Thursday, April 3, 2014

కేసీఆర్ హామీల వర్షంలో తడిసి ముద్దవుతున్న తెలంగాణఅసలే ఎన్నికల వేళ. ఏ రాజకీయపార్టీ అయినా కొత్త కొత్త హామీలను, సంక్షేమ పథకాలను ప్రకటించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించటం మామూలే. మరి రాజకీయంలో ఎత్తులు, జిత్తులు అన్నిటినీ పుక్కిట పట్టిన కేసీఆర్‌వంటి నాయకుడి సంగతి చెప్పేదేముంది. ఈసారి ఎన్నికల కదనరంగంలో వాగ్దానాల ప్రకటనలో అన్నిపార్టీల నాయకులలోకీ కేసీఆరే ముందంజలో ఉన్నారని చెప్పాలి. బంగారు తెలంగాణను తయారుచేసి తెలంగాణ ప్రజలకు అందించటమే టీఆర్ఎస్ లక్ష్యమని చెబుతూ ప్రతి ఎన్నికలసభలోనూఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కగదితో ఇల్లు కట్టించి ఇచ్చి దానినే కైలాసం, వైకుంఠంగా భావించమంటోందని, తమ ప్రభుత్వంవస్తే పేదలకు వంటగది, స్నానాలగదితోసహా రు.3 లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేశారు. రు.1 లక్ష లోపు ఇళ్ళ, పంట రుణాలున్నవారెవరూ వాటిని కట్టొద్దని, వాటన్నంటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణరాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులనందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు(ఈ హామీపై తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్‌మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు). ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని చెబుతున్నారు. ఆంధ్రా ఉద్యోగులు వెళ్ళిపోతే లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ అవుతాయని, వాటిని తెలంగాణ నిరుద్యోగులతో భర్తీ చేయొచ్చని అంటున్నారు. తెలంగాణలో ఉద్యోగులను ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాంతంనుంచి కనీసం మూడేళ్ళవరకు బదిలీ చేయబోమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజనులకు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, వితంతువులకు, వృద్ధులకు రు.1,000, వికలాంగులకు రు. 1,500 పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి మండలకేంద్రంలోనూ 30 పడకల ఆసుపత్రిని కట్టిస్తామని, ఒక్కొక్కరికి రు. లక్ష జీతంఇచ్చి నలుగురు వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని, జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కడతామని హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేసీఆర్ అన్నారు.

ఉచిత విద్యహామీ విషయంలో కేసీఆర్ ఒక అడుగు ముందుకెళ్ళారని చెప్పక తప్పదు. చిన్నపిల్లల చదువు బాధ్యత స్థానిక పోలీసులకు అప్పగిస్తామని, ఎవరైనా పిల్లలు బడికి వెళ్ళకుండా ఉంటే స్థానిక పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందిస్తామని, పిల్లలకు తిండి, చదువు, బట్టలు, పుస్తకాలు అన్నీ ప్రభుత్వమే భరించేలా చూస్తామని అన్నారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అందరికీ ఒకే పాఠశాల, ఒకే విద్య, ఒకే భోజనం, ఒకే యూనిఫామ్ ఉంటుందని అన్నారు.

విద్యుత్ విషయంలోనూ కేసీఆర్ భారీ హామీలే గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ అంతా విద్యుత్ వెలుగులతో దేదీప్యమానమవుతుందని అన్నారు. కొత్త ప్రభుత్వంలో అవినీతికి తావుండదని, అవినీతి అంతం తన పంతం అని కేసీఆర్ చెప్పారు.

కొసమెరుపు: తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లిమ్‌ను ఉపముఖ్యమంత్రిని చేస్తానని గతంలో చెప్పి ఇప్పుడు మాట మార్చటాన్నే కేసీఆర్‌పై ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రత్యర్ధులు వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో...ఆయన గుప్పిస్తున్న పై హామీలను తెలంగాణ ప్రజలు నమ్ముతారో, లేదో తెలియాలంటే ఫలితాలవరకు వేచి చూడాల్సిందే!


image courtesy: wikipedia

8 comments:

 1. "తెలంగాణరాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని ప్రకటించారు(ఈ హామీపై తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్‌మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు)"

  ఎందుకో నాకు అర్ధం కాలేదు. కాస్త వివరిస్తారా?

  "తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లిమ్‌ను ఉపముఖ్యమంత్రిని చేస్తానని గతంలో చెప్పి ఇప్పుడు మాట మార్చటాన్నే కేసీఆర్‌పై ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రత్యర్ధులు వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో"

  ఆయన ఆ హామీలను వెనక్కు తీసుకున్న దాఖలాలు లేవు కదండీ.

  ReplyDelete
  Replies
  1. ఓరీ ఏడుపుగొట్టు తెలబాన్, నీకు పని, పాటా ఏం లేదా? కష్టపడి పని చెయ్యడం నేర్చుకో, ఏడుపు, అసూయా అంతా మటుమాయం, పరాన్నభుక్కూ.

   Delete
  2. @ Jai Gottimukkala - http://www.sakshi.com/news/andhra-pradesh/telangana-unemployees-angry-over-kcr-117697

   Delete
  3. @ Jai - see this link also. http://www.andhrajyothy.com/node/73829

   Delete
  4. థాంక్సండీ (తేజస్వి గారికి మాత్రమె సుమా).

   ఒక్క విషయం గమనించాలి. ఖాళీ అవుతుయాని చెబుతున్న ఉద్యోగాలు కొత్త నియామకాలతో భర్తీ చేస్తారు. ఈ ఖాళీలకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అడ్డు కాదు.

   Delete
 2. ఓరీ ఏడుపుగొట్టు తెలబాన్, నీకు పని, పాటా ఏం లేదా? కష్టపడి పని చెయ్యడం నేర్చుకో, ఏడుపు, అసూయా అంతా మటుమాయం, పరాన్నభుక్కూ.

  ReplyDelete
 3. ఆయనకి తెలుగు సరిగ్గా రాదు:-P)

  ReplyDelete
 4. ఇంగ్లీషు పేపర్ల లింకులు ఉంటే ఇవ్వండి,అప్పుడే అర్ధ మవుతుంది:-P)

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts