Saturday, September 20, 2014

'ఆగడు' కాదు - 'దూకుడు సింగ్'

టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్  లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్.

ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకానంతస్పీడుగా ఉన్నాయంటే ఈ డైలాగులు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో మెరుపులు ఎక్కడా కనబడలేదు. సినిమా అంతా సాదా, సీదాగా సాగిపోతూ ఉంటుంది. కొన్నిచోట్ల బోరుగాకూడా అనిపిస్తుంది. తమన్ స్వరాలు నానాటికి తీసికట్టుగా తయారవుతుండటం తెలిసిందే. పాటల చిత్రీకరణలో నూతనత్వం, విజువల్ ట్రీట్ ఏమీ అనిపించలేదు. ఫోటోగ్రఫీచూస్తే - పోలీస్ స్టేషన్ సన్నివేశాలలో ఒక ప్రత్యేకమైన టింట్ కనిపించేటట్లు చేశారు. అది ఏమీ ఆహ్లాదకరంగా అనిపించకపోగా, లోపంలాగా కనిపించింది. శృతిహాసన్ పాటలోకూడా ఈ టింట్ కనబడటంతో అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటల లొకేషన్స్ బాగున్నాయి. సినిమామొత్తం భారీతనం అణువణువునా కొట్టొచ్చినట్లు కనబడింది. ఫస్ట్ హాఫ్ గబ్బర్ సింగ్, సెకండ్ హాఫ్ దూకుడు ప్రభావం బాగా కనిపించింది. సెకండ్ హాఫ్ లో విలన్స్ ను కొట్టే సన్నివేశాలలో నాయక్ చిత్రం గుర్తుకువస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువగా ఉండటం సినిమాకు మరో మైనస్ పాయింట్.

మరోవైపు గతవారం పోలీస్ కథలతోనే అనుక్షణం, పవర్ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. 'అనుక్షణం' విమర్శకుల ప్రశంశలు అందుకుంది. 'పవర్'లో రవితేజ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫయింగ్ గా, ఎనర్జిటిక్ గా ఉంది. ఇలాంటి సమయంలోనే రిలీజైన ఆగడులో మహేష్ పోలీస్ పాత్రను ఆ పాత్రలతో పోల్చటం అనివార్యం. వాటితో పోలిస్తే ఆగడులో మహేష్ పోషించిన ఎన్ కౌంటర్ శంకర్ పాత్ర గొప్పగా అనిపించదు. ప్రకాష్ రాజ్ శ్రీనువైట్లతో గొడవగురించి ప్రెస్ మీట్ లో చెప్పిన నామీద రాళ్ళు విసరకు, ఇల్లు కట్టుకుంటాను అనే కవితను ఈ చిత్రంలో విలన్ సోనూ సూద్ తో చెప్పించారు.

టాక్ వీక్ అయినప్పటికీ మేగ్జిమమ్ ధియేటర్లలో రిలీజ్ చేశారుకాబట్టి మొదటి వారంలో ఓపెనింగ్స్ ద్వారా నిర్మాతలు బాగానే రాబట్టుకోగలుగుతారు. ఏది ఏమైనా మహేష్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts