Tuesday, September 17, 2013

వ్యక్తిగత ఆరోపణలపై ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు వివరణజులై 30న జరిగిన రాష్ట్రవిభజన ప్రకటన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి రావటమేకాక, రాష్ట్రంలోని ప్రముఖులలో ఒకరై పోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు. ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడి పదవిలోకి వచ్చినపుడే ఆయన ఓ మాదిరి ప్రముఖుడైపోయినప్పటికీ, ఇంతస్థాయిలో రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ తెలిసేటంత గుర్తింపు అయితే జులై 30కు ముందు లేదు. ఇంతకుముందు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గోపాల్ రెడ్డి ఈ ఏడాది మే 31న రాజీనామా చేయటంతో జనరల్ సెక్రెటరీగాఉన్న అశోక్ బాబు, రివాజు ప్రకారం అధ్యక్షస్థానానికి చేరుకున్నారు.

ఏపీఎన్‌జీఓ అధ్యక్ష పదవికి చేరుకోవటంతోసహా అశోక్ బాబుపై అనేక వ్యక్తిగత ఆరోపణలు మీడియాలో వచ్చిన మాట తెలిసిందే. ఆ పదవికి ఎన్నికలే జరగలేదని, అధ్యక్షుడినని తానే స్వయంగా ప్రకటించుకున్నారని ఎన్‌జీఓ సంఘానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే, డిగ్రీ చదవక పోయినా, చదివినట్లు పేర్కొని, తప్పుడు సర్టిఫికెట్ తో విజయవాడనుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.దీనిపై అశోక్ బాబు గత ఆదివారంనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో వివరణ ఇచ్చారు. కేవలం ఒక టైపింగ్ పొరపాటును పట్టుకుని కొందరు వ్యతిరేకులు, మీడియా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. డిగ్రీ చదివినట్లు ఒకచోట పొరపాటున తప్పుగా టైప్ అయిందని, దానిని కొండంతలుగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. 2009 సంవత్సరంనుంచి ఏపీ ఎన్‌జీఓ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు ఆ పదవివలన హైదరాబాద్ లో ఉండే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తుందని వివరణ ఇచ్చారు. గత సంవత్సరమే తాను తన పోస్టునుకూడా హైదరాబాద్ కు బదిలీ చేయించుకున్నానని చెప్పారు.

అయితే, ఏపీ ఎన్‌జీఓ సంఘ అధ్యక్ష పదవికి ఎన్నికవటంపై, హౌసింగ్ సొసైటీలో అక్రమంగా సభ్యత్వం పొందారన్న ఆరోపణలపై ఇంటర్వ్యూలో ఆర్కే అడగనూ లేదు, అశోక్ బాబు వివరణ ఇవ్వనూలేదు. ఈ ఏడాది మే 31న గోపాల్ రెడ్డి పదవీవిరమణతో ఖాళీ అవుతున్న అధ్యక్షపదవికి మే 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని, కానీ దీనిపై కొందరు ఉద్యోగులు జూన్ 20న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో సవాల్ చేశారని, ఆ ఎన్నికలనుతాత్కాలికంగా నిలిపేయాలని కోర్ట్ ఆదేశించిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్ బాబు స్వయంగా అధ్యక్షుడినని ప్రకటించుకున్నారని, అతనొక చీటింగ్ మాస్టర్, 420 అని దుయ్యబడుతున్నారు. ఏపీ ఎన్‌జీఓలు ఈ ఆరోపణలను తిప్పిగొడుతూ, తెలంగాణ ఎన్‌జీఓ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించి ఇటీవలే తెరాసలోచేరి ఎమ్మెల్సీ అయిన స్వామిగౌడ్ గోపన్నపల్లి ఎన్‌జీఓ హౌసింగ్ సొసైటీలో చేసిన అక్రమాలు గుర్తుకు తెచ్చుకోవాలని అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వజీతం తీసుకుంటూనే జేఏసీ నేతగా వ్యవహరించటం సాంకేతికంగా తప్పుకాకపోవచ్చుగానీ, నైతికవిలువలుంటే, ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని వందలమంది తెలంగాణ వాసులను గతంలో మోసం చేసిన కేసీఆరేఅసలు420 అంటున్నారు.

ఏదిఏమైనా,ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలవలన పై నాయకులలో ఎవరికీ వీసమెత్తు నష్టం ఉండదన్నది అందరూ తెలిసిన విషయమే. ఎవరెన్ని అనుకున్నా, తెలంగాణ ఉద్యమం ఈ స్థాయికి రావటానికి కోదండరామ్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సేవ్ ఆంధ్రప్రదేశ్ సభతో ఒక మలుపు తిప్పిన అశోక్ బాబు పరిణతిగల నాయకుడనటంలో ఎవరికీ సందేహంలేదు. ముఖ్యంగా నిన్నటి ఓపెన్ హార్ట్ లో ఆద్యంతం ఎవరినీ విమర్శించకుండా, ఆద్యంతం ఒక సానుకూల ధోరణితో, నిండుకుండలా ఆయన మాట్లాడిన తీరును తెలంగాణకు చెందిన ఉదారవాదులుకూడా మెచ్చుకుంటున్నారు. మరోవైపు వేమూరి రాధాకృష్ణకూడా తనదైన శైలిలో కొంటెమాటలు, చిలిపి ప్రశ్నలు వేయకుండా ఇంటర్వ్యూ చేయటం విశేషం. అంతకుముందువారం, అందరం దాదాపుగా మరచిపోయిన లబ్దప్రతిష్ఠుడు, తెలంగాణ కవిదిగ్గజం దాశరథి రంగాచార్యతోనూ, ఈ వారం అశోక్ బాబుతోనూ వరసగా చేసిన రెండు మంచి ఇంటర్వూలద్వారా, ఈ కార్యక్రమంపై తనకున్న మచ్చలను రాధాకృష్ణ చెరిపేసుకున్నట్లయింది.

కొసమెరుపు:ఇంటిపేరునుబట్టి కులాన్ని అంచనా వేసేవారు చాలామంది, అశోక్ బాబు ఇంటిపేరును చూసి ఫలానా కులంవారు అని ముద్ర వేసుకుని, ఆ కులంతో తమతమకున్న అనుబంధాన్నో, అయిష్టతనో ఆయనపై పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారట. అయితే ఆయన ఆ కులం కాదని, అదే కులం పేరులోని మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే మరో అగ్రకులమని ఏపీ ఎన్జీఓ నాయకులు తెలిపారు.
No comments:

Post a Comment

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts