Tuesday, February 10, 2015

ఢిల్లీలో అద్భుతాన్ని ఆవిష్కరించిన సామాన్య మానవుడు!


ఎనిమిది నెలలక్రితం తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న 'మోడి-షా అండ్ కో'కు ఢిల్లీ ఆమ్ ఆద్మీలు(సామాన్య మానవులు) దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏకపక్షంగా - కేంద్రీకృతంగా వ్యవహారాలు నడుపుతున్న మోడి-షా ద్వయానికి ఇది చెంపపెట్టు. అమిత్ షా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలలో తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. తమపార్టీ ఎంపీలు 300మందినికూడా అమిత్ షా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దించారు. ఢిల్లీ నగరంలో గణనీయసంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంత తెలుగువారిని ఆకట్టుకోవటంకోసం ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఆఖరు నిమిషంలో కిరణ్‌బేడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు(దీంతో అంతర్గత విభేదాలు మొదలై ఇదే చివరికి 'బూమరాంగ్' అయింది). స్వయంగా నరేంద్ర మోడి విస్తృతంగా ప్రచారసభలలో పాల్గొని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని దాదాపు సంవత్సరకాలంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించింది. పార్టీ వ్యవస్థను పోలింగ్ బూత్‌స్థాయినుంచి పునర్నిర్మించుకుంది. కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించటంపై చేసిన జాప్యం ఆమ్ ఆద్మీపార్టీకి కలిసొచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఎన్నికలకు సిద్ధమైలేకపోగా ఆమ్ ఆద్మీమాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దానికితోడు గతంలో తాను తప్పు చేశానని కేజ్రీవాల్ నిజాయతీగా క్షమాపణ వేడుకుని ప్రజలలో తనపైఉన్న అసంతృప్తిని తొలగించుకున్నారు. తనమీద ఉన్న అరాచకముద్రను తొలగిపోయేలా పాత ధోరణిని మార్చుకున్నారు. కిరణ్‌బేడివంటి ప్రత్యర్థులు రెచ్చగొట్టినా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మఫ్లర్, గళ్ళచొక్కా, కళ్ళజోడువంటి సామాన్యమానవుడి గెటప్‌తో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు(మోడి రు.10 లక్షల సూట్ ధరించటం పలు విమర్శలకు దారితీసింది). బుఖారి మద్దతు ప్రకటించినా దానిని తిరస్కరించటం కేజ్రీవాల్ తీసుకున్న మరో మంచి నిర్ణయమని చెప్పాలి.

ఈ ఎన్నికల ఫలితంనుంచి ఇటు మోడి-షా ద్వయం, అటు కేజ్రీవాల్ బృందం నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. మోడి-షా ద్వయం తమ అహంకారాన్ని వీడి పార్టీలో, ప్రభుత్వంలో వికేంద్రీకృత, ప్రజాస్వామిక వ్యవహారశైలిని అనుసరించాలి. కేజ్రీవాల్ బృందం తమ గెలుపుకు కారణాలను గుర్తెరిగి గతంలో చేసిన తప్పులను(ఒక్కసారి జాతీయస్థాయికి ఎదిగిపోవాలని ప్రయత్నించటం, ప్రతిదానికీ రోడ్డుకెక్కటం వగైరా) పునరావృతంకాకుండా చూసుకోవాలి. 

image courtesy: wikipedia

No comments:

Post a Comment

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts