Thursday, October 17, 2013

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే, మీ ఇంటి శాటిలైట్ మ్యాపును, 360డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది. వోనోబో.కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్, ఫోటోలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే, మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది. అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి. మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది. అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్, సగభాగంలో ఫోటో కనిపిస్తాయి. ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు, 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి. మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే, ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా, కొద్దిగా అయోమయంగానే ఉంటుంది. ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన్ తేలికవుతుంది.

స్ట్రీట్ వ్యూ అనే ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీదిగ్గజం గూగుల్ కొంతకాలంగా పలుదేశాలలో అందిస్తోంది. భారత్ లోకూడా ఈ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నా, వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు లభించకసతమతమవుతోంది. ఈ సమయంలో ఇద్దరు భారతీయసోదరులు చురుకుగా స్పందించి గూగుల్ తలపెట్టిన ఆ కార్యాన్ని పూర్తిచేసేశారు. సోల్ మాలిక్, సాజిద్ మాలిక్ అనే ఆ సోదరులకు చెందిన జెనెసిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థమొదటి విడతలో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, గోవా, కొలకతా, ఆగ్రా, పూణెవంటి 12నగరాలకు స్ట్రీట్ వ్యూ సేవలను అందించటం ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను 54 భారతీయనగరాలకు వీరు విస్తరించనున్నారు. వీరు కొంతకాలంగా మ్యాప్ లు రూపొందించే వ్యాపారంలో ఉండటంవలన గూగుల్ సాధించలేని అనుమతులను సాధించటానికి వీరికి వీలయింది.

ప్రజల జీవనవిధానాన్ని రోజురోజుకూ మరింత సౌకర్యవంతంచేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్ట్రీట్ వ్యూ ద్వారా మరో కొత్త సౌకర్యాన్ని ఆవిష్కరించినట్లయింది. చిన్నచిన్న గల్లీలతో సహా దాదాపుగా నగరం అంతటినీ ఫోటోలు తీసి పెట్టటంవలన ఈ స్ట్రీట్ వ్యూ నగర జీవనవిధానంలో పెనుమార్పులే తీసుకురానుంది. నగరంలోని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఈ స్ట్రీట్ వ్యూద్వారా గతంలోకంటే సులభంగా, వేగంగా వెళ్ళవచ్చు. వ్యాపార, వాణిజ్యాలలోస్ట్రీట్ వ్యూఎంతో ఉపయోగకరంగా మారనుందని, అయితే ప్రస్తుతానికి తమ సేవలు వాడుకోవటానికి సంస్థలనుంచి ఛార్జీలు వసూలుచేయటంలేదని జెనెసిస్ సంస్థ ఎండీ సాజిద్ మాలిక్ చెప్పారు.2 comments:

  1. చాలా ధన్యవాదములండీ. ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం.

    ReplyDelete
  2. సురేష్ బాబుగారూ, నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts