Friday, March 7, 2014

వర్మ మాటల్ని నిజం చేసిన పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఆమధ్య ట్వీట్ల వర్షం కురిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వర్మ మాటల్ని పవన్ మొత్తానికి నిజం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళో, రేపో పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

"పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ ఉంది, చూట్టానికి బాగుంటాడు, సినిమాల్లో అయితే ధియేటర్లలోనే చూడాలి, రాజకీయాల్లోకి వస్తే న్యూస్ ఛానల్స్‌లో రోజూ చూడొచ్చు" అంటూ తన ట్వీట్లకు కారణాన్ని వర్మ నాడు వివరించాడు. అది వర్మశైలి వ్యంగ్యమో, మనసులోనుంచి వచ్చిన మాటో చెప్పలేముగానీ పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ, కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు, సమాజానికి ఏదో చేయాలని(concern) ఉందని మాత్రం దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. అధికారమో, డబ్బో మాత్రమే లక్ష్యమే అయితే తన వృత్తిలో అత్యద్భుతమైన దశకు చేరుకున్న ప్రస్తుతతరుణంలో దానిని పణంగా పెట్టి రాజకీయాలలో దిగడని టాలీవుడ్ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ రాజకీయాలకు కేవలం నిజాయితీ, ఆదర్శాలు, పుస్తక పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ సొంత అన్నగారైన చిరంజీవి 'ప్రజారాజ్యం' అంటూ చేసిన ప్రయోగం విఫలమయిన తర్వాతకూడా పవన్ ఈ సాహసానికి దిగటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది('అన్న అయిపోయాడు, ఇక తమ్ముడు దిగాడు' అన్నది మొదట వినబడే విమర్శ).

ఇదంతా క్షుణ్ణంగా ఆలోచించి చేస్తున్న పనేనా? లేక తనదైన శైలిలో అప్పటికప్పుడు తోచిన నిర్ణయాన్ని అమలు చేసే(impulsive) పాత పద్ధతేనా అనేది ఇంకా తెలియరావటంలేదు. అతని వెంట ఉండి తోడ్పాటు, సలహాలు, సూచనలు ఇస్తున్న బృందం(think tank)  విషయపరిజ్ఞానం, దూరదృష్టి, రాజనీతిజ్ఞత ఉన్నదేనా, వంది మాగధులేనా అనేది కూడా తెలియాల్సిఉంది. గద్దర్ ఇటీవల పవన్‌ను కలుస్తున్నట్లు మాత్రం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రకటించబోయే విధివిధానాలు, లక్ష్యాలు ఆచరణాత్మకమేనా, ఆచరణసాధ్యంకాని ఊహాస్వర్గమా(utopian)అనేది 14వతేదీకి తెలిసిపోనుంది.

'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటి భారీవిజయాల తర్వాత అనూహ్యంగా కొండంతలు పెరిగిపోయిన ప్రజాదరణ పవన్‌నురాజకీయరంగప్రవేశమనే సాహసానికి పురిగొల్పిందని కొందరంటున్నారు. దక్షిణాదిలో రజనీకాంత్ తర్వాత పవన్ మాత్రమే అనే మాటలు కూడా ఇటీవల అక్కడక్కడా వినబడటంతో, పక్కనుండే భజనబృందం పవన్‌ను రెచ్చగొట్టి ఈ అడుగు వేయిస్తోందని మరికొందరి వాదన. 

తెలుగు సినీరంగంలో ప్రస్తుతం దాదాపుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న పవన్‌కు రెండు రాష్ట్రాలలోనూ గణనీయమైనస్థాయిలోనే అభిమానులు ఉన్నారనేది ఎవ్వరూ కాదనలేరు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆంధ్ర ప్రాంత హీరోను ఇష్టపడేవారు ఆంధ్రాకంటే తెలంగాణలోనే అత్యధికులు ఉన్నారు. ముఖ్యంగా, కళ్ళెదుట ఏదైనా కష్టం కనిపిస్తే తట్టుకోలేడని, వారికి వెంటనే సాయమందిస్తాడని, అన్న(నాగబాబు)ను అప్పులనుంచి బయటకు తీసుకురావటానికి ఇల్లు అమ్మేసుకున్నాడని చలామణిలో ఉన్న కథనాలతో అతని మంచితనం, మానవత్వాన్ని అభిమానిస్తూ తెలంగాణ యువత అతనిపట్ల విపరీతమైన అనురాగాన్ని పెంచుకున్నారు. ఇక ఆంధ్రాలో అభిమానులతోబాటు అతని సొంత(కాపు) సామాజికవర్గంవారి ఆదరణ ఎలానూ ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ఓట్లరూపంలోకి మారతాయని చెప్పలేముగానీ, తాము పోటీచేసే(9 పార్లమెంట్, 40 అసెంబ్లీ) నియోజకవర్గాలలో అభ్యర్థుల విజయావకాశాలను మాత్రం పవన్ పార్టీ ఖచ్చితంగా మార్చగలదని బల్లగుద్ది చెప్పొచ్చు.

కొసమెరుపు: అన్నయ్య, కేంద్రమంత్రి, కాంగ్రెస్ ముఖ్యనాయకుడు చిరంజీవి రేపు ఎన్నికల ప్రచారంలో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను ఎలా ఎదుర్కొనబోతున్నారనేది ఆసక్తిదాయకమైన పతాక సన్నివేశం కాబోతోంది.

image courtesy: wikipedia


No comments:

Post a Comment

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts