Skip to main content

'నమస్తే తెలంగాణ-2'గా మారుతున్న 'ఈనాడు'






వ్యాపారవేత్తలు పత్రికాధిపతులైతే చాలా ప్రమాదమని పత్రికారంగ పెద్దలు ఏనాడో చెప్పారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా ప్రమాణాలను పణంగా పెడుతున్న ప్రస్తుత తరుణాన్ని ఆ పెద్దలు ఆనాడే ఊహించి ఉంటారు.

హైదరాబాద్‌లో, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పలు వ్యాపారాలను, ఆస్తులను కలిగిఉన్న రామోజీరావు, ఆయన పుత్రరత్నం కిరణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల విధేయత ప్రకటించుకోవడానికి(to be in good books of KCR) నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలుగానీ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలుగానీ తమ పత్రికలో ప్రముఖంగా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామోజీరావు వ్యాపారాలను కేసీఆర్ ఏమి చేస్తాడనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వంవస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్ళతో దున్నిస్తానని గతంలో అన్న కేసీఆర్ ఇప్పుడు అంతపని చేయకపోవచ్చుగానీ, తెలంగాణలో కొత్త ఫిలిమ్ సిటీ(కేసీఆర్ ఇటీవల ఈమేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే) పెడితేమాత్రం అంతపని చేసినట్లే అవుతుంది.

కేసీఆర్ చేసే ప్రతిపనినీ విమర్శించాలనీ, ఆయన ప్రతిమాటనూ ఖండించాలని వివేకము, విచక్షణ ఉన్నవారు ఎవరూ అనరు. అయితే వార్తను వార్తగా నివేదించటం, రాగద్వేషాలకతీతంగా, నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయటం అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికావ్యవస్థ ప్రాధమిక కర్తవ్యం. 

మొన్న వరంగల్‌లో కాళోజీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపముఖ్యమంత్రి రాజయ్యనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ స్థాపిస్తామని రాజయ్య అంతకుముందు చెప్పడాన్ని ఎద్దేవా చేస్తూ, "రాజయ్య హెల్త్ యూనివర్సిటీ పెట్టగలుగుతాడా? ఎందుకు డంబాచారాలు, అడ్డమైన వొర్లుడు" అని కేసీఆర్ అన్నారు. ఆయన యథాతథంగా ఏమన్నదీ క్రింది వీడియోలో చూడొచ్చు.

ప్రభుత్వంలో తన తర్వాత తన అంతటివాడైన ఉపముఖ్యమంత్రి రాజయ్య చేసిన ప్రకటనను అక్కడికక్కడే సభాముఖంగా ఖండించటం, ఎద్దేవాగా మాట్లాడటం విమర్శలకు దారితీసింది. దానికితోడు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని తొలగించనున్నారని ప్రభుత్వంనుంచి ముఖ్యవర్గాలు పత్రికలకు ఇటీవల సమాచారాన్ని లీక్ చేసిఉండటంతో అది రాజయ్యేనని దళితవర్గాలు భావించాయి. జాట్సన్ అనే ఒక దళితుడు కేసీఆర్ రాజయ్యనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నిన్న ఎస్‌సీ-ఎస్‌టీ కమిషన్‌కు ఫిర్యాదుకూడా చేశాడు. మాదిగ దండోరా సంస్థ అధ్యక్షుడు మందకృష్ణ కేసీఆర్ వ్యాఖ్యలపై కరీంనగర్‌లో నిన్న తీవ్రంగా ప్రతిస్పందించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల తెగ్గోసుకుంటానని గతంలో అన్న కేసీఆర్, ఇప్పుడు దళితులను మరోసారి అవమానించాడని, రాజయ్యను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది మొత్తం ముగ్గురు మంత్రులేనని(కేసీఆర్, కేటీఆర్, హరీష్) విమర్శలు రావటం, రెవెన్యూమంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ తిట్టినట్లు వార్తలు రావటం మొదలైన అంశాల నేపథ్యంలో రాజయ్య వ్యవహారాన్ని పెద్ద ఇష్యూగానే చెప్పుకోవచ్చు. మరి ఇంత ముఖ్యమైన వార్తను ప్రధానంగానే ఇవ్వవలసి ఉంది. మరి ఈ వార్తకు ఈనాడులో లభించిన ప్రాధాన్యం చూస్తే....అసలు ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఎస్‌సీ-ఎస్‌టీ కమిషన్‌లో కేసీఆర్‌పై ఫిర్యాదు వార్త అసలు రానేలేదు. మందకృష్ణ స్పందనను ఆరవ పేజీలో ఒక మూల ఆరువాక్యాలతో సింగిల్ కాలమ్‌గా ఇచ్చారు. పోనీ తెలంగాణ ఉద్యమంఅంటే, తెరాస పార్టీ అంటే అంత సానుభూతి, అభిమానంఉందా అంటే అదీలేదు. తెలంగాణ ప్రభుత్వ అనుకూల వార్తను తెలంగాణ ఎడిషన్‌లలోనేమో ప్రభుత్వానికి అనుకూలంగా, ఆంధ్రప్రాంతంలో మరొకరకంగా మార్చి ఇవ్వటం తెలిసిందే.

తెలుగులో ప్రధాన దినపత్రికలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకో, వ్యాపారవేత్తకో అనుబంధసంస్థలైపోవటంవలన వచ్చిన అనర్ధం ఇదంతా. జరుగుతున్న పరిణామాలను ఆయా పత్రికలు తమతమ ప్రయోజనాలకనుగుణంగా మార్చి రాస్తున్నాయి. ఈనాడులో ఇలా తమకనుకూలంగా వార్తలను మార్చటం, ప్రతికూలమైన వార్తలను ఇవ్వకపోవటం పరిపాటిగా మారింది(ఇదే అంశంపై ఈ బ్లాగ్‌లో ఇంతకుముందు వచ్చిన వ్యాసాన్ని ఈ లింక్‌లో చూడొచ్చు.

టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై అనధికార నిషేధం విషయంలో మిగిలిన తెలుగు మీడియా సంస్థలు ఉదాశీనంగా ఉండటంపై కాంగ్రెస్, బీజేపీవంటి రాజకీయపార్టీలు ఒకవైపు బహిరంగంగా విమర్శిస్తూఉండగా, మరోవైపు కేసీఆర్ దురహంకార, నియంతృత్వ(నేను హిట్లర్‌నేనని ఆయనే స్వయంగా వాక్రుచ్చారు) వైఖరిని జాతీయమీడియా(తెలంగాణకే చెందిన ప్రముఖ జాతీయస్థాయి పాత్రికేయుడు వెంకటనారాయణతోసహా) దుమ్మెత్తిపోస్తూ ఉండగా వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తమరిపాటికి తమరు ఇలా అధికార పార్టీకి బాకా ఊదుతూఉండటం సబబేనా రామోజీరావుగారూ!

                              ***

తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని ఎగతాళిచేసేవారిని, మీడియాసంస్థలను మెడలు విరగ్గొట్టి, భూమిలో పదికి.మీ. అడుగున పాతరేస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఛానెళ్ళ చర్చలను ఈ క్రింది వీడియోలలో చూడొచ్చు... 


కొసమెరుపు: టైమ్స్ నౌ చర్చలో అర్ణబ్ గోస్వామి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ నోరుమూయించినవైనం చూసితీరవలసిందేగానీ మాటలలో చెప్పలేము.

Comments

  1. Eenadu could become Namaskte KCR - 1 Who knows?

    ReplyDelete
  2. పత్రికాధిపతులు ప్రభుత్వాలని శాసించాలనుకోవదం, రామోజీ రావు చేసినా రాధాక్ర్ష్న చేసినా మనం యెట్తి పరిస్థితుల్లోనూ సమర్ధించ కూడదు!ప్రజ లెన్నుకున్న ప్రభుత్వాలూ, వాటి అధినేతలూ ఖచ్చితంగా పత్రికా రంగం కన్నా ఒక మెట్తు పైనే వుండాలి.పదవుల్ని దుర్వినియోగం చేసే వాళ్లని మినహాయిస్తే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చటానికి ప్రజలు యెన్నుకున్న వాళ్లకి పూర్తి బాధ్యత వుంటుంది.

    అయితే పత్రికలు పరిధిని మించి అధికారం చెలాయించడ మనేది నేను వొదిలేస్తే అని యెవరి గురించి చెప్పానో అలాంటి వాళ్ళ్ళు అధికారం లోకి రావడం వల్లనే జరుగుతుంది!యెందుకంటే పదవుల్ని దుర్బినియోగం చెయ్యద మంటేనే యేమీ చెయ్యక పోయినా చేసినట్టు కలరు పులమడం అవస్రం కాబట్టి తాము చేసిన దాని కన్నా అధికంగా ప్రచారాన్ని కోరుకునే లక్షణం వాళ్లలో వుంటుంది కాబట్టి అధికారంలో వున్న వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు సొంతంగా యెదగలేరు అన్నది నా అభిప్రాయం.

    లోపం అసమర్ధు లయిన నాయకులదే.వీళ్ళు సమర్ధు లయితే ప్రజలే వీళ్ళకి సమర్ధతని కట్టబెడతారు. ప్రజలతో సంబంధం లేని రాజకీయాలు నదప దల్చుకున్న వాళ్లనే పత్రికాధిపతులు బ్లాక్ మయిల్ చెయ్యగలరు.

    ReplyDelete
  3. Eenadu was Namaste NTR-1 for decades! ABN is Namaste CBN-1 for years now.

    ReplyDelete
  4. గోడు చెప్పుకునే నాథుడు లేక మూసివేయబడిన తెలంగాణ గొంతుకలకు నమస్తే తెలంగాణ పత్రిక ప్రాణం పోసింది, తెలంగాణ ఉద్యమంలోనే ప్రధాన పాత్ర వహించింది. తెలంగాణ పక్షపాతి అయిన ఆ పత్రిక తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న వారి గురించి మంచిగా రాయటంలో తప్పులేదు కదా? నిజానికి మంచి చేసేవాడి గురించి ఎవరైనా మంచే చేస్తున్నాడని రాయాలి. తెలంగాణకు కెసిఆర్ మంచి చేస్తుంటే ఆ మంచినే ఈనాడు రాస్తే తప్పేముంది?

    ఇక ఉపముఖ్యమంత్రి అన్న మాటను ఖండించటం - ఆ పని సాద్యాసాద్యాలు తెలిసిన రాష్ట్ర అధినేతగా కెసిఆర్ కు ఖండించే హక్కు ఉంది. యూనివర్శిటీ స్థాపించడం అన్నది కేంద్రం నుండి పొందవలసిన విషయం, రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ఇచ్చిన హామీలే కార్యరూపం దాల్చలేవు, అటువంటప్పుడు కొత్తగా తమ పరిధిలో లేని హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టటం మంచిది కాదన్న ఉద్దేశ్యం వల్లనే ఖండించటం జరిగింది. ప్రజల్లో ఇచ్చిన హామీని సాద్యంకాదని ప్రజల్లోనే చెప్పాడు ధైర్యంగా. ఉపముఖ్యమంత్రి మాటను ఖండించటం ప్రతిపక్షాలకి, విరోధి వర్గాలకి ప్రముఖవార్తేమో కాని పత్రికలకు కాదు.

    ఇక టీవీ చానెల్స్ ప్రసారలాను ఆపి వేసింది తెలంగాణా కేబుల్ ఆపరేటర్లు. ఆ విషయమై హైకోర్టు వరకూ వెళ్లారు, కేబుల్ ఆపరేటర్స్ కి అనుకూలంగానే తీర్పు చెప్పింది న్యాయస్థానం. అవి పే చానల్స్ కావు, కేబుల్ ఆపరేటర్లు వారి ఇష్టం వచ్చిన జనాలు కోరిన చానల్స్ ని చూపించుకోవచ్చు. తెలంగాణలో ప్రసారమయ్యేవి 98% ఆంధ్రా చానల్సే, వాటికి ఎవరూ అభ్యంతరం తెలపడం లేదు అన్న విషయం కూడా మనం గమనించాలి.

    ఏ విషయాలైనా మనం ఆలోచించే ధొరిణిని బట్టి, మన ఇష్టాయిష్టాలను బట్టి, సమయాన్ని బట్టి మంచి-చెడుగా కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమ వార్తలను ఏ మూలనో ప్రచురించినపుడు మీరు ఈనాడును ప్రశ్నిస్తూ టపా రాసి ఉంటే, ఇపుడు రాసిన టపాకి అర్థం అనేది ఉండేది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని