Thursday, October 17, 2013

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే, మీ ఇంటి శాటిలైట్ మ్యాపును, 360డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది. వోనోబో.కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్, ఫోటోలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే, మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది. అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి. మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది. అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్, సగభాగంలో ఫోటో కనిపిస్తాయి. ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు, 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి. మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే, ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా, కొద్దిగా అయోమయంగానే ఉంటుంది. ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన్ తేలికవుతుంది.

స్ట్రీట్ వ్యూ అనే ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీదిగ్గజం గూగుల్ కొంతకాలంగా పలుదేశాలలో అందిస్తోంది. భారత్ లోకూడా ఈ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నా, వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు లభించకసతమతమవుతోంది. ఈ సమయంలో ఇద్దరు భారతీయసోదరులు చురుకుగా స్పందించి గూగుల్ తలపెట్టిన ఆ కార్యాన్ని పూర్తిచేసేశారు. సోల్ మాలిక్, సాజిద్ మాలిక్ అనే ఆ సోదరులకు చెందిన జెనెసిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థమొదటి విడతలో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, గోవా, కొలకతా, ఆగ్రా, పూణెవంటి 12నగరాలకు స్ట్రీట్ వ్యూ సేవలను అందించటం ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను 54 భారతీయనగరాలకు వీరు విస్తరించనున్నారు. వీరు కొంతకాలంగా మ్యాప్ లు రూపొందించే వ్యాపారంలో ఉండటంవలన గూగుల్ సాధించలేని అనుమతులను సాధించటానికి వీరికి వీలయింది.

ప్రజల జీవనవిధానాన్ని రోజురోజుకూ మరింత సౌకర్యవంతంచేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్ట్రీట్ వ్యూ ద్వారా మరో కొత్త సౌకర్యాన్ని ఆవిష్కరించినట్లయింది. చిన్నచిన్న గల్లీలతో సహా దాదాపుగా నగరం అంతటినీ ఫోటోలు తీసి పెట్టటంవలన ఈ స్ట్రీట్ వ్యూ నగర జీవనవిధానంలో పెనుమార్పులే తీసుకురానుంది. నగరంలోని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఈ స్ట్రీట్ వ్యూద్వారా గతంలోకంటే సులభంగా, వేగంగా వెళ్ళవచ్చు. వ్యాపార, వాణిజ్యాలలోస్ట్రీట్ వ్యూఎంతో ఉపయోగకరంగా మారనుందని, అయితే ప్రస్తుతానికి తమ సేవలు వాడుకోవటానికి సంస్థలనుంచి ఛార్జీలు వసూలుచేయటంలేదని జెనెసిస్ సంస్థ ఎండీ సాజిద్ మాలిక్ చెప్పారు.Wednesday, October 16, 2013

జూ.ఎన్‌టీఆర్‌ ఫెయిల్యూర్ ఫార్ములా'రామయ్యా వస్తావయ్యా' ఓవర్సీస్ లో అతిపెద్ద ఫ్లాప్ గా రికార్డ్ సృష్టించిందని తెలుగు సినిమా వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. అదెంత నిజమోగానీ తెలుగు ఇండస్ట్రీలో మంచి ట్యాలెంట్, మాస్ అప్పీల్ ఉన్న జూ.ఎన్‌టీఆర్‌కు ఆది, సింహాద్రి స్థాయి ఘనవిజయం అందకుండా ఊరిస్తోందన్నది నిజం. యమదొంగ, బృందావనం, అదుర్స్ వంటివి విజయం సాధించినా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. రామయ్యా వస్తావయ్యాకు ముందు వచ్చిన బాద్షా రు.40 కోట్లు వసూలుచేసిందని చెబుతున్నప్పటికీ, పెట్టుబడి పెట్టినవారెవరికీ లాభాలు రాలేదన్న సంగతి విదితమే. ఇక జూనియర్ ఫ్లాప్ లను ఒకసారి చూస్తే, ఇంత భారీ ఫ్లాపులు ప్రస్తుతమున్న హీరోలలో మరెవరికీ లేవనే చెప్పాలి. నరసింహుడు ఫ్లాపవడంతో ఆ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో దూకితే, పెద్ద ఎన్టీయార్, చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్లిచ్చిన సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వనీదత్, శక్తి సినిమా ఫ్లాప్ అవటంతో ఉంటున్న ఇల్లుకూడా అమ్ముకున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటుంటారు.

ఈ స్థితికి కారణమెవరని ప్రశ్నిస్తే, జూనియర్ స్వయంకృతాపరాధమని చెప్పక తప్పదు. ముఖ్యంగా దర్శకుల ఎంపికలో, కథల ఎంపికలో జూనియర్ అనుసరిస్తున్న విధానమేఈ పరిస్థితికి కారణం. ఏదైనా సినిమా బంపర్ హిట్ అవగానే, ఆ సినిమాలాంటి కథో, కాన్సెప్టో, పాటలో కావాలని జూనియర్ పట్టుబడతాడని ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ బాహాటంగానే చెబుతుంటారు. పోకిరి హిట్ అవ్వగానే, ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మెహర్ రమేష్ తో అదే ఛాయలున్న కథతో, మహేష్ తరహా డైలాగ్ డెలివరీతో కంత్రీ సినిమాను చేశాడు.అది సోసోగా నడిచింది. మగధీర హిట్ అవ్వగానే అలాంటి హిట్టే కావాలని రాజమౌళిని అడిగినా, అతను ఒప్పుకోకపోవటంతో మళ్ళీ మెహర్ రమేష్ తోనే అదే తరహా కథతో 'శక్తి' చేశాడు. దూకుడు హిట్ అవ్వగానే ఆ దర్శకుడు శ్రీను వైట్లతోనే 'బాద్షా' చేశాడుఈ మధ్యలో సురేంద్రరెడ్డి తన సోదరుడు కళ్యాణ్ రామ్ కు అతనొక్కడే వంటి హిట్ ఇవ్వగానే అశోక్ ను, రవితేజకు కిక్ వంటి హిట్ ఇవ్వగానే ఊసరవెల్లిని చేశాడు. బాబాయ్ బాలయ్యతో సింహా వంటి సూపర్ హిట్ చేసిన బోయపాటితో తీసినదమ్ము కూడా పెద్దగా దుమ్ములేపలేకపోయింది. తాజా చిత్రం రామయ్యా వస్తావయ్యాలో జూనియర్ పాత్ర 'సీతమ్మ వాకిట్లో...'లో మహేష్ క్యారెక్టర్ లాగా నలుగురు కుర్రాళ్ళను వెంటేసుకుని తిరుగుతూ ఉండటం గమనార్హం.

జూనియర్ కు ప్రధానమైన లోపం మంచి సలహాబృందం లేకపోవటం. ఆహా, ఓహో అనే భజన బృందంవలన ఈగో తృప్తి పడుతుందేమోగానీ, సక్సెస్ ఫార్ములా అంతుపట్టదని జూనియర్ ఇకనైనా తెలుసుకోవాలి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి టైపులో ప్రతి సినిమాలో తాత గురించి, వంశం గురించి, రికార్డులగురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటాన్ని జూనియర్ ఆపాలి. ట్రెండ్ ను అనుసరించటం కాకుండా ట్రెండ్ సృష్టించేవిధంగా ఆలోచిస్తేనే ఎన్టీయార్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలోనే స్టూడెంట్ నం.1,ఆది, సింహాద్రి వంటి ఘనవిజయాలను ఇచ్చి, నాటి నంబర్ ఒన్ చిరంజీవికి పోటీ అవుతాడా అనిపించిన జూనియర్ ఇప్పుడు మూడవస్థానంలో ఉన్నాడన్నది ఎవరూ కాదనలేరు(నంబర్ వన్ స్థానంకోసం పోటీ పవన్ కళ్యాణ్, మహేష్ లమధ్యే ఉంది). పూర్వ ప్రాభవాన్ని తిరిగి పొందాలంటే జూనియర్ తన ఫార్ములాను మార్చితీరాలి.


కొసమెరుపు: ఇప్పుడు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ అయిందికాబట్టి, అర్జంటుగా అత్త, అల్లుడు స్టోరీతో ఒక సినిమా చేసి తీరాల్సిందేనని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటపడతాడేమో మన యంగ్ టైగర్!


Image courtesy:wikipedia Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts