Saturday, September 20, 2014

'ఆగడు' కాదు - 'దూకుడు సింగ్'

టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్  లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్.

ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకానంతస్పీడుగా ఉన్నాయంటే ఈ డైలాగులు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో మెరుపులు ఎక్కడా కనబడలేదు. సినిమా అంతా సాదా, సీదాగా సాగిపోతూ ఉంటుంది. కొన్నిచోట్ల బోరుగాకూడా అనిపిస్తుంది. తమన్ స్వరాలు నానాటికి తీసికట్టుగా తయారవుతుండటం తెలిసిందే. పాటల చిత్రీకరణలో నూతనత్వం, విజువల్ ట్రీట్ ఏమీ అనిపించలేదు. ఫోటోగ్రఫీచూస్తే - పోలీస్ స్టేషన్ సన్నివేశాలలో ఒక ప్రత్యేకమైన టింట్ కనిపించేటట్లు చేశారు. అది ఏమీ ఆహ్లాదకరంగా అనిపించకపోగా, లోపంలాగా కనిపించింది. శృతిహాసన్ పాటలోకూడా ఈ టింట్ కనబడటంతో అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటల లొకేషన్స్ బాగున్నాయి. సినిమామొత్తం భారీతనం అణువణువునా కొట్టొచ్చినట్లు కనబడింది. ఫస్ట్ హాఫ్ గబ్బర్ సింగ్, సెకండ్ హాఫ్ దూకుడు ప్రభావం బాగా కనిపించింది. సెకండ్ హాఫ్ లో విలన్స్ ను కొట్టే సన్నివేశాలలో నాయక్ చిత్రం గుర్తుకువస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువగా ఉండటం సినిమాకు మరో మైనస్ పాయింట్.

మరోవైపు గతవారం పోలీస్ కథలతోనే అనుక్షణం, పవర్ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. 'అనుక్షణం' విమర్శకుల ప్రశంశలు అందుకుంది. 'పవర్'లో రవితేజ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫయింగ్ గా, ఎనర్జిటిక్ గా ఉంది. ఇలాంటి సమయంలోనే రిలీజైన ఆగడులో మహేష్ పోలీస్ పాత్రను ఆ పాత్రలతో పోల్చటం అనివార్యం. వాటితో పోలిస్తే ఆగడులో మహేష్ పోషించిన ఎన్ కౌంటర్ శంకర్ పాత్ర గొప్పగా అనిపించదు. ప్రకాష్ రాజ్ శ్రీనువైట్లతో గొడవగురించి ప్రెస్ మీట్ లో చెప్పిన నామీద రాళ్ళు విసరకు, ఇల్లు కట్టుకుంటాను అనే కవితను ఈ చిత్రంలో విలన్ సోనూ సూద్ తో చెప్పించారు.

టాక్ వీక్ అయినప్పటికీ మేగ్జిమమ్ ధియేటర్లలో రిలీజ్ చేశారుకాబట్టి మొదటి వారంలో ఓపెనింగ్స్ ద్వారా నిర్మాతలు బాగానే రాబట్టుకోగలుగుతారు. ఏది ఏమైనా మహేష్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Friday, September 12, 2014

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ!


శతాధిక చిత్రాల దర్శకుడు, అన్నమయ్య, రామదాసువంటి 'కళాఖండాల' సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గతంలో ఒకసారి ప్రముఖ నిర్మాత కె.మురారి చెప్పుదెబ్బనుంచి తృటిలో తప్పించుకున్నారట. ఈ వైనాన్ని మురారి ఇవాళ చెన్నైలో స్వయంగా వివరించారు. 

చెన్నైలో నివసిస్తున్న మురారి ఇవాళ ఒక పుస్తకా‌విష్కరణ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ యాజమాన్యం డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు డాక్టరేట్ ఇవ్వటంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రకటింటిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి విషయంలో ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరంలేదని, అయితే రాఘవేంద్రరావుకు ఇవ్వటం సరైన నిర్ణయం కాదని మురారి అన్నారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మూర్తి అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. 

ఇక రాఘవేంద్రరావు గురించి చెప్పుకొస్తూ, అతనికి సంస్కారం లేదని, పెద్దలంటే గౌరవంలేదని మురారి అన్నారు. ఒకసారి అతను తమ ఇంటికి వచ్చినపుడు తమ ఇంటి హాల్‌లో తన తల్లిదండ్రుల ఫోటోను చూశాడని, ఆ ఫోటోలోని తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా, అంత అసహ్యంగా ఉందని రాఘవేంద్రరావు అన్నాడని మురారి చెప్పారు. ఆ మాటలతో తాను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తాను తేరుకుని స్పందించేలోపు, రాఘవేంద్రరావు తన భావాలను గమనించి వెంటనే వడివడిగా బయటకెళ్ళిపోయి కారులో ఉడాయించాడని మురారి చెప్పారు. తాను చెప్పుతీసేలోపుగానే ఇదంతా జరిగిపోయిందని తెలిపారు. రాఘవేంద్రరావు తనకు డబ్బలుకూడా ఎగ్గొట్టాడని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్‌‌లగురించి హేళనగా, చౌకబారుగా వ్యాఖ్యానిస్తాడని అన్నారు. అలాంటి సంస్కారహీనుడికి డాక్టరేట్ ఇవ్వటం ఏవిధంగా సముచితమని ప్రశ్నించారు. మురారి వ్యాఖ్యలపై10టీవీలో వార్తను ఈ లింక్‌లో చూడొచ్చు. మురారి యథాతథంగా చెప్పినమాటలను ఈ లింక్ లో చూడొచ్చు.

నిజానికి, వివాదరహితుడిగా తన అభిమానులతో, తన వర్గంవారితో కీర్తించబడే రాఘవేంద్రరావు ఖాతాలో ఒకటి రెండు వివాదాలు లేకపోలేదు. సుమారు పదిహేను ఏళ్ళక్రితం ఒక అమ్మాయి వివాదంలో నటుడు రాజశేఖర్ దర్శకేంద్రుడిని ఇంటికెళ్ళిమరీ బట్టలు చిరిగిపోయేవరకు కొట్టటం, అంతకుముందు సిల్క్ స్మితకు ఆయనకు మధ్య గొడవ వంటి  'కొద్ది' వివాదాలుమాత్రమే ఆయన కెరీర్‌లో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్‌2లోని ఆయన మల్టీప్లెక్స్ నిర్మించిన స్థలంపై వివాదం రాజకీయపరమైనది. హైదరాబాద్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించేదిశగా, రికార్డింగ్ ధియేటర్ కోసం నాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మించటంద్వారా రాఘవేంద్రరావు దానిని వాణిజ్య అవసరాలకోసం వాడుకున్నారంటూ కోర్టులో కొందరు కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు. ఆ రోజుల్లో అసెంబ్లీలో కూడా దానిపై పెద్ద గొడవ జరిగింది. 

సీతామాలక్ష్మి, గోరింటాకు వంటి చక్కటి చిత్రాలకు నిర్మాతగా ప్రసిద్ధిగాంచిన మురారి, రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్రిశూలం, జానకిరాముడు అనే చిత్రాలను నిర్మించారు.

అయితే, మురారి ప్రస్తావించిన విషయానికి ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించకపోవటం కాకతాళీయమో, మరేదైనా మతలబు ఉందో అనేదిమాత్రం తెలియటంలేదు.

                                                          ***

Thursday, September 11, 2014

'నమస్తే తెలంగాణ-2'గా మారుతున్న 'ఈనాడు'


వ్యాపారవేత్తలు పత్రికాధిపతులైతే చాలా ప్రమాదమని పత్రికారంగ పెద్దలు ఏనాడో చెప్పారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా ప్రమాణాలను పణంగా పెడుతున్న ప్రస్తుత తరుణాన్ని ఆ పెద్దలు ఆనాడే ఊహించి ఉంటారు.

హైదరాబాద్‌లో, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పలు వ్యాపారాలను, ఆస్తులను కలిగిఉన్న రామోజీరావు, ఆయన పుత్రరత్నం కిరణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల విధేయత ప్రకటించుకోవడానికి(to be in good books of KCR) నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలుగానీ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలుగానీ తమ పత్రికలో ప్రముఖంగా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామోజీరావు వ్యాపారాలను కేసీఆర్ ఏమి చేస్తాడనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వంవస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్ళతో దున్నిస్తానని గతంలో అన్న కేసీఆర్ ఇప్పుడు అంతపని చేయకపోవచ్చుగానీ, తెలంగాణలో కొత్త ఫిలిమ్ సిటీ(కేసీఆర్ ఇటీవల ఈమేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే) పెడితేమాత్రం అంతపని చేసినట్లే అవుతుంది.

కేసీఆర్ చేసే ప్రతిపనినీ విమర్శించాలనీ, ఆయన ప్రతిమాటనూ ఖండించాలని వివేకము, విచక్షణ ఉన్నవారు ఎవరూ అనరు. అయితే వార్తను వార్తగా నివేదించటం, రాగద్వేషాలకతీతంగా, నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయటం అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికావ్యవస్థ ప్రాధమిక కర్తవ్యం. 

మొన్న వరంగల్‌లో కాళోజీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపముఖ్యమంత్రి రాజయ్యనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ స్థాపిస్తామని రాజయ్య అంతకుముందు చెప్పడాన్ని ఎద్దేవా చేస్తూ, "రాజయ్య హెల్త్ యూనివర్సిటీ పెట్టగలుగుతాడా? ఎందుకు డంబాచారాలు, అడ్డమైన వొర్లుడు" అని కేసీఆర్ అన్నారు. ఆయన యథాతథంగా ఏమన్నదీ క్రింది వీడియోలో చూడొచ్చు.

ప్రభుత్వంలో తన తర్వాత తన అంతటివాడైన ఉపముఖ్యమంత్రి రాజయ్య చేసిన ప్రకటనను అక్కడికక్కడే సభాముఖంగా ఖండించటం, ఎద్దేవాగా మాట్లాడటం విమర్శలకు దారితీసింది. దానికితోడు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని తొలగించనున్నారని ప్రభుత్వంనుంచి ముఖ్యవర్గాలు పత్రికలకు ఇటీవల సమాచారాన్ని లీక్ చేసిఉండటంతో అది రాజయ్యేనని దళితవర్గాలు భావించాయి. జాట్సన్ అనే ఒక దళితుడు కేసీఆర్ రాజయ్యనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నిన్న ఎస్‌సీ-ఎస్‌టీ కమిషన్‌కు ఫిర్యాదుకూడా చేశాడు. మాదిగ దండోరా సంస్థ అధ్యక్షుడు మందకృష్ణ కేసీఆర్ వ్యాఖ్యలపై కరీంనగర్‌లో నిన్న తీవ్రంగా ప్రతిస్పందించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల తెగ్గోసుకుంటానని గతంలో అన్న కేసీఆర్, ఇప్పుడు దళితులను మరోసారి అవమానించాడని, రాజయ్యను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది మొత్తం ముగ్గురు మంత్రులేనని(కేసీఆర్, కేటీఆర్, హరీష్) విమర్శలు రావటం, రెవెన్యూమంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ తిట్టినట్లు వార్తలు రావటం మొదలైన అంశాల నేపథ్యంలో రాజయ్య వ్యవహారాన్ని పెద్ద ఇష్యూగానే చెప్పుకోవచ్చు. మరి ఇంత ముఖ్యమైన వార్తను ప్రధానంగానే ఇవ్వవలసి ఉంది. మరి ఈ వార్తకు ఈనాడులో లభించిన ప్రాధాన్యం చూస్తే....అసలు ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఎస్‌సీ-ఎస్‌టీ కమిషన్‌లో కేసీఆర్‌పై ఫిర్యాదు వార్త అసలు రానేలేదు. మందకృష్ణ స్పందనను ఆరవ పేజీలో ఒక మూల ఆరువాక్యాలతో సింగిల్ కాలమ్‌గా ఇచ్చారు. పోనీ తెలంగాణ ఉద్యమంఅంటే, తెరాస పార్టీ అంటే అంత సానుభూతి, అభిమానంఉందా అంటే అదీలేదు. తెలంగాణ ప్రభుత్వ అనుకూల వార్తను తెలంగాణ ఎడిషన్‌లలోనేమో ప్రభుత్వానికి అనుకూలంగా, ఆంధ్రప్రాంతంలో మరొకరకంగా మార్చి ఇవ్వటం తెలిసిందే.

తెలుగులో ప్రధాన దినపత్రికలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకో, వ్యాపారవేత్తకో అనుబంధసంస్థలైపోవటంవలన వచ్చిన అనర్ధం ఇదంతా. జరుగుతున్న పరిణామాలను ఆయా పత్రికలు తమతమ ప్రయోజనాలకనుగుణంగా మార్చి రాస్తున్నాయి. ఈనాడులో ఇలా తమకనుకూలంగా వార్తలను మార్చటం, ప్రతికూలమైన వార్తలను ఇవ్వకపోవటం పరిపాటిగా మారింది(ఇదే అంశంపై ఈ బ్లాగ్‌లో ఇంతకుముందు వచ్చిన వ్యాసాన్ని ఈ లింక్‌లో చూడొచ్చు.

టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై అనధికార నిషేధం విషయంలో మిగిలిన తెలుగు మీడియా సంస్థలు ఉదాశీనంగా ఉండటంపై కాంగ్రెస్, బీజేపీవంటి రాజకీయపార్టీలు ఒకవైపు బహిరంగంగా విమర్శిస్తూఉండగా, మరోవైపు కేసీఆర్ దురహంకార, నియంతృత్వ(నేను హిట్లర్‌నేనని ఆయనే స్వయంగా వాక్రుచ్చారు) వైఖరిని జాతీయమీడియా(తెలంగాణకే చెందిన ప్రముఖ జాతీయస్థాయి పాత్రికేయుడు వెంకటనారాయణతోసహా) దుమ్మెత్తిపోస్తూ ఉండగా వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తమరిపాటికి తమరు ఇలా అధికార పార్టీకి బాకా ఊదుతూఉండటం సబబేనా రామోజీరావుగారూ!

                              ***

తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని ఎగతాళిచేసేవారిని, మీడియాసంస్థలను మెడలు విరగ్గొట్టి, భూమిలో పదికి.మీ. అడుగున పాతరేస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఛానెళ్ళ చర్చలను ఈ క్రింది వీడియోలలో చూడొచ్చు... 


కొసమెరుపు: టైమ్స్ నౌ చర్చలో అర్ణబ్ గోస్వామి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ నోరుమూయించినవైనం చూసితీరవలసిందేగానీ మాటలలో చెప్పలేము.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts