Thursday, April 24, 2014

పవన్‌కై చంద్రబాబు వెంపర్లాటను ఆ రెండు వర్గాలూ జీర్ణించుకోగలవా!మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు.

మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగా వెళ్ళటమేకాక, ఒక పెద్దనేతను కలుసుకున్నపుడు చెప్పినట్లుగా 'మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను' అనిచెప్పటం,  కోస్తాలోని ఆయన వర్గంవారు భరించలేకపోతున్నారు. మరోవైపు తనవద్దకు వచ్చిన చంద్రబాబువద్ద పవన్ కళ్యాణ్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ లెక్కలేనట్లుగా ఉండటం వారికి పుండుమీద కారం రాసినట్లుంది.

ఇక రెండోవర్గం కోణంచూస్తే, హరికృష్ణ, ఆయన కుమారుడు మినీ ఎన్‌టీఆర్‌కుకూడా ఇది జీర్ణించుకోలేని పరిణామమేనని చెప్పొచ్చు. హిందూపూర్ టికెట్ నిరాకరించబడటంతో హరికృష్ణ, ఆయన కుమారుడు లోలోపల రగిలిపోతున్న విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ ఎన్‌టీఆర్‌ను ప్రచారానికి బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరంలేదంటూ బాలయ్య, లోకేష్ ప్రకటనలు ఇచ్చిన సంగతికూడా విదితమే(పైపెచ్చు, జూనియర్ ఎన్‌టీఆర్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ లేరని, ఉన్నదంతా నందమూరి ఫ్యాన్సేననికూడా బాలయ్య కుండబద్దలు కొట్టారు). కాగా, ఇంట్లోనే ఉన్న స్టార్ - ఎన్టీఆర్‌ను పట్టించుకోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌వద్దకు వెళ్ళి బ్రతిమలాడటం హరికృష్ణ అండ్ సన్స్‌ అవమానాలను రెట్టింపు చేసినట్లయిందని చెప్పొచ్చు.

ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుగానీ, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణగానీ తమ మాటల్లో పదే పదే పవన్ కళ్యాణ్‌ను ప్రస్తావించటానికి, అతని మద్దతుకోసం ప్రయత్నించటానికి కారణం అతనిమీద ప్రేమకాదని, యూత్‌లోనూ, అతని సామాజికవర్గంలోనూ ఉన్న ఫాలోయింగేనన్నది తెలిసిన విషయమే. దానికితోడు జూనియర్ ఎన్‌టీఆర్ లేని లోటును పవన్‌ద్వారా అధిగమించాలని చంద్రబాబు ప్రయాస పడుతున్నారు. తన మిత్రుడు పొట్లూరి వరప్రసాద్‌కు విజయవాడ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబుపై గుర్రుగా ఉన్న పవన్, మొత్తానికి నిన్నటిభేటీ తర్వాత మెత్తబడ్డట్టే ఉన్నారు. రేపటినుంచి టీడీపీ, బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఇవాళ ప్రకటన విడుదలచేశారు. పవన్ మద్దతువలన ఫలితాలు గణనీయంగా మారతాయని చెప్పలేముగానీ, తెలుగుదేశానికి ఎంతోకొంత లబ్దికలుగుతుందనిమాత్రం చెప్పొచ్చు.

Saturday, April 19, 2014

ఉదయభాను ఓవరాక్షన్

టీవీ9 ఛానల్‌వారు ఉదయభాను ప్రయోక్తగా ప్రైమ్‌టైమ్‌(రాత్రి 9.30)లో నిగ్గదీసి అడుగు అనే కార్యక్రమాన్ని  ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికలవేళ ఎంపికచేసిన కొన్నిప్రాంతాలకు వెళ్ళి అక్కడ నెలకొనిఉన్న సమస్యలను ప్రజలద్వారా తెలుసుకుని, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయటం అనే కాన్సెప్ట్‌తో టీవీ9 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాస్తవానికి టీవీ9లోనే ఝాన్సీ చాలారోజులనుంచి ఇలాంటి కాన్సెప్ట్‌తోనే, స్థానిక సమస్యలపై చేతన అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అయితే, 'గంగ గరుడాలెత్తుకెళ్ళేరా...ఇంక ఆంబోతులాట సాగేరా' అంటూ సాగే అనే ఒక పాటను స్వయంగా రచించి, పాడి తనలోని సామాజికస్పృహ కోణాన్ని చాటిచెప్పిన ఉదయభాను అయితే ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సముచితంగా ఉంటుందని భావించారో, ఏమో టీవీ9వారు ఆమెను రంగంలోకి దించారు.

కార్యక్రమం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఉదయభాను తెచ్చిపెట్టుకుని ప్రదర్శిస్తున్న నాటకీయత, ఓవరాక్షన్‌ చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. సినిమాలలో రాజకీయనాయకులకు వ్యతిరేకంగా ఉపయోగించే అన్యాయం, నిర్లక్ష్యం, నిరాదరణ వంటి కొన్ని పడికట్టుపదాలు పట్టుకుని ఉదయభాను ఊదరగొడుతున్నారు. ఆమెకు క్షేత్రస్థాయిలో సమస్యలపట్ల మౌలికమైన అవగాహన లేకపోగా, విషయపరిజ్ఞానంకూడా అంతంతమాత్రమే అవటంతో కార్యక్రమం అక్కడక్కడా నవ్వు తెప్పిస్తోంది. మొన్నొకచోట ఒక వృద్ధుడు ఏదో సమస్యను ఆవేశంగా ప్రస్తావిస్తుండగా, అతనిని ఆపి నీ వయసు ఎంత అని అడిగారు ఉదయభాను. తన వయసు 75 ఏళ్ళు అని అతను చెప్పాడు. వెంటనే ఈమె, 'కొంతమంది ముసలివాళ్ళు పుట్టుకతో యువకులు' అని శ్రీశ్రీ అన్నారని(#*@&#*), దానికి ఈయనే ఉదాహరణ అంటూ ఏదోదో చెప్పుకెళ్ళారు. ఇక ప్రజా ప్రతినిధులను పట్టుకుని వేలుచూపిస్తూ సినీ ఫక్కీలో ప్రశ్నలు అడగటంకూడా ఓవర్‌గా అనిపిస్తోంది.

అయితే కార్యక్రమాన్ని రూపొందించినవారిని, వారి కాన్సెప్ట్‌ను ప్రశంసించి తీరాలి. కార్యక్రమం చేయబోయే ప్రాంతానికి సంబంధించి ముందే సమాచారం సేకరించటం, ముందుగా యాంకర్‌తో ఆ వివరాలను చెప్పించటం, సమస్యలను ప్రస్తావించటం బాగుంది. ఎంపికచేసిన ప్రాంతాలుకూడా సముచితంగా ఉన్నాయి. ఇప్పటివరకు అనంతపూర్, ఖమ్మం, అదిలాబాద్, కర్నూలు, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయభాను ఓవరాక్షన్ తగ్గించుకుంటే కార్యక్రమం ప్రయోజనం మరింతబాగా నెరవేరుతుంది. 

Friday, April 18, 2014

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది. అన్ని దినపత్రికలూ సహజంగానే ఆ వార్తను ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ  తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి.

తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్రాలకు సంబంధించికూడా శుక్రవారం ఉదయానికి దీనికిమించి పెద్దవార్తలేదు). ఆ వార్త ప్రాధాన్యానికి తగ్గట్టుగానే ఇవాళ్టి అన్ని దినపత్రికలలో బ్యానర్ వార్తగా వచ్చింది(టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రజ్యోతి పేపర్లలో ఇవాళ్టి బ్యానర్ వార్తలను పైన ఇమేజిలలో చూడొచ్చు). 'ఈనాడు'లో మాత్రం ఈ వార్త అసలు కనబడనేలేదు. వెబ్ ఎడిషన్ లోని 'ఈ- పేపర్'లో మాత్రం ఎనిమిదోపేజీలో ఎడమవైపు క్రింద మూలన ఒక చిన్నవార్తగా ఇచ్చారు(ఆఖరి ఇమేజ్ లో ఆ వార్తను చూడండి).

అక్కడ ఇచ్చిన వార్తలోకూడా వారు ఆ వార్తకు పెట్టిన శీర్షిక చూస్తే...'భాజపా, తెదేపా పొత్తుపై మథనం'. ఒక పక్కన తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పటం, పొత్తుపై ప్రతిష్టంభన ఏర్పడటం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే 'పొత్తుపై మథనం' అని శీర్షిక పెట్టటమంటే వార్త ప్రాధాన్యతను తక్కువ చేయాలని సంపాదకవర్గం నిశ్చయించుకున్నట్లనిపిస్తోంది.


ఏది ఏమైనా, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ స్థాయి దినపత్రికలో ఇంత పెద్దతప్పుదొర్లటం దారుణం. తమ ప్రాధామ్యాలకోసమే వార్తను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడితేమాత్రం అది క్షమించరాని తప్పిదం. సంపాదకవర్యులూ! ఈ తప్పిదంపై పాఠకులకు వివరణ ఇవ్వాల్సిన కనీసబాధ్యత తమపై ఉందేమో ఒకసారి ఆలోచించండి.

Friday, April 11, 2014

చిరంజీవి, మోహన్‌బాబులపై బాలయ్య సెటైర్లు


హైదరాబాద్‌లో గురువారంరాత్రి జరిగిన లెజెండ్ విజయోత్సవ సభలో హీరో బాలయ్య చిరంజీవి, మోహన్‌బాబులపై చెణుకులు విసిరారు. లెజెండ్ టైటిల్‌గురించి వివరించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టైటిల్ మాస్‌కు అర్థమవుతుందో, లేదోనని మొదట సందేహించామని తెలిపారు. అయితే ఆమధ్య కొందరు లెజెండ్ ఎవరంటూ కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారంటూ లెజెండ్ పురస్కారంపై గతంలో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య జరిగిన గొడవను పరోక్షంగా ప్రస్తావించారు. తాము ఈ టైటిల్ పెట్టటంద్వారా అసలు లెజెండ్ ఎవరో, ఏమిటో ప్రేక్షకులకు చూపించామన్నారు.

సినీపరిశ్రమలోగానీ, రాజకీయాలలోగానీ తన తండ్రి ఎన్‌టీరామారావు ఒక్కరే లెజెండ్ అని బాలయ్య చెప్పారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, అందరిదీనన్నారు. ఎన్‌టీఆర్‌ను మరిచిపోయి లెజెండ్ ఎవరు...ఎవరు అని వెతికేవారు పిచ్చివాళ్ళని, అలా వెతికేవారికి పిచ్చెక్కిందేమోనని ప్రజలు అనుకుంటారని(#*@!?*#!) చెప్పారు.

తెలుగు సినీపరిశ్రమ వజ్రోత్సవాలలో లెజెండ్ అంటూ కొందరికి పురస్కారాలు ఇస్తూ తనను పట్టించుకోకపోవటంపై తాను లెజెండ్ కాదా అంటూ మోహన్‌బాబు గొడవకు దిగటం, చిరంజీవి దానికి ఆవేశపూరితంగా సమాధానం ఇవ్వటం తెలిసిందే.   

బాలయ్య చెప్పిన మాటలను యధాతధంగా చూడాలనుకుంటే ఈ లింక్‌లోని వీడియోను చూడండి - https://www.youtube.com/watch?v=-KCRJIuj0vc#t=77 

Thursday, April 10, 2014

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యితెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు.

శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ  టికెట్‌ దక్కలేదు.

ఇక పార్టీ కార్యక్రమాల అమలుకమిటీ ఛైర్మన్ కర్నె ప్రభాకర్ మొదటినుంచీ కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. నల్గొండజిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి టికెట్‌కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు నిరాశే మిగిలింది. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి ఆ టికెట్‌ను కేటాయించారు.

పొద్దున లేచినదగ్గరనుంచీ పార్టీకి మద్దతుగా వాదిస్తూ, పార్టీని, నాయకులను భుజానకెత్తుకుని ప్రత్యర్ధులపై ఒంటిమీద దూసుకెళ్ళే వీరు, టికెట్‌లు దక్కకపోవటంవలన ఎంత నిరాశకు గురై ఉంటారో తేలిగ్గా ఊహించుకోవచ్చు. మరోవైపు, పార్టీ టికెట్‌లు ఆశించి భంగపడ్డవారిని విడివిడిగా పక్కకు పిలిచి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట ఎమ్మెల్సీ ఇచ్చేది నీకేనంటూ ఆశలు కల్పించి మైమరిపిస్తున్నారట మాటల మరాఠీ.

                                                                -------


Looking for Content Writers for Telugu web audience?

కంటెంట్ రైటింగ్ సేవలు కావలసినవారు సంప్రదించగలరు 

tejasswi11@gmail.com


image courtesy: tv9

Wednesday, April 9, 2014

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "
గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది. 

జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని.

ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా "ఆయనున్నప్పుడే బాగుండేది, మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది" అని ఒకరితో చెప్పిస్తారు. ఆ వెంటనే చంద్రబాబు తలకాయ స్లో మోషన్‌లో ఇటువైపుకు తిరుగుతుంది. అయితే క్లోజప్‌లో చూపించటంవల్లనో, ఏమోగానీ చంద్రబాబు ముఖంలో నవ్వు కృతకంగా, కళావిహీనంగా ఉంది. ఈ చిత్రాలను రూపొందించిన దర్శకుడు, నటుడు అల్లరి రవిబాబు, జగన్ పార్టీ ప్రచారచిత్రాలను చూసి పోటీగా అదే థీమ్‌తో తీయటంకాక మరేదైనా కొత్తగా ప్రయత్నించాల్సిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tuesday, April 8, 2014

స్టార్‌ప్లస్ మహాభారతం సీరియల్‌లో మూలకథకు దారుణ వక్రీకరణదూరదర్శన్‌లో 80వ దశకం చివరలో ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమైన రామాయణం, మహాభారతం హిందీ సీరియల్స్‌ను భాషతో సంబంధంలేకుండా దేశవ్యాప్తంగా అత్యధికశాతం ప్రజలు ఆదరించారు. రామానంద్ సాగర్(రామాయణం), బీఆర్ చోప్రా(మహాభారతం) ఆ సీరియళ్ళలో వివిధ పాత్రల స్వభావచిత్రణలో, నిర్మాణ ప్రమాణాలలో, సాంకేతిక విలువలలో ప్రశంశనీయమైన పనితీరు కనబరిచారు. పిల్లా, పెద్దా అందరినీ ఆ సీరియల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సీరియళ్ళ ప్రసార సమయంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయేదంటే వాటికున్న ప్రజాదరణను అంచనావేయొచ్చు. సాగర్, చోప్రా ఇరువురూ తమ సీరియల్స్ నిర్మాణంకోసం పాత తెలుగు పౌరాణిక చిత్రాలను అనుసరించటం మరో విశేషం.

ఇక ప్రస్తుతానికి వస్తే, హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ స్టార్‌ప్లస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌నుంచి రాత్రి 8.30గంటలకు మహాభారతం సీరియల్ ప్రసారమవుతున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రు.120 కోట్ల ఖర్చుతో ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది. మెలోడ్రామాకోసం ఈ సీరియల్ దర్శక, రచయితలు మూలకథను ఇష్టమొచ్చినట్లు మార్చేస్తూ పాత్రల స్వభావాలను తమకనుగుణంగా రూపుదిద్దుతున్నారు. వీరి వక్రీకరణ గురించి మచ్చుకు చెప్పాలంటే, యజ్ఞంద్వారా లభించిన ద్రౌపదిఅంటే ద్రుపదుడికి తీవ్ర ద్వేషం ఉందని వీరి భాష్యం. వాస్తవానికి, అర్జునుడికి భార్య కాగలిగే కుమార్తెను, ద్రోణాచార్యుడిని అంతమొందించే కుమారుడిని కోరుకుంటూ ద్రుపదుడు యజ్ఞం చేస్తాడు. ఇక్కడమాత్రం దానికి పూర్తి విరుద్ధంగా తీశారు. ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని సాగదీసి ఐదారు ఎపిసోడ్‌లపాటు లాగారు. ఆ ద్రౌపది పాత్రధారిని చూస్తే ఏ మూలా అందంగానీ, మంచి రూపురేఖలుగానీ ఉన్నట్లు కనబడవు. దాసికి ఎక్కువ, చెలికత్తెకు తక్కువ.

ఇక ద్రౌపదీ వస్త్రాపహరణం సందర్భంగా ధృతరాష్ట్రుడు, కర్ణుడు చెప్పిన డైలాగులు పరమ దారుణంగా, వారి పాత్ర స్వభావాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. నిండుసభకు తనను లాక్కుని రావటంపై ద్రౌపది ధృతరాష్ట్రుడిని ప్రశ్నిస్తే, దాసివి కాబట్టి దుర్యోధనుడి ఆదేశాలు పాటించి తీరాలంటాడు. కర్ణుడేమో ఆమెను వేశ్య అని నిర్వచిస్తాడు. వాస్తవకథలో వీరిద్దరికీ ధర్మం తెలిసినా, దుర్యోధనుడితో ఉన్న అనుబంధం కారణంగా అతనిని అడ్డుకోరు. ఇక్కడమాత్రం వీరిద్దరి పాత్రలను భ్రష్టు పట్టించారు. తెరపైన నిండుగా, భారీగా కనిపించటం తప్పించి, పాత్రల భావోద్వేగాలను కెమేరా ఎక్కడా చూపించలేకపోవటం మరో పెద్దలోపం. ముఖ్యంగా ద్రౌపదికి నిండుసభలో అవమానం జరుగుతుంటే పంచపాండవులు ప్రదర్శించిన భావోద్వేగాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఆ ఐదుగురూ ఈ ఎపిసోడ్ మొత్తం కన్నీరు కార్చటమొక్కటే చేశారు.

అయితే ఈ సీరియల్‌లో ఏకైక మంచి అంశమైన కృష్ణుడి పాత్రధారి గురించి తప్పక ప్రస్తావించి తీరాలి. అత్యంత ప్రజాదరణ పొందిన మహాదేవ సీరియల్‌లో విష్ణుమూర్తి పాత్రధారి సౌరభ్ రాజ్‌ జైన్ ఈ మహాభారతంలోనూ కృష్ణుడి పాత్రను పోషించారు. అతను మాత్రం ఆ పాత్రకు అతికినట్లు సరిపోయాడని చెప్పాలి. ముఖ్యంగా చక్కటి ముఖం, ఆ ముఖంలో ప్రశాంతత, చిద్విలాసం -  జగన్నాటక సూత్రధారికి ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉండటం విశేషం.

మహాభారతం ఆధారంగా తెలుగులో తీసిన మాయాబజార్‌వంటి చిత్రాలలో మూలకథకు కొద్దిగా మార్పులు, చేర్పులు చేశారుగానీ, పాత్రల స్వభావాలను, అందునా ప్రధాన పాత్రల స్వభావాలను ఎక్కడా ఇష్టమొచ్చినట్లు మార్చలేదు. మహాభారతం, రామాయణంవంటి పురాణాలగురించి తెలియని ఇప్పటితరం పిల్లలు ఈ సీరియల్ చూస్తేమాత్రం మహాభారతాన్ని, అందులోని పాత్రలను తప్పుగా అర్ధం చేసుకునే అవకాశముంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు మన రుషులు ఈ ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన వరాలు. మానవ ధర్మం, మనుషుల స్వభావాలు, మనుషులు అనుసరించవలసిన ఉత్తమ ప్రమాణాలగురించి మతంతో సంబంధంలేకుండా మానవాళి సమస్తం ఈ ఇతిహాసాలద్వారా  ఎంతో నేర్చుకోవచ్చు. అటువంటి కథలను మెలోడ్రామాకోసం చౌకబారుగా చిత్రీకరించటం విచారకరం. మాటీవీవారు ఈ మహత్తర ధారావాహికరాజాన్ని త్వరలో డబ్ చేసి తెలుగువారికి అందించి తరింపజేయబోతున్నారని సమాచారం.


image courtesy:starplus.in

Monday, April 7, 2014

వీరనారి విజయశాంతి, ఫైర్‌బ్రాండ్ రేణుకలకు భంగపాటు


మెదక్‌సీటు నాదే ఎన్నోరోజులనుంచీ ధీమాగా చెప్పుకుంటూ వచ్చిన రాములమ్మకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఆమెను మెదక్ అసెంబ్లీసీటుకు పరిమితం చేసింది. మెదక్ పార్లమెంట్ సీటును నిన్నటిదాకా జగన్ పార్టీలో చురుకుగా పనిచేసిన డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి అనే అపరిచితుడికి ఇచ్చింది. మెదక్‌నుంచి తానుగానీ, కుమార్తె కవితగానీ, రమణాచారిగానీ నిలబడాలని యోచిస్తున్న కేసీఆర్, ఢిల్లీ లెవెల్‌లో పావులు కదిపి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి ఈ టికెట్ కేటాయించేలా చేసినట్లు సమాచారం.

అసలు విజయశాంతి టీఆర్ఎస్‌నుంచి బయటకు రావటానికి కారణమే మెదక్ పార్లమెంట్ సీటు. 2009లో తమ పార్టీలోకొచ్చిన విజయశాంతికోసం - కేసీఆర్ సురక్షితమైన మెదక్ సీటును త్యాగం చేసి మహబూబ్‌నగర్‌కు వెళ్ళారు. అక్కడ చాలా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఈ సారిమాత్రం విజయశాంతికి మెదక్‌ను ఇవ్వగూడదని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఇది మెల్లమెల్లగా రాములమ్మకుకూడా అర్ధమైంది. దాంతో వారిద్దరిమధ్యా సంబంధాలు చెడి పార్టీనుంచి ఆమె నిష్క్రమణకు కారణమయింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాతకూడా తనకు మెదక్ సీటు కేటాయిస్తానని సోనియా హామీ ఇచ్చినట్లు రాములమ్మ అందరికీ చెప్పుకున్నారు. చివరికి చూస్తే మెదక్ సీటే ఇచ్చారుగానీ, అసెంబ్లీతో సరిపుచ్చారు. ఖంగుతిన్న రాములమ్మ, బయటకుమాత్రం అధిష్టానం తనను మెదక్ పార్లమెంట్‌గానీ, అసెంబ్లీగానీ కోరుకోమందని, తానే అసెంబ్లీ కోరుకున్నానంటూ కవరింగ్ చేసుకుంటున్నారు.

ఇక ఖమ్మం ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పరిస్థితి మరీ దారుణం. విజయశాంతికి అసెంబ్లీ టికెట్ అయినా ఇచ్చారు. రేణుకను అధిష్టానం పట్టించుకున్న పాపాన పోలేదు. గత మూడు పర్యాయాలుగా ఇక్కడ పోటీచేసి రెండుసార్లు(1999,2004) విజయం సాధించిన రేణుకకు కనీసం మాటమాత్రమైనా చెప్పకుండానే సీపీఐ నారాయణకు ఈ స్థానాన్ని కేటాయించారు. వాస్తవానికి అధిష్టానందగ్గర రేణుక పరపతి పడిపోయి చాలా రోజులే అయింది. గత నవంబర్‌లోనే ఆమెను అధికార ప్రతినిధి పదవినుంచి ఆమెను తప్పించారు. రాహుల్ గాంధి స్వయంగా చెప్పిమరీ ఆమెను తప్పించారని సమాచారం. ఖమ్మంజిల్లానేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి రేణుకపై ఇచ్చిన నివేదికలుకూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఆమె మాత్రం తన తల్లి ఆరోగ్యం బాగుండకపోవటంతో తానే తప్పుకున్నానని మీడియాకు బిల్డప్ ఇచ్చారు.

విజయశాంతిలాగే తెలంగాణ ఆడబిడ్డనని చెబుతూ వచ్చే రేణుక అసలు పుట్టింది విశాఖపట్నంలో. ఖమ్మంనుంచి గెలిచినా ఎక్కువగా ఢిల్లీలో పేజ్ 3 జీవితాన్ని గడిపుతూ ఉంటారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేణుక ఈ మధ్యమాత్రం భద్రాచలాన్ని సీమాంధ్రకు ఇవ్వాలంటే తన శవంమీదుగానే ‌వెళ్ళాలంటూ హడావుడి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలపాలంటూ అర్ధం పర్ధంలేని స్టేట్‌మెంట్లుకూడా ఇచ్చారు. చివరికి నిన్న అధిష్టానం మొండి చెయ్యిచ్చేటప్పటికి, మహిళలు, సమానత్వం అంటూ వాదన మొదలు పెట్టారు. అధిష్టానం విడుదల చేసిన జాబితాలో ఒక్క మహిళకూడా లేదని, దీనిపై హైకమాండ్‌ను నిలదీస్తానని చెబుతున్నారు.

కొసమెరుపు: విజయశాంతిని గత ఆగస్టునెలలో సోనియాగాంధివద్దకు తీసుకెళ్ళి పరిచయం చేసింది రేణుకా చౌదరే కాగా వీరిద్దరికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి  నుంచి ఒకేరకమైన అనుభవం ఎదురవటం విశేషం.


images courtesy:facebook/pages/vijayashanti & sarkariinfo.com

Saturday, April 5, 2014

చెవుల్లో అమృతం పోస్తున్నట్లనిపించే లక్కీ అలీ పాట
అద్భుతమైన మెలోడీతో సాగిపోయే ఈపాట, లక్కీ అలీ రూపొందించిన 'గోరీ తేరీ ఆంఖే...' అనే ప్రైవేట్ ఆల్బమ్‌లోనిది.  2001లో ఈ ఆల్బమ్‌ విడుదలయింది. దీనిలో ఎనిమిది పాటలున్నప్పటికీ పై పాటే హైలైట్. వియోగంమీద ఉన్న పాటలలో దీనికి మొదటి వరుసలో స్థానం కల్పించొచ్చు. లక్కీ అలీ గాత్రం చెవులలో అమృతం పోస్తున్నట్లుంటుంది. మంచి సంగీతంతోబాటు దృశ్యపరంగా కూడా బాగానే విజువలైజ్ చేశారని చెప్పొచ్చు. 

అలనాటి బాలీవుడ్ హాస్యనటుడు మహమూద్ కుమారుడైన లక్కీ అలీ ఆ వారసత్వంతో సంబంధం లేకుండా స్వతహాగా మంచి ప్రతిభ ఉన్న కళాకారుడు. అయినా ఎందుకో రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. నటనలోకూడా ప్రవేశముంది. త్రికాల్, కాంటే, సుర్, కసక్‌వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించారు. మూడు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలను పెళ్ళి చేసుకున్న లక్కీకి ఐదుగురు పిల్లలు. మరో విశేషమేమిటంటే అలనాటి ప్రసిద్ధ కథానాయిక మీనాకుమారి, లక్కీ అలీ తల్లి మహేలక సొంత అక్కా చెల్లెళ్ళు.

ఈ పాట సాహిత్యం కావాలంటే ఈ లింక్‌కు వెళ్ళండి - http://lucky-ali-songs.blogspot.in/

Friday, April 4, 2014

చంద్రబాబుకు ఒకకంట పన్నీరు, ఒకకంట కన్నీరురెండుకళ్ళ సిద్ధాంతకర్త, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు అన్నట్లుంది. సీమాంధ్రలోనేమో కాంగ్రెస్‌నుంచి వస్తున్ననేతలతో పార్టీ కార్యాలయానికి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండగా, అటు తెలంగాణలో పార్టీ దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి.

సీమాంధ్రలో తెలుగుదేశం కార్యాలయాలు కిటకిటలాడిపోతున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఎన్నో పదవులు నిర్వహించిన జేసీ దివాకరరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, రాయపాటి సాంబశివరావు, మండలి బుద్ధప్రసాద్‌వంటి సీనియర్ నాయకుల దగ్గరనుంచి నిన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, గల్లా అరుణ, పితాని సత్యనారాయణ ప్రభృతులవరకు పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులు పసుపు తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛోటా, మోటా నాయకులకైతే కొదవేలేదు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఖాళీచేయించి చావుదెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఆ పార్టీనుంచి వస్తున్నవాళ్ళను  వస్తున్నట్లు అక్కున చేర్చుకుని పార్టీ కండువా కప్పుతున్నారు చంద్రబాబు.

ఇక తెలంగాణలో పార్టీ పరిస్థితి చూస్తే సీమాంధ్రకు పూర్తిగా రివర్స్. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతానికి విసిగి కొందరు, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ ఆపరేషన్‌కు ఆకర్షించబడి మరికొందరు...పదులసంఖ్యలో నాయకులు తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. తెలంగాణలో టీడీపీ కార్యాలయాలకు టులెట్‌ బోర్డులు పెట్టుకోవాల్సిందేనంటూ హరీష్‌వంటి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారుకూడా.  2009 ఎన్నికలదగ్గరనుంచి తీసుకుంటే చెన్నమనేని రమేష్ నుంచి మొదలుపెట్టి గంగుల కమలాకర్, నాగం జనార్దనరెడ్డి, కడియం శ్రీహరి, హరీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలాచారి, జోగు రామన్న, సత్యవతి రాథోడ్, కేఎస్ రత్నం, మహేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, నగేష్, బోడ జనార్దన్, హనుమంతు షిండే, మర్రి జనార్దన్ రెడ్డినుంచి నిన్నటి బాబూ మోహన్ వరకు సీనియర్ నాయకుల రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉందిఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, మోత్కుపల్లి నరసింహులు, దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రమే ఇప్పుడు అక్కడ మిగిలిఉన్న అగ్రనాయకులు. వీరిలోకూడా ఎర్రబెల్లి ఈ మధ్య జానారెడ్డిద్వారా కాంగ్రెస్‌లోకి దూకేందుకు బేరాసారాలాడారుగానీ, ఎందుకో మళ్ళీ టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఆ విధంగా ఒక ప్రాంతంలో మోదం, మరో ప్రాంతంలో ఖేదం చవిచూస్తున్న చంద్రబాబునాయుడికి ఇది విచిత్ర అనుభవమేనని చెప్పుకోవాలి


image courtesy: wikipedia

Thursday, April 3, 2014

కేసీఆర్ హామీల వర్షంలో తడిసి ముద్దవుతున్న తెలంగాణఅసలే ఎన్నికల వేళ. ఏ రాజకీయపార్టీ అయినా కొత్త కొత్త హామీలను, సంక్షేమ పథకాలను ప్రకటించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించటం మామూలే. మరి రాజకీయంలో ఎత్తులు, జిత్తులు అన్నిటినీ పుక్కిట పట్టిన కేసీఆర్‌వంటి నాయకుడి సంగతి చెప్పేదేముంది. ఈసారి ఎన్నికల కదనరంగంలో వాగ్దానాల ప్రకటనలో అన్నిపార్టీల నాయకులలోకీ కేసీఆరే ముందంజలో ఉన్నారని చెప్పాలి. బంగారు తెలంగాణను తయారుచేసి తెలంగాణ ప్రజలకు అందించటమే టీఆర్ఎస్ లక్ష్యమని చెబుతూ ప్రతి ఎన్నికలసభలోనూఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కగదితో ఇల్లు కట్టించి ఇచ్చి దానినే కైలాసం, వైకుంఠంగా భావించమంటోందని, తమ ప్రభుత్వంవస్తే పేదలకు వంటగది, స్నానాలగదితోసహా రు.3 లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేశారు. రు.1 లక్ష లోపు ఇళ్ళ, పంట రుణాలున్నవారెవరూ వాటిని కట్టొద్దని, వాటన్నంటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణరాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులనందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు(ఈ హామీపై తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్‌మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు). ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని చెబుతున్నారు. ఆంధ్రా ఉద్యోగులు వెళ్ళిపోతే లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ అవుతాయని, వాటిని తెలంగాణ నిరుద్యోగులతో భర్తీ చేయొచ్చని అంటున్నారు. తెలంగాణలో ఉద్యోగులను ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాంతంనుంచి కనీసం మూడేళ్ళవరకు బదిలీ చేయబోమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజనులకు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, వితంతువులకు, వృద్ధులకు రు.1,000, వికలాంగులకు రు. 1,500 పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి మండలకేంద్రంలోనూ 30 పడకల ఆసుపత్రిని కట్టిస్తామని, ఒక్కొక్కరికి రు. లక్ష జీతంఇచ్చి నలుగురు వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని, జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కడతామని హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేసీఆర్ అన్నారు.

ఉచిత విద్యహామీ విషయంలో కేసీఆర్ ఒక అడుగు ముందుకెళ్ళారని చెప్పక తప్పదు. చిన్నపిల్లల చదువు బాధ్యత స్థానిక పోలీసులకు అప్పగిస్తామని, ఎవరైనా పిల్లలు బడికి వెళ్ళకుండా ఉంటే స్థానిక పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందిస్తామని, పిల్లలకు తిండి, చదువు, బట్టలు, పుస్తకాలు అన్నీ ప్రభుత్వమే భరించేలా చూస్తామని అన్నారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అందరికీ ఒకే పాఠశాల, ఒకే విద్య, ఒకే భోజనం, ఒకే యూనిఫామ్ ఉంటుందని అన్నారు.

విద్యుత్ విషయంలోనూ కేసీఆర్ భారీ హామీలే గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ అంతా విద్యుత్ వెలుగులతో దేదీప్యమానమవుతుందని అన్నారు. కొత్త ప్రభుత్వంలో అవినీతికి తావుండదని, అవినీతి అంతం తన పంతం అని కేసీఆర్ చెప్పారు.

కొసమెరుపు: తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లిమ్‌ను ఉపముఖ్యమంత్రిని చేస్తానని గతంలో చెప్పి ఇప్పుడు మాట మార్చటాన్నే కేసీఆర్‌పై ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రత్యర్ధులు వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో...ఆయన గుప్పిస్తున్న పై హామీలను తెలంగాణ ప్రజలు నమ్ముతారో, లేదో తెలియాలంటే ఫలితాలవరకు వేచి చూడాల్సిందే!


image courtesy: wikipedia

Tuesday, April 1, 2014

మయసభలోలాంటి మెట్ల మాయాజాలం వీడియో చూడండి!
గమనిక: మొదటి 40 సెకన్లవరకు విశేషమేమీ కనిపించదు...ఓపిక పట్టి చూడండి.

గుడివాడలో దొంగనోట్లు పంచింది తెలుగుదేశమంటూ సాక్షి కథనంగత ఆదివారం గుడివాడలో మున్సిపల్ ఎన్నికలసందర్భంగా ఒకవార్డులో జగన్ పార్టీ నేతలు ఓటర్లకు దొంగనోట్లు పంచారని మీడియా అంతా కోడైకూసిన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియావంటి ఆంగ్ల దినపత్రికలుకూడా వైఎస్ఆర్ సీపీనేతలు ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్నట్లు (http://goo.gl/UqFBNR) వార్తను ఇచ్చాయి. అయితే, సాక్షి మీడియామాత్రం ఈ వార్తను దీనిని 'తనదైన శైలి'లో ఆవిష్కరించింది. గుడివాడలో తెలుగుదేశంనేతలు చెల్లనినోట్లు పంపిణీ చేశారంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో కథనాలు ఇచ్చింది. క్రింది లింక్‌లో ఆ కథనాలను చూడొచ్చు.

http://goo.gl/ogIJM3

ఈ వార్త పూర్వాపరాలలోకి వెళ్తే, గుడివాడ పట్టణంలోని 21వవార్డులో అభ్యర్ధి ఒకరు ఓటుకు రెండువేలరూపాయల చొప్పున డబ్బు పంచారు. నాలుగు ఐదొందలరూపాయల నోట్లుగా ఆ డబ్బును ఇచ్చారు. తీసుకున్న ఓటర్లలో కొందరు వాటిని దుకాణాలలో ఇవ్వబోగా అవి 2005కు పూర్వం ముద్రించినవి కాబట్టి చెల్లబోవంటూ వ్యాపారులు నిరాకరించారు. దీంతో, తాము మోసపోయామని భావించిన సదరు ఓటర్లు లబోదిబోమన్నారు. అయితే తాము తీసుకుంది అక్రమ వ్యవహారంకాబట్టి పోలీసులకు చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా కూర్చున్నారు. అయితే  మీడియాకు ఎలాగో పొక్కి ఈ విషయం బయటకొచ్చింది. స్థానిక తెలుగుదేశంనేతలు ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ నేతలమీద పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇద్దరు జగన్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, తాము పంచింది నకిలీ నోట్లుకాదని, 2005కుపూర్వం ముద్రించినవిమాత్రమేనని సదరు అభ్యర్ధితరపువారు ఓటర్లకు నచ్చచెబుతున్నా ఉపయోగంలేకుండా పోయింది. విషయం పోలీసులదృష్టిలోకెళ్ళిపోయింది. పోలీసులు పంపిణీ జరిగిన నోట్లను సేకరించి విచారణ ప్రారంభించారు.

image courtesy:wikipedia.com

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts