Skip to main content

'superlative' ముఖ్యమంత్రి కేసీఆర్


చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్‌ చదువుకున్నవారందరికీ parts of speech లోని ఎనిమిది భాగాలలో Adjective అనేది గుర్తుండే ఉంటుంది. ఆ Adjectiveలో Superlative Adjective అనే మరో సబ్ క్యాటగిరీ ఉంటుంది. ఆ సూపర్‌లేటివ్ ఎడ్జెక్టివ్‌కు అర్థం 'సర్వోత్కృష్టమమైనది' అని. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సమయాలలో, సందర్భాలలో ఆయా సమస్యలకు ప్రకటిస్తున్న 'సర్వోత్కృష్ట' పరిష్కారాలగురించి చెప్పేందుకు. అదేమిటో ఏ సమస్యకుకూడా సర్వోత్తమమైనది తప్పితే దానికి తక్కువస్థాయిలో పరిష్కారం కేసీఆర్‌కు కనబడదు. 

ఏదైనా సమస్యను వివరించటం ఆలస్యం ఆయన దానికి సర్వోత్కృష్టమైన పరిష్కారం ప్రకటించిపారేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా మొదలుపెట్టిన ఈ పోకడ, అధికారం చేపట్టిన ఆర్నెల్ల తర్వాతకూడా కొనసాగుతూనేఉంది. నాడు ప్రచారంలో పేదలకు డబల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, మూడెకరాల పొలం, కోటి ఎకరాలకు సాగునీరు, లక్షా 25వేల ఉద్యోగాలు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు చేశారు. వాటి ఆచరణ ఏదశలో ఉందో ఎవరికీ తెలియదు. వాగ్దానాలుమాత్రం  అధికారం చేపట్టిన తర్వాత మరింత జోరందుకున్నాయి.

తాజాగా చూస్తే...త్వరలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలదృష్ట్యా హైదరాబాద్‌నగరంమీద దృష్టి కేంద్రీకరించిన దొరవారు భాగ్యనగరాన్ని అమెరికాలోని డాలస్ నగరంలాగా చేస్తానని ఇవాళ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న నగరంలోని పేదలందరికీ టవర్స్ అనే ఆకాశహర్య్యాలను కట్టించి గృహవసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. టవర్స్ అంటే గుర్తొచ్చింది...హుస్సేన్‌సాగర్‌చుట్టూ వంద అంతస్తుల ఆకాశహర్మ్యాలు కట్టిస్తానని, వాటిలో ప్రపంచంలోనే ఎత్తయిన టవర్ కూడా ఉంటుందని ఆ మధ్య చెప్పారు. హుస్సేన్ సాగర్ శుద్ధికి రు.100 కోట్లు, వినాయక సాగర్ నిర్మాణం, హైదరాబాద్ ఉత్తరాన మరో విమానాశ్రయం...తదితర వాగ్దానాలుకూడా చేశారు. ఇటీవల యాదగిరిగుట్ట సందర్శనకు వెళ్ళిన సందర్భంగా గుట్టను తిరుపతిని తలదన్నేలా వాటికన్ స్థాయిలో ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రం చేస్తానని వాక్రుచ్చారు. బ్రాహ్మణుల సభలో వారి సమస్యలను ఏకరువు పెట్టగానే 50 కోట్ల రూపాయలతో అర్చక సంక్షేమనిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ధూప దీప నైవేద్యాలకోసం ఒక్కొక్క గుడికి నెలకు రు.6 వేలరూపాయలు మంజూరు చేస్తానని మరో వాగ్దానం. వరంగల్ నగరాన్ని సూరత్ స్థాయిలో టెక్స్‌టైల్ హబ్‌గా మారుస్తానని, కరీంనగర్‌ను లండన్, న్యూయార్క్ నగరాలస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. మళయాళీల సభలో వారి భవనానికి ఎకరం స్థలం, కోటిరూపాయల నిధులు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇల్లులేని మళయాళీ కుటుంబాల జాబితా ఇస్తే డబల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక తెలంగాణలోని ప్రతి ఇంటికీ నాలుగేళ్ళలో నల్లా ఏర్పాటు చేయిస్తానంటూ 28వేల కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్ పథకాన్ని ఆర్భాటంగా ఆవిష్కరించారు. ఈ గ్రిడ్ ప్రపంచ రికార్డ్ సృష్టిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఈ గ్రిడ్‌కోసం భూమి చుట్టుకొలతకు నాలుగురెట్లు పొడవైన పైప్ లైన్లు వేయబోతున్నట్లు ప్రకటించారు.

పిట్టలదొరలాగా హామీలు ఇచ్చేస్తున్నాడని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా, ఈ వాగ్దానాలు - ఆచరణ విషయంలో కేసీఆర్‌ పాపులారిటీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి హనీమూన్ వ్యవధిని కాస్త ఎక్కువగానే ఇచ్చే మైండ్‌సెట్‌లో ఉన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంకాబట్టి కాస్త టైమ్ ఇవ్వాలని జనంలో అభిప్రాయం నెలకొని ఉంది(అందుకేనేమో సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానల్ నిర్వహించిన పోల్‌లో కేసీఆర్ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్‌గా ఎన్నికయ్యారు). ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వం చేసినదానినిగురించి చెప్పుకోవాలంటే కనిపిస్తున్నది ఏమైనా ఉందా అంటే - అది ఒక్క సమగ్ర సర్వే మాత్రమే(ఆ సర్వేలోని డేటాను ఎలా వినియోగించుకున్నారో తెలియటంలేదుగానీ, త్వరలో మళ్ళీ మరో సర్వే చేయించబోతున్నారట). కేసీఆర్ ఇప్పటికైనా మేలుకుని 'బెస్ట్ ఇంపాజిబుల్ సొల్యూషన్‌' ప్రకటనలను గుప్పించటంకాక ఆచరణసాధ్యమయ్యే పరిష్కారాలకోసం కృషి చేస్తే బాగుంటుంది.

photo courtesy:www.telangana.gov.in

Comments

  1. పబ్బం గడుపుకునేందుకు ఏదో ఒకటి చెప్పి నెట్టుకు రావాలి మరి. 'వినేవాడు వెర్రి వెంగళప్ప ఐతే చెప్పేవాడు మహా మెథావి ' అనే సామెత వుండనే వుంది కదా!

    ReplyDelete
  2. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా.

    ReplyDelete
  3. నిజం చెప్పడానికి సాక్ష్యాలూఒ రుజువులూ కావాలి,యెదతి వాడు ప్రస్నిస్తే ఇంకొంచెం సమాచారం ఇవ్వడానికి సిధ్ధంగా వుందాలి!అబధ్ధం చెప్పడానికి అన్ని జాగ్రత్తలు అక్కర్లేదుగా?నోతి కొచ్చింది వాగేస్తే వినసొంపుగా వుంతే చాలు చప్పట్లు కొట్టే జనాలు వున్నంతవరకూ అతని మాటలకి తిరుగు లేదు - అదృష్టవంతుడు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.