Skip to main content

ఆంధ్రా కేజ్రీవాల్ అవ్వాలనుకుంటున్న శివాజికి విశాఖలో చేదు అనుభవం


ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు.

'మాస్టర్' చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన శివాజి, గుంటూరుజిల్లా నర్సరావుపేటప్రాంతానికి చెందిన సామాన్యకుటుంబంనుంచి వచ్చారు. హైదరాబాద్‌లో జెమిని టీవీ ఛానల్‌లో మొదట చిన్నఉద్యోగం చేసేవారు. ఒకరోజు పాటల ప్రోగ్రామ్‌కు యాంకర్ రాకపోవటంతో మంచి మాటకారి అయిన శివాజినే ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు యాంకర్‌ను చేసేశారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు 2000 సంవత్సరంలో కొత్త నటీనటులకోసం నిర్వహించిన పోటీలో సెలక్ట్ అయ్యారు. 'పరదేశి' అనే సినిమాలో అవకాశం సంపాదించుకుని 'మాస్టర్' చిత్రంద్వారా వెలుగులోకి వచ్చారు. హీరో స్నేహితుడి వేషాలు వేస్తూ ఉండే శివాజి మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలద్వారా హీరోగా ఓ వెలుగు వెలిగారు. మాస్ హీరోగా ఎదగాలని స్టేట్ రౌడీ, సీతారాముడు అనే కొన్ని చిత్రాలు తీయగా అవి వారంకూడా ఆడలేదు. ఆ దెబ్బతో చిన్న సినిమాల ఆఫర్‌లు కూడా పోయాయి. ఇటీవల అవకాశాలు లేకపోవటంతో తనే స్వంతంగా 'బూచమ్మ బూచాడు' అనే కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. అది ఓ మాదిరిగా నడిచింది.

టీవీ9 ఎడిటర్ రవిప్రకాష్‌తో సాన్నిహిత్యం కలిగిఉన్న శివాజీ, ఆ ఛానల్ మద్దతుతో ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదో ఒక సమస్య తీసుకుని రోడ్డెక్కుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ టీవీ9 అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెంవద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం బాధితుల సమస్యతో ఉద్యమాల బాటలో బయలుదేరారు. ఆ తర్వాత, తిరుమలలో దేవస్థానం బోర్డ్ ధనికులకు ఊడిగం చేస్తోందంటూ హైదరాబాద్‌లో ఒకరోజు ధర్నా చేశారు(టీటీడీ బోర్డ్ ఛైర్మన్ కావాలన్నది తన కోరికలలో ఒకటని ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో వాక్రుచ్చారు). రోడ్డుప్రమాదాలు ఎక్కువైపోతున్నాయంటూ కొన్నిరోజులు ఆక్రోశం వెలిబుచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం గళమెత్తారు. అన్నిపార్టీలూ కలిసి ఏపీని తొక్కేస్తున్నాయని, దీనికోసం ఉద్యమించాలని నినదించారు. అంతర్యుద్ధం తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు.

లక్ష్యం స్వార్థపూరితమైనప్పటికీ ఆ ప్రయత్నంలో శివాజి మరింత శ్రద్ధ, కృషి పెడితే బాగుండేది. ఏదో ఒక సమస్యతో టీవీ ఛానల్‌లో కనిపించాలనికాకుండా, చిత్తశుద్ధితో ఏదో ఒకటి నిర్మాణాత్మకంగా చేయాలి. ఆ సమస్యను సమూలంగా అధ్యయనం చేయాలి. శివాజి సభలలో మాట్లాడే మాటలు చూస్తే పరిణతితోకూడినవిగాలేకపోగా చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉన్నాయి. షార్ట్‌కట్‌లద్వారా తొందరగా పైకి ఎగబాకాలనికాక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా శివాజి కృషిచేస్తే బాగుంటుంది.



Image courtesy:fb.com/ActorSivaji

Comments

  1. ఆంద్ర కేజ్రీవాల్ స్వ. ఎంఎస్ నారాయణ గారండీ బాబూ. శివాజీ & లోక్సత్తా నారాయణ రాజకీయాలలో ఎంఎస్ నారాయణ లాంటి వాళ్ళు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.