Friday, September 12, 2014

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ!


శతాధిక చిత్రాల దర్శకుడు, అన్నమయ్య, రామదాసువంటి 'కళాఖండాల' సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గతంలో ఒకసారి ప్రముఖ నిర్మాత కె.మురారి చెప్పుదెబ్బనుంచి తృటిలో తప్పించుకున్నారట. ఈ వైనాన్ని మురారి ఇవాళ చెన్నైలో స్వయంగా వివరించారు. 

చెన్నైలో నివశించే మురారి ఇవాళ ఒక పుస్తకా‌విష్కరణ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ యాజమాన్యం డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు డాక్టరేట్ ఇవ్వటంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రకటింటిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి విషయంలో ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరంలేదని, అయితే రాఘవేంద్రరావుకు ఇవ్వటం సరైన నిర్ణయం కాదని మురారి అన్నారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మూర్తి అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. 

ఇక రాఘవేంద్రరావు గురించి చెప్పుకొస్తూ, అతనికి సంస్కారం లేదని, పెద్దలంటే గౌరవంలేదని మురారి అన్నారు. ఒకసారి అతను తమ ఇంటికి వచ్చినపుడు తమ ఇంటి హాల్‌లో తన తల్లిదండ్రుల ఫోటోను చూశాడని, ఆ ఫోటోలోని తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా, అంత అసహ్యంగా ఉందని రాఘవేంద్రరావు అన్నాడని మురారి చెప్పారు. ఆ మాటలతో తాను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తాను తేరుకుని స్పందించేలోపు, రాఘవేంద్రరావు తన భావాలను గమనించి వెంటనే వడివడిగా బయటకెళ్ళిపోయి కారులో ఉడాయించాడని మురారి చెప్పారు. తాను చెప్పుతీసేలోపుగానే ఇదంతా జరిగిపోయిందని తెలిపారు. రాఘవేంద్రరావు తనకు డబ్బలుకూడా ఎగ్గొట్టాడని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్‌‌లగురించి హేళనగా, చౌకబారుగా వ్యాఖ్యానిస్తాడని అన్నారు. అలాంటి సంస్కారహీనుడికి డాక్టరేట్ ఇవ్వటం ఏవిధంగా సముచితమని ప్రశ్నించారు. మురారి వ్యాఖ్యలపై10టీవీలో వార్తను ఈ లింక్‌లో చూడొచ్చు. మురారి యథాతథంగా చెప్పినమాటలను ఈ లింక్ లో చూడొచ్చు.

సీతామాలక్ష్మి, గోరింటాకు వంటి చిత్రాల నిర్మాతగా ప్రసిద్ధిగాంచిన మురారి రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్రిశూలం, జానకిరాముడు అనే చిత్రాలను నిర్మించారు. రాఘవేంద్రరావు ఒకటో, రెండో తప్పితే పెద్దగా వివాదాలలో ఉండే మనిషికాదు. పదేళ్ళక్రితం ఒక అమ్మాయి వివాదంలో నటుడు రాజశేఖర్ దర్శకేంద్రుడిని ఇంటికెళ్ళిమరీ బట్టలు చిరిగిపోయేవరకు కొట్టటం, అంతకుముందు నర్తకి సిల్క్ స్మితకు ఆయనకు మధ్య గొడవవంటి అతికొద్దివివాదాలుమాత్రమే ఆయన కెరీర్‌లో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్‌2లోని ఆయన మల్టీప్లెక్స్ నిర్మించిన స్థలంవివాదం రాజకీయపరమైనది. వివాదరహితుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని తన అభిమానులచే, తనవర్గంవారిచే కీర్తించబడే రాఘవేంద్రరావును మొత్తానికి మురారి బజారుకీడ్చారు. అదీ గౌరవ డాక్టరేట్ తీసుకునేముందు. ప్చ్!

                                                          ***

1 comment:

 1. -పదేళ్ళక్రితం ఒక అమ్మాయి వివాదంలో నటుడు రాజశేఖర్ దర్శకేంద్రుడిని ఇంటికెళ్ళిమరీ బట్టలు చిరిగిపోయేవరకు కొట్టటం
  -నర్తకి సిల్క్ స్మితకు ఆయనకు మధ్య గొడవ
  - బంజారాహిల్స్ రోడ్ నంబర్‌2లోని ఆయన మల్టీప్లెక్స్ నిర్మించిన స్థలంవివాదం
  -తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా, అంత అసహ్యంగా ఉందని రాఘవేంద్రరావు అన్నాడని
  -రాఘవేంద్రరావు తనకు డబ్బలుకూడా ఎగ్గొట్టాడని
  అత్యంత వివాదరహితుడు అన్న మాట

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts