Thursday, March 27, 2014

మరో వివాదంలో మోహన్‌బాబు:గౌరవ డాక్టరేట్ నకిలీదేనని నిర్ధారణ
డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును మరో వివాదం చుట్టుముట్టింది. అయినా వివాదాలు ఆయనకు కొత్తకాదనుకోండి. ఈ సారి వివాదం ఆయనకు కొన్నేళ్ళక్రితం లభించిన గౌరవ డాక్టరేట్ పట్టాపై. అమెరికాలోని ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్ పట్టాఇచ్చి గౌరవించింది. అప్పటివరకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి గొప్పనటులకు ఆంధ్రా యూనివర్సిటీయో, నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్‌లు ఇవ్వటంమాత్రమే చూసిన తెలుగువారికి మోహన్‌బాబు నేరుగా అమెరికానుంచే డాక్టరేట్ పట్టా పొందటం ఆశ్చర్యకరంగానూ, అపూర్వంగానూ అనిపించింది. ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆయనకు చెన్నైలో నాడు భారీఎత్తున సన్మానంకూడా జరిగింది.

సదరు అమెరికా యూనివర్సిటీ ఒక పెద్ద ఫ్రాడ్ అని ఇప్పుడు తేలింది. ఈ సంస్థ మోహన్‌బాబుకేకాక మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు(మాజీ మంత్రి గల్లా అరుణతండ్రి), మిసిమి పత్రిక ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ వంటి మరికొందరు తెలుగువారికికూడా ఈ గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చిందట. ఈ యూనివర్సిటీ వ్యవహారం తేడాగా ఉన్నట్లు గమనించిన నరిశెట్టి ఇన్నయ్యగారనే సీనియర్ తెలుగు జర్నలిస్ట్ అమెరికా వెళ్ళినపుడు దీనిపై పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇన్నయ్యగారిని గురించి చెప్పుకోవాలి. ఈయన డెబ్భై, ఎనభై దశకాలలో తెలుగు మీడియాలో పేరుగాంచిన పాత్రికేయులు, హేతువాది, మానవతావాది. కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, వైఎస్ వంటి ముఖ్యమంత్రిస్థాయి నాయకులతో నేరుగా మాట్లాడేటంత చనువు, సాన్నిహిత్యం వీరికి ఉండేది. అమెరికానుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ఎడిటర్‌ రాజు నరిశెట్టి వీరి కుమారుడే.

ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్‌లపై సంతకాలు చేసే రాయ్ బి అలివర్ అనే వ్యక్తికోసం ఇన్నయ్య ఆరా తీయగా అతను క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో లాస్ ఆల్టోస్ అనే చోట ఉన్నట్లు తెలిసింది. ఇన్నయ్య నేరుగా ఆయన ఉన్నచోటికి వెళ్ళి కలిసి యూనివర్సిటీ ఎక్కడ అని అడగగా, వాషింగ్టన్ నగరంలో ఒక చిరునామాను ఇచ్చరట. తమ యూనివర్సిటీపై ఇండియాలోని హిందూ దినపత్రిక నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆ పత్రికపై దావా వేయబోతున్నానని కూడా చెప్పాడట. ఇక ఇన్నయ్య అలివర్ ఇచ్చిన వాషింగ్టన్ చిరునామాకు వెళ్ళగా అది తాళంవేసిఉన్న ఒక అపార్ట్‌మెంట్ అడ్రస్‌గా తేలింది.

చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న త్యాగరాజన్ అనే ఏజెంట్ ద్వారా అలివర్ డాక్టరేట్ డిగ్రీల బేరాలు మాట్లాడుకుంటాడని ఇన్నయ్యగారి పరిశోధనలలో బయటపడింది. ఇదీ మన లెజెండ్ మోహన్‌బాబుగారి డాక్టరేట్ ప్రహసనం. పద్మశ్రీ పురస్కారం దుర్వినియోగంపై ఇప్పటికే హైకోర్టులో ఆయనపై కేసునడుస్తున్న సంగతి తెలిసిందే. దానికితోడు ఈ నకిలీ డాక్టరేట్ విషయం కూడా హైకోర్టువారికి తెలిస్తే పెదరాయుడు పరిస్థితి ఏమిటో?


గమనిక: 'ది హన్స్ ఇండియా' ఆంగ్లదినపత్రికలో ఇన్నయ్యగారు ఈ విషయంపై రాసిన వ్యాసాన్ని పై భాగాన చూడొచ్చు. దాని లింక్ - http://goo.gl/PdgcS7

3 comments:

 1. ఈ గౌరవపద డిగ్రీలను పేరుకు ముందు తగిలించుకోవడం తప్పు. అయినా తగుదునమ్మా అని కొనుక్కొని మరీ వెంపర్లాడే వారు (ఉ. ఎన్టీఆర్, మోహన్ బాబు) తమ అజ్ఞానాన్ని తమకు తామే బయట పెట్టుకుంటారు.

  ReplyDelete
  Replies
  1. Dear Telabaan,
   When and where NTR bought the doctorate? Did your Telangana Gandhi told you about this?

   Delete
 2. ప్రపంచంలో దురాశాపరులూ, అటువంటి దురాశాపరుల ప్రయత్నాలనుండి లబ్ధిపొందేటందుకు పూనుకొనే నక్కజిత్తులపెద్దమనుషులూ నిత్యం అన్నిచోట్లా కనిపిస్తారు. దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి అమాయకులైన వారూ ఇల్లంతి జిత్తులమారిమనుషుల వలలో పడతారు, కేవలం ఏదో బలహీనక్షణంలో ప్రలోభానికి లోబడటం వలన.

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts