Thursday, October 17, 2013

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే, మీ ఇంటి శాటిలైట్ మ్యాపును, 360డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది. వోనోబో.కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్, ఫోటోలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే, మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది. అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి. మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది. అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్, సగభాగంలో ఫోటో కనిపిస్తాయి. ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు, 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి. మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే, ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా, కొద్దిగా అయోమయంగానే ఉంటుంది. ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన్ తేలికవుతుంది.

స్ట్రీట్ వ్యూ అనే ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీదిగ్గజం గూగుల్ కొంతకాలంగా పలుదేశాలలో అందిస్తోంది. భారత్ లోకూడా ఈ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నా, వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు లభించకసతమతమవుతోంది. ఈ సమయంలో ఇద్దరు భారతీయసోదరులు చురుకుగా స్పందించి గూగుల్ తలపెట్టిన ఆ కార్యాన్ని పూర్తిచేసేశారు. సోల్ మాలిక్, సాజిద్ మాలిక్ అనే ఆ సోదరులకు చెందిన జెనెసిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థమొదటి విడతలో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, గోవా, కొలకతా, ఆగ్రా, పూణెవంటి 12నగరాలకు స్ట్రీట్ వ్యూ సేవలను అందించటం ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను 54 భారతీయనగరాలకు వీరు విస్తరించనున్నారు. వీరు కొంతకాలంగా మ్యాప్ లు రూపొందించే వ్యాపారంలో ఉండటంవలన గూగుల్ సాధించలేని అనుమతులను సాధించటానికి వీరికి వీలయింది.

ప్రజల జీవనవిధానాన్ని రోజురోజుకూ మరింత సౌకర్యవంతంచేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్ట్రీట్ వ్యూ ద్వారా మరో కొత్త సౌకర్యాన్ని ఆవిష్కరించినట్లయింది. చిన్నచిన్న గల్లీలతో సహా దాదాపుగా నగరం అంతటినీ ఫోటోలు తీసి పెట్టటంవలన ఈ స్ట్రీట్ వ్యూ నగర జీవనవిధానంలో పెనుమార్పులే తీసుకురానుంది. నగరంలోని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఈ స్ట్రీట్ వ్యూద్వారా గతంలోకంటే సులభంగా, వేగంగా వెళ్ళవచ్చు. వ్యాపార, వాణిజ్యాలలోస్ట్రీట్ వ్యూఎంతో ఉపయోగకరంగా మారనుందని, అయితే ప్రస్తుతానికి తమ సేవలు వాడుకోవటానికి సంస్థలనుంచి ఛార్జీలు వసూలుచేయటంలేదని జెనెసిస్ సంస్థ ఎండీ సాజిద్ మాలిక్ చెప్పారు.Wednesday, October 16, 2013

జూ.ఎన్‌టీఆర్‌ ఫెయిల్యూర్ ఫార్ములా'రామయ్యా వస్తావయ్యా' ఓవర్సీస్ లో అతిపెద్ద ఫ్లాప్ గా రికార్డ్ సృష్టించిందని తెలుగు సినిమా వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. అదెంత నిజమోగానీ తెలుగు ఇండస్ట్రీలో మంచి ట్యాలెంట్, మాస్ అప్పీల్ ఉన్న జూ.ఎన్‌టీఆర్‌కు ఆది, సింహాద్రి స్థాయి ఘనవిజయం అందకుండా ఊరిస్తోందన్నది నిజం. యమదొంగ, బృందావనం, అదుర్స్ వంటివి విజయం సాధించినా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. రామయ్యా వస్తావయ్యాకు ముందు వచ్చిన బాద్షా రు.40 కోట్లు వసూలుచేసిందని చెబుతున్నప్పటికీ, పెట్టుబడి పెట్టినవారెవరికీ లాభాలు రాలేదన్న సంగతి విదితమే. ఇక జూనియర్ ఫ్లాప్ లను ఒకసారి చూస్తే, ఇంత భారీ ఫ్లాపులు ప్రస్తుతమున్న హీరోలలో మరెవరికీ లేవనే చెప్పాలి. నరసింహుడు ఫ్లాపవడంతో ఆ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో దూకితే, పెద్ద ఎన్టీయార్, చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్లిచ్చిన సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వనీదత్, శక్తి సినిమా ఫ్లాప్ అవటంతో ఉంటున్న ఇల్లుకూడా అమ్ముకున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటుంటారు.

ఈ స్థితికి కారణమెవరని ప్రశ్నిస్తే, జూనియర్ స్వయంకృతాపరాధమని చెప్పక తప్పదు. ముఖ్యంగా దర్శకుల ఎంపికలో, కథల ఎంపికలో జూనియర్ అనుసరిస్తున్న విధానమేఈ పరిస్థితికి కారణం. ఏదైనా సినిమా బంపర్ హిట్ అవగానే, ఆ సినిమాలాంటి కథో, కాన్సెప్టో, పాటలో కావాలని జూనియర్ పట్టుబడతాడని ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ బాహాటంగానే చెబుతుంటారు. పోకిరి హిట్ అవ్వగానే, ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మెహర్ రమేష్ తో అదే ఛాయలున్న కథతో, మహేష్ తరహా డైలాగ్ డెలివరీతో కంత్రీ సినిమాను చేశాడు.అది సోసోగా నడిచింది. మగధీర హిట్ అవ్వగానే అలాంటి హిట్టే కావాలని రాజమౌళిని అడిగినా, అతను ఒప్పుకోకపోవటంతో మళ్ళీ మెహర్ రమేష్ తోనే అదే తరహా కథతో 'శక్తి' చేశాడు. దూకుడు హిట్ అవ్వగానే ఆ దర్శకుడు శ్రీను వైట్లతోనే 'బాద్షా' చేశాడుఈ మధ్యలో సురేంద్రరెడ్డి తన సోదరుడు కళ్యాణ్ రామ్ కు అతనొక్కడే వంటి హిట్ ఇవ్వగానే అశోక్ ను, రవితేజకు కిక్ వంటి హిట్ ఇవ్వగానే ఊసరవెల్లిని చేశాడు. బాబాయ్ బాలయ్యతో సింహా వంటి సూపర్ హిట్ చేసిన బోయపాటితో తీసినదమ్ము కూడా పెద్దగా దుమ్ములేపలేకపోయింది. తాజా చిత్రం రామయ్యా వస్తావయ్యాలో జూనియర్ పాత్ర 'సీతమ్మ వాకిట్లో...'లో మహేష్ క్యారెక్టర్ లాగా నలుగురు కుర్రాళ్ళను వెంటేసుకుని తిరుగుతూ ఉండటం గమనార్హం.

జూనియర్ కు ప్రధానమైన లోపం మంచి సలహాబృందం లేకపోవటం. ఆహా, ఓహో అనే భజన బృందంవలన ఈగో తృప్తి పడుతుందేమోగానీ, సక్సెస్ ఫార్ములా అంతుపట్టదని జూనియర్ ఇకనైనా తెలుసుకోవాలి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి టైపులో ప్రతి సినిమాలో తాత గురించి, వంశం గురించి, రికార్డులగురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటాన్ని జూనియర్ ఆపాలి. ట్రెండ్ ను అనుసరించటం కాకుండా ట్రెండ్ సృష్టించేవిధంగా ఆలోచిస్తేనే ఎన్టీయార్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలోనే స్టూడెంట్ నం.1,ఆది, సింహాద్రి వంటి ఘనవిజయాలను ఇచ్చి, నాటి నంబర్ ఒన్ చిరంజీవికి పోటీ అవుతాడా అనిపించిన జూనియర్ ఇప్పుడు మూడవస్థానంలో ఉన్నాడన్నది ఎవరూ కాదనలేరు(నంబర్ వన్ స్థానంకోసం పోటీ పవన్ కళ్యాణ్, మహేష్ లమధ్యే ఉంది). పూర్వ ప్రాభవాన్ని తిరిగి పొందాలంటే జూనియర్ తన ఫార్ములాను మార్చితీరాలి.


కొసమెరుపు: ఇప్పుడు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ అయిందికాబట్టి, అర్జంటుగా అత్త, అల్లుడు స్టోరీతో ఒక సినిమా చేసి తీరాల్సిందేనని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటపడతాడేమో మన యంగ్ టైగర్!


Image courtesy:wikipedia Wednesday, September 18, 2013

మళయాళ నిర్మాతలను ప్రాధేయపడుతున్న అల్లు అర్జున్
కేరళలోని మళయాళ మనోరమగ్రూప్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ 'మళవిల్ మనోరమ' ఓనమ్ సందర్భంగా, ఈనెల 15న తమ ఛానల్ లో 'మల్లు' అర్జున్‌ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అరగంటకుపైగా సాగిన ఆ కార్యక్రమంలో అతనిని వ్యక్తిగత విషయాలగురించి తెలుగులోకూడా ఎవరూ అడగనంత వివరంగా, చిన్న చిన్న వాటినికూడా ప్రస్తావిస్తూ ఆ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసింది. అతనిని మళయాళ ప్రేక్షకులు ఎంత నిశితంగా గమనిస్తున్నారనేది, అతనికి అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆ యాంకర్ మాటలనుబట్టి అర్థమవుతోందిప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ ను మొదట హీరోయిన్ ఇష్టపడదని, చివరకు మాత్రం అతను ఆమె హృదయాన్ని, ప్రేక్షకుల సానుభూతిని గెలుచుకుంటాడంటూ ఆర్య, హ్యాపీ, జులాయి చిత్రాలను ఉదాహరణలుగా చూపిస్తూ విశ్లేషించింది. రెడ్ బుల్ త్రాగినట్లు అంతబాగా డాన్స్ లు చేయటానికి ఎనర్జీ ఎక్కడనుంచి వస్తుందని ప్రశ్నించింది. మళయాళ యువత అతనంటే ఊగిపోతున్నారని, ఏ మూలకు వెళ్ళినాఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బోర్డ్ కనబడుతోందని ఆ యాంకర్ చెప్పింది.


                         క్యాలికట్ లోని ఒకఫ్యాన్స్ అసోసియేషన్ వారి వెబ్ పేజి

మళయాళంలో నేరుగా ఒక సినిమా చేయాలని తనకుకూడా ఉందని అర్జున్ చెప్పారు. కానీ, ఏ మళయాళ నిర్మాతకూడా రావటంలేదని, దయచేసి ఎవరైనా రావాలంటూ నవ్వుతూ అర్ధించారు. తమిళంలో మాత్రం త్వరలో నేరుగా ఒక సినిమా చేయబోతున్నానని, దానిగురించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు(ఎంతైనా అల్లు అరవింద్ కొడుకుకదా, తమిళ మార్కెట్ కూడా కలిసొస్తుందని ప్లాన్ చేసినట్లున్నాడు). తనలో ఏమిచూసి మళయాళ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారో తెలియదని, కానీ ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పెళ్ళికి ముందు తాను గాలివాటంగా ఉండేవాడినని, పెళ్ళి తర్వాత తనలో నిలకడ వచ్చిందని అన్నారు. తన నటనలో, లుక్స్ లో, మేకప్ లో నిరంతరం మార్పు కోరుకుంటానని అల్లు అర్జున్ చెప్పారు.


కేరళలో అత్యంత ప్రజాదరణకలిగిన స్థానికేతర హీరోగా అల్లు అర్జున్ మాలీవుడ్(మళయాళ సినీ పరిశ్రమ)లో పేరు సంపాదించిన విషయం తెలిసిందే. అతను నటించిన తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' కేరళలో 'రోమియో అండ్ జూలియట్స్' పేరుతో 86 ధియేటర్లలో విడుదలయింది. అంతకుముందుకూడా 'ఆర్య' దగ్గరనుంచి మొదలుపెట్టి 'జులాయి' వరకు ప్రతి చిత్రమూ కేరళలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 


'మళవిల్ మనోరమ'లో అల్లు అర్జున్ ఇంటర్వ్యూను చూడాలనుకుంటే ఈ లింక్ కు వెళ్ళండి - http://www.youtube.com/watch?v=UtUQBr7ELlY

Tuesday, September 17, 2013

వ్యక్తిగత ఆరోపణలపై ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు వివరణజులై 30న జరిగిన రాష్ట్రవిభజన ప్రకటన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి రావటమేకాక, రాష్ట్రంలోని ప్రముఖులలో ఒకరై పోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు. ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడి పదవిలోకి వచ్చినపుడే ఆయన ఓ మాదిరి ప్రముఖుడైపోయినప్పటికీ, ఇంతస్థాయిలో రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ తెలిసేటంత గుర్తింపు అయితే జులై 30కు ముందు లేదు. ఇంతకుముందు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గోపాల్ రెడ్డి ఈ ఏడాది మే 31న రాజీనామా చేయటంతో జనరల్ సెక్రెటరీగాఉన్న అశోక్ బాబు, రివాజు ప్రకారం అధ్యక్షస్థానానికి చేరుకున్నారు.

ఏపీఎన్‌జీఓ అధ్యక్ష పదవికి చేరుకోవటంతోసహా అశోక్ బాబుపై అనేక వ్యక్తిగత ఆరోపణలు మీడియాలో వచ్చిన మాట తెలిసిందే. ఆ పదవికి ఎన్నికలే జరగలేదని, అధ్యక్షుడినని తానే స్వయంగా ప్రకటించుకున్నారని ఎన్‌జీఓ సంఘానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే, డిగ్రీ చదవక పోయినా, చదివినట్లు పేర్కొని, తప్పుడు సర్టిఫికెట్ తో విజయవాడనుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.దీనిపై అశోక్ బాబు గత ఆదివారంనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో వివరణ ఇచ్చారు. కేవలం ఒక టైపింగ్ పొరపాటును పట్టుకుని కొందరు వ్యతిరేకులు, మీడియా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. డిగ్రీ చదివినట్లు ఒకచోట పొరపాటున తప్పుగా టైప్ అయిందని, దానిని కొండంతలుగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. 2009 సంవత్సరంనుంచి ఏపీ ఎన్‌జీఓ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు ఆ పదవివలన హైదరాబాద్ లో ఉండే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తుందని వివరణ ఇచ్చారు. గత సంవత్సరమే తాను తన పోస్టునుకూడా హైదరాబాద్ కు బదిలీ చేయించుకున్నానని చెప్పారు.

అయితే, ఏపీ ఎన్‌జీఓ సంఘ అధ్యక్ష పదవికి ఎన్నికవటంపై, హౌసింగ్ సొసైటీలో అక్రమంగా సభ్యత్వం పొందారన్న ఆరోపణలపై ఇంటర్వ్యూలో ఆర్కే అడగనూ లేదు, అశోక్ బాబు వివరణ ఇవ్వనూలేదు. ఈ ఏడాది మే 31న గోపాల్ రెడ్డి పదవీవిరమణతో ఖాళీ అవుతున్న అధ్యక్షపదవికి మే 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని, కానీ దీనిపై కొందరు ఉద్యోగులు జూన్ 20న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో సవాల్ చేశారని, ఆ ఎన్నికలనుతాత్కాలికంగా నిలిపేయాలని కోర్ట్ ఆదేశించిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్ బాబు స్వయంగా అధ్యక్షుడినని ప్రకటించుకున్నారని, అతనొక చీటింగ్ మాస్టర్, 420 అని దుయ్యబడుతున్నారు. ఏపీ ఎన్‌జీఓలు ఈ ఆరోపణలను తిప్పిగొడుతూ, తెలంగాణ ఎన్‌జీఓ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించి ఇటీవలే తెరాసలోచేరి ఎమ్మెల్సీ అయిన స్వామిగౌడ్ గోపన్నపల్లి ఎన్‌జీఓ హౌసింగ్ సొసైటీలో చేసిన అక్రమాలు గుర్తుకు తెచ్చుకోవాలని అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వజీతం తీసుకుంటూనే జేఏసీ నేతగా వ్యవహరించటం సాంకేతికంగా తప్పుకాకపోవచ్చుగానీ, నైతికవిలువలుంటే, ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని వందలమంది తెలంగాణ వాసులను గతంలో మోసం చేసిన కేసీఆరేఅసలు420 అంటున్నారు.

ఏదిఏమైనా,ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలవలన పై నాయకులలో ఎవరికీ వీసమెత్తు నష్టం ఉండదన్నది అందరూ తెలిసిన విషయమే. ఎవరెన్ని అనుకున్నా, తెలంగాణ ఉద్యమం ఈ స్థాయికి రావటానికి కోదండరామ్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సేవ్ ఆంధ్రప్రదేశ్ సభతో ఒక మలుపు తిప్పిన అశోక్ బాబు పరిణతిగల నాయకుడనటంలో ఎవరికీ సందేహంలేదు. ముఖ్యంగా నిన్నటి ఓపెన్ హార్ట్ లో ఆద్యంతం ఎవరినీ విమర్శించకుండా, ఆద్యంతం ఒక సానుకూల ధోరణితో, నిండుకుండలా ఆయన మాట్లాడిన తీరును తెలంగాణకు చెందిన ఉదారవాదులుకూడా మెచ్చుకుంటున్నారు. మరోవైపు వేమూరి రాధాకృష్ణకూడా తనదైన శైలిలో కొంటెమాటలు, చిలిపి ప్రశ్నలు వేయకుండా ఇంటర్వ్యూ చేయటం విశేషం. అంతకుముందువారం, అందరం దాదాపుగా మరచిపోయిన లబ్దప్రతిష్ఠుడు, తెలంగాణ కవిదిగ్గజం దాశరథి రంగాచార్యతోనూ, ఈ వారం అశోక్ బాబుతోనూ వరసగా చేసిన రెండు మంచి ఇంటర్వూలద్వారా, ఈ కార్యక్రమంపై తనకున్న మచ్చలను రాధాకృష్ణ చెరిపేసుకున్నట్లయింది.

కొసమెరుపు:ఇంటిపేరునుబట్టి కులాన్ని అంచనా వేసేవారు చాలామంది, అశోక్ బాబు ఇంటిపేరును చూసి ఫలానా కులంవారు అని ముద్ర వేసుకుని, ఆ కులంతో తమతమకున్న అనుబంధాన్నో, అయిష్టతనో ఆయనపై పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారట. అయితే ఆయన ఆ కులం కాదని, అదే కులం పేరులోని మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే మరో అగ్రకులమని ఏపీ ఎన్జీఓ నాయకులు తెలిపారు.
Saturday, September 7, 2013

ఏపీ ఎన్జీఓల సభ విజయవంతంసభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు, జరపాలన్న కృతనిశ్చయంలో ఎన్జీఓలు ఇరువైపులా మోహరించి ఉంటడంతో ఎప్పుడేమి జరుగుతుందో అని శనివారం ఉదయంనుంచి హైదరాబాద్ వాసులు ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి చూశారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా సభ సాఫీగా సాగిపోయింది. సభ నిర్వాహకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దీనికి అభినందించాలి. మోరల్ సపోర్ట్, లాజిస్టిక్ సపోర్ట్, లా అండ్ ఆర్డర్ సపోర్ట్...ఒకటేమిటి అన్ని సపోర్టులూ అందించి సభను విజయవంతం చేయించారు కిరణ్.

ఏపీ ఎన్జీఓలు ఈ వేదికను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. సమైక్యవాదానికి తమ కారణాలను, తమ వాదనను స్పష్టంగా వినిపించారు. విభజన వలన నష్టాలను వివరించడంకూడా ఈ సభ లక్ష్యమైనప్పటికీ, వక్తలలో అశోక్ బాబు తప్పితే మిగిలిన ఉద్యోగసంఘాల నాయకులెవరూఆ విషయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. సభలో వక్తల ఉపన్యాసాలుసంయమనంతో సాగాయని చెప్పొచ్చు. ఎవరైనా శృతి మించినా, అశోక్ బాబు వెనకనుంచి వారిని వారించడంతో వక్తలు మళ్ళీ గాడిలోకి వచ్చారు. వక్తలలో అశోక్ బాబు తర్వాత మిత్రా, సత్యవాణి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ, సమయాన్ని పాటిస్తూ 5గంటల ప్రాంతంలో సభను ముగించేశారు. ఈ క్రమశిక్షణకూడా సభ విజయవంతమవడానికి ఒక కారణమని చెప్పొచ్చు. దీనికి తోడు ఎంతో పరిణతితో అశోక్ బాబు వ్యవహరించిన తీరు మరొక కారణమని చెప్పక తప్పదు. ఉపన్యాసాలలో వ్యక్తులగురించి ప్రస్తావించొద్దని ఆయన వక్తలకు పదేపదే గుర్తుచేశారు. రాజకీయాలలోకి రాబోనని చెప్పి అందరి ప్రశంశలూ అందుకున్నారు. ఎవరిపై ద్వేషం, విషం కక్కకుండా సభ మొత్తం ఒక పాజిటివ్ ఫీల్ తో సాగేటట్లు చేశారు. సీమాంధ్రప్రాంతంలోని 13జిల్లాలలో ఎటువంటి కేంద్రీయ నాయకత్వం లేకుండా, అసంఘటితంగానే  సమైక్యాంధ్రకోసం ఉద్యమం చేస్తున్నవారిలో ఇవాళ్టి హైదరాబాద్ సభ మరింత స్ఫూర్తిని రగులుస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు

image courtesy:ప్రజాశక్తి

Wednesday, September 4, 2013

దిశానిర్దేశం కొరవడిన సమైక్యాంధ్ర ఉద్యమంతెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి కాంగ్రెస్ అధిష్ఠానంప్రత్యేకరాష్ట్ర ప్రకటనచేసేటట్లు చేయడంలో తెలంగాణ జేఏసీ పాత్ర కీలకమనేది నిర్వివాదాంశం. టీడీపీనుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణకు మూలకారకుడైనప్పటికీ, ఇటీవలికాలంలో సకలజనులసమ్మె, అసెంబ్లీ ముట్టడివంటి ఏదో ఒక కార్యక్రమంచేస్తూ, విజయవంతమయ్యేవరకు ఉద్యమాన్ని చైతన్యవంతంగా ఉంచిన ఘనత తెలంగాణ జేఏసీదే. మంత్రి గీతారెడ్డిని కర్రుకాల్చి వాతపెట్టాలనటంవంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా,ఉద్యమం ఫలవంతమవడంలో ప్రొఫెసర్ కోదండరామ్ కృషిని ఎవరూ కాదనలేరు. మధ్యలో కేసీఆర్ తో విభేదాలు వచ్చినా తట్టుకుని నిలబడి, రాజకీయ పార్టీలు, ఉద్యోగసంఘాలను సమన్వయంచేసుకుంటూ తెలంగాణ జేఏసీఅస్తిత్వాన్ని కాపాడుకున్నారు. జేఏసీ వలన ఆ ఉద్యమం ఒక గాడిలో, సంఘటితంగా, సమీకృతంగా నడిచింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోఖచ్చితంగా అదే కొరవడింది.

విభజన నిర్ణయంతో సీమాంధ్రలో తీవ్ర భావోద్వేగాలకు గురై ప్రతిరోజూ లక్షలమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నప్పటికీ, వారి ఉద్యమం ఒక కార్యాచరణ ప్రణాళిక,దిశానిర్దేశంలేకుండా నడుస్తోంది. సంఘటితంగా ఒక్కతాటిపై నడిపే నాయకత్వం లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు తమదైన శైలిలో ఆందోళలను, ర్యాలీలను, ధర్నాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల, ఏమిచేయాలో, ఏమి చేయకూడదో కూడా తెలియక చిత్ర, విచిత్ర పోకడలను అనుసరిస్తున్నారు. విభజనతో తాము నష్టపోతామన్న బాధతో ఆందోళనలకు దిగినవారు, తమ కార్యక్రమాలలో ఆ ఆందోళనను ప్రతిఫలించడానికి బదులుగా కరాటేలు, వ్యాయామాలు, యోగాసనాలు,కబడ్డీ ఆటలు, ముగ్గులపోటీలు, రోడ్లపై స్నానాలు వంటి విన్యాసాలు చేస్తున్నారు. లక్షజనఘోషవంటి గంభీరమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, విచిత్ర విన్యాసాలనే మీడియాలో బాగా చూపించడంవలన ఉద్యమం పలచనైపోతోంది.

ఎవరూ ఊహించనివిధంగా, నాయకులులేకుండానే ప్రజలనుంచి స్వచ్ఛందంగా ఉవ్వెత్తున పుట్టుకొచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల ఆందోళనను, భావోద్వేగాలను ప్రతిబింబించేవిధంగా, విధాన నిర్ణేతలకు దాని తీవ్రతను తెలియజెప్పే విధంగా ఉద్యమాన్ని నడిపే కేంద్రీకృత నాయకత్వం కరువయింది.దీనివలన ఉద్యమం ఎన్నిరోజులు జరిగినా ఫలితం పెద్దగా ఉండదని, అంతిమంగా నష్టపోయేదితామేనన్నది ఆ ప్రాంతప్రజలు గుర్తించాలి. ఇప్పటికే పరిపాలన కుంటుపడింది. కోర్టుల్లో కేసులు నడవకపోవడంతో నిందితులు, కక్షిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటినీ మించి అభం, శుభం తెలియని విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజువారీ వ్యాపారులు, కూలీలపై బంద్ ల ప్రభావం బాగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.

సమైక్యాంధ్ర ఉద్యమ నాయకత్వలోటును పూరించడానికి రాజకీయనాయకులు ముందుకు రాకపోవడానికి వారి కారణాలు వారికున్నాయి. కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వస్తే ఉద్యమకారులు చొక్కాపట్టుకుంటారు కాబట్టి వారు ఎలాగూ రారు. ఇక సమన్యాయం అంటూ గోడమీద పిల్లిలాఉన్న తెలుగుదేశం, ఈ పరిస్థితినుంచి లబ్దిపొందటానికి బస్సుయాత్ర ప్రారంభించింది. అటు జగన్ పార్టీకూడా కాపీ క్యాట్ లాగా టీడీపీ బాటలోనే పయనిస్తోంది.ఈ పరిణామాలన్నింటినీ సీమాంధ్రప్రజలు గుర్తించి, నిర్మాణాత్మకంగా, సవ్యదిశలో ఉద్యమాన్ని నడపటానికి ఒక సమీకృత నాయకత్వాన్ని, జేఏసీని ఏర్పాటుచేసుకుని కార్యాచరణ ప్రణాళికప్రకారం నడుచుకుంటూ తమ ఆంక్షలను , ఆశయాలను సాధించుకోడానికి ప్రయత్నించాలి. ఎక్కడికక్కడ పార్టీల రహితంగా జేఏసీలను ఏర్పాటుచేసుకుని ఒక నాయకత్వకేంద్రాన్ని ఇప్పటికైనా రూపొందించుకుంటే ఫలితముంటుంది.

Image courtesy:manabhimavaram.info

Tuesday, September 3, 2013

మైక్రోసాఫ్ట్ హస్తగతమైన నోకియా:కుమిలిపోతున్న ఫిన్లాండ్ దేశస్థులు  


14 సంవత్సరాలపాటు ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్ లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన నోకియాసంస్థ అమ్ముడుపోయింది. తమ మొబైల్ ఫోన్ తయారీ విభాగాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం 5.44 బిలియన్ యూరోలకు(7.17 బిలియన్ డాలర్లకు)మైక్రోసాఫ్ట్ కు అమ్మేసుకుంది.అయితే 148 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫిన్లాండ్ కంపెనీ, నెట్ వర్క్ పరికరాలు, సర్వీసులు వంటి ఇతర వ్యాపారాలను యధావిధిగా కొనసాగిస్తుంది.

మొబైల్ ఫోన్ ల వ్యాపారంలో నోకియా ఆధిపత్యానికి గత కొద్ది సంవత్సరాలుగా శామ్ సంగ్, యాపిల్ (ఐఫోన్ తయారీసంస్థ) కారణంగా గండిపడింది.దీని నోకియా సంస్థ స్వయంకృతాపరాథమే కారణం.బూజుపట్టిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నే పట్టుకుని వేలాడుతూ పోటీగా దూసుకొస్తున్న ఆండ్రాయిడ్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ లను, స్మార్ట్ ఫోన్ మార్కెట్ నూ నోకియా పట్టించుకోలేదు. వీటన్నింటినీ మించి, నోకియా తలరాతను మారుస్తాడనే నమ్మకంతో మైక్రోసాఫ్ట్ నుంచి తెచ్చుకున్న ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్ ఎలాప్ తన మాతృసంస్థప్రతినిధిలాగానే పనిచేశాడు. ఆండ్రాయిడ్ అవసరం నోకియాకు లేదని, మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే భవిష్యత్ నోకియా స్మార్ట్ ఫోన్లు రూపొందించాలని 2011లో వివాదాస్పదనిర్ణయంతీసుకున్నాడు. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ తో నోకియానుంచి వచ్చిన ప్రతిష్ఠాత్మక లుమియా ఫోన్లు కూడా పెద్దగా విజయవంతంకాలేదు. 2007లో 40శాతం ఉన్న నోకియా మార్కెట్ షేర్ ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ విభాగంలోనయితే దారుణంగా 3 శాతానికి చేరింది.

మొబైల్ ఫోన్ విభాగాన్ని నోకియా అమ్మేయడంపై మాతృదేశం ఫిన్లాండ్ లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫిన్లాండ్ దేశస్థులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. నోకియా అమ్మకాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాన్ని వారు దేశ ప్రతిష్ఠకు మచ్చగా పరిగణిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి స్టీఫెన్ ఎలాప్ రూపంలో ఒక ట్రోజన్ హార్స్(మారువేషంలో వచ్చి దెబ్బతీసే శత్రువు)ను తీసుకొచ్చి నోకియా నెత్తిన పెట్టుకుందని, దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందని ఫిన్లాండ్ లోని ఒక ప్రముఖ టాబ్లాయిడ్ ఇవాళ వ్యాఖ్యానించింది.

మరోవైపు, నోకియా కొనుగోలుద్వారా, యాపిల్(ఐఫోన్), గూగుల్(మోటరోలా) తరహాలో మొబైల్ ఫోన్ ల మార్కెట్ లోకి మైక్రోసాఫ్ట్ కూడా ప్రమేశించినట్లయింది. త్వరలో రిటైర్ కాబోతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బామర్, రిటైర్ అయ్యేలోపు మైక్రోసాఫ్ట్ నుకూడా యాపిల్ తరహాలో సర్వీసులతోబాటు పరికరాలు తయారుచేసే సంస్థగా మార్చడమే తన లక్ష్యమని ఇటీవల ప్రకటించారు.ఆ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్లే ఉంది.

Images courtesy:GOOGLEFeatured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts