పవన్‌కు రెండు రాష్ట్రాలలోనూ గణనీయమైనస్థాయిలోనే అభిమానులు ఉన్నారనేది ఎవ్వరూ కాదనలేరు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆంధ్ర ప్రాంత హీరోను ఇష్టపడేవారు ఆంధ్రాకంటే తెలంగాణలోనే అత్యధికులు ఉన్నారు. ముఖ్యంగా, కళ్ళెదుట ఏదైనా కష్టం కనిపిస్తే తట్టుకోలేడని, వారికి వెంటనే సాయమందిస్తాడని, అన్న(నాగబాబు)ను అప్పులనుంచి బయటకు తీసుకురావటానికి ఇల్లు అమ్మేసుకున్నాడని చలామణిలో ఉన్న కథనాలతో అతని మంచితనం, మానవత్వాన్ని అభిమానిస్తూ తెలంగాణ యువత అతనిపట్ల విపరీతమైన అనురాగాన్ని పెంచుకున్నారు. ఇక ఆంధ్రాలో అభిమానులతోబాటు అతని సొంత(కాపు) సామాజికవర్గంవారి ఆదరణ ఎలానూ ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ఓట్లరూపంలోకి మారతాయని చెప్పలేముగానీ, తాము పోటీచేసే(9 పార్లమెంట్, 40 అసెంబ్లీ) నియోజకవర్గాలలో అభ్యర్థుల విజయావకాశాలను మాత్రం పవన్ పార్టీ ఖచ్చితంగా మార్చగలదని బల్లగుద్ది చెప్పొచ్చు.

కొసమెరుపు: అన్నయ్య, కేంద్రమంత్రి, కాంగ్రెస్ ముఖ్యనాయకుడు చిరంజీవి రేపు ఎన్నికల ప్రచారంలో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను ఎలా ఎదుర్కొనబోతున్నారనేది ఆసక్తిదాయకమైన పతాక సన్నివేశం కాబోతోంది.

image courtesy: wikipedia


Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts