Sunday, April 10, 2011

పదిరోజుల వ్యవధిలో(జాతి మొత్తం ఏకమై నిలిచిన) రెండు చరిత్రాత్మక సందర్భాలుగత పదిరోజులుగా దేశానికి ఏదో మంచి దశ నడుస్తున్నట్లుంది. లేకపోతే కుల, మత, వర్గ, ప్రాంత, సంస్కృతుల విబేధాలు, వైషమ్యాలతో రగిలే భరతజాతి మొత్తం ఒక్కసారికాదు, రెండుసార్లు ఏకతాటిపైకి రావడమంటే మాటలా. ఈ అరుదైన శుభపరిణామాలకు నాంది పలికింది ఒకసారి క్రికెట్టయితే, రెండోసారి అవినీతిపై పోరు.

ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా జాతిమొత్తం, ఆసేతుహిమాచలమూ భారతజట్టు గెలుపుకోసం తపన చెందింది. పిల్లలు, యువతీయువకులు సరే...క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోనివారు, పెద్దవారు, ఆడవాళ్ళు సైతం ఈ రెండు మ్యాచ్ ల సందర్భంగా మనదేశ జట్టుగెలవాలని బలంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. ఈ రెండు మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో దేశమంతటా - కర్ఫ్యూ కాదుగానీ - 144వ సెక్షన్ విధించినట్లయిందని చెప్పుకోవచ్చు. అందరూ టీవీసెట్లకు అతుక్కుపోయారు. రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తానికి 120కోట్లమంది ప్రార్ధనలు ఫలించాయో ఏమోగానీ భారతజట్టు ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్రపంచ కప్ సాధించి జాతిని ఆనందసాగరంలో ఓలలాడించింది. జనం తమ సమస్యలను, కష్టాలను, విబేధాలను పక్కనబెట్టి మరీ ఒకరినొకరు అభినందించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇదే అరుదయిన సందర్భమనుకుంటే మళ్ళీ వారంరోజులలోనే అలాంటి పరిణామమే చోటుచేసుకోవడం అపూర్వమే.

అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోక్ పాల్ వ్యవస్థకోసం అన్నాహజారే జరిపిన ఆమరణ నిరాహారదీక్ష కూడా జాతిలో ఓ అపూర్వ కదలిక తీసుకువచ్చింది. మొదట ఓ మోస్తరుగా ఉన్న మద్దతు గంటగంటకూ పెరిగిపోతూ నిరాహారదీక్ష చేసిన 96గంటలలో పతాకస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో అన్నాహజారేకు మద్దతుగా జనం ప్రదర్శనలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ మద్దతు పెరుగుతుండటం గమనించిన వివిధపార్టీల రాజకీయనాయకులు...తాముకూడా అవినీతికి వ్యతిరేకమేనంటూ అన్నాహజారేకు మద్దతుపలకడం ప్రారంభించారు. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం దిగివచ్చి లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించింది. బంద్ లు, ఆందోళనలు, హర్తాళ్ లు ఏమీ జరపకుండా పూర్తిగా గాంధేయమార్గంలో సాగిన అన్నాహజారే ఉద్యమం విజయవంతమవడం ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికి, రాజకీయపార్టీలకు గుణపాఠంగా నిలిచింది. ఈ ఉద్యమంవలన తక్షణమే ఏదో జరుగుతుందని ఆశించలేకపోయినా దేశప్రజలలో అనూహ్య చైతన్యం తీసుకురావడం గొప్ప శుభపరిణామమని చెప్పుకోవచ్చు.

భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఈ రెండు అరుదైన సందర్భాలకు మనం ప్రత్యక్షసాక్షులు కావడం మన అదృష్టమని భావించొచ్చేమో. ఇదే స్ఫూర్తి, స్పందన, చైతన్యం, ఐకమత్యం, సంఘీభావం కొనసాగితే భారతదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతూ అగ్రరాజ్యంగా నిలబడటానికి ఎంతో కాలం పట్టదు.

3 comments:

  1. ప్రత్యక్ష స్వాతంత్ర సమరం లో పాల్గోన్నంత ఆనందం గా ఉంది ఈ ఉద్యమం లో నేను ఒక నీటి బిందువు అయినందుకు. ఈ పోరాటం ఆరంబం మాత్రమె అవ్వాలి అని ఆసిస్తూ హజారే గారికి పాదాబివందనం చేస్తున్నాను.

    ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts